Showing posts with label కవిత. Show all posts
Showing posts with label కవిత. Show all posts

Wednesday, October 16, 2024

' వర్గ ' న్యాయం

 కవిత // ' వర్గ ' న్యాయం //    


వ్యవస్థలకు వర్గీకరణలు కొత్త కాదు

వర్గాలకు కేటాయింపులు కొత్తకాదు

పంపాకాల లెక్కలలో

బొక్కలు కనిపించినపుడే

రాజ్యం అనివార్యమయింది

స్వార్ధ బుద్దులను నిలువరించడానికి

శ్రేష్ట పాలన అవసరమయ్యింది

 

వర్గీకరణ అంటే సౌలభ్యం

వర్గీకరణ అంటే నాణ్యత

వర్గీకరణ అంటే ఉనికి 

వర్గీకరణ అంటే వాస్తవికత

 

మార్క్స్ పోరులో

వెబర్ చట్టబద్దతలో

డర్ఖయిమ్ సంఘీభావంలో 

వర్గం’ అతి ప్రాముఖ్యం

అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ

కాంట్ అనుభవాల వర్గీకరణ

ఫుకో అధికార సంబంధాల వర్గీకరణ

సమాజానికి మేలు కాక కీడు చేసాయా

సిద్దాంతమైనా? సమాజమైనా

వర్గీకరణలో సౌలభ్యం ఉంటుంది 

 

ప్రాంతాలుగా వర్గీకరణ

లింగాలుగా వర్గీకరణ

సమాజాలుగా వర్గీకరణ

వయస్సుల వారీ వర్గీకరణ

నైపుణ్యాల వర్గీకరణ

కులాలుగా వర్గీకరణ

మేలు కాక కీడు చేసాయా

 

వర్గీకరణ జ్ఞానం ఉన్నతమైనది

విషయ పరిజ్ఞానంలోని

లోతులను చెబుతుంది

లోటు పాటులను సరిచేస్తుంది

వర్గీకరణ జ్ఞానానికి అంతం లేదు

వర్గీకరణ లేని సమాజమూ లేదు

సహేతుకత ఒక్కటే ప్రామాణికత

 

ఐక్యతలోనుండి మనుషులు పుట్టలేదు

మనుషులే ఐక్యత అవసరాన్ని గుర్తించారు

ఐక్యత చెరిగిపోని శాసనం కాదు

ఐక్యత నిర్భంధమూ కాదు

ఒప్పందాలు నిర్వీర్యమైనపుడు

నమ్మకాలు వమ్ము అయినపుడు

ఐక్యత అవకాశవాదమైనపుడు

పరిమిత వాదానికి రెక్కలొచ్చినపుడు

ఫలాల వర్గీకరణ అనివార్యమవుతుంది

 

సమానత్వమే ఐకమత్యం

వర్గీకరణే సమైఖ్య తత్వం

వర్గీకరణ గమ్యం సమానత్వం

వర్గీకరణ గమ్యం ఐకమత్యం

- డా. సురేష్ కుమార్ దిగుమర్తి




Saturday, November 9, 2019

కోతి గాడు

కోతి గాడు

అమాయకమైన రెండు పిల్లులు
ఉన్నంత వరకూ
తెలివైన ఆ కోతి
తన పబ్బం గడుపుకుంటూనే
ఉంటుంది

పిల్లులు అమాయకత్వాన్ని
జయిస్తే
కోతులు తెలివి తేటలు
పెంచుకుంటాయి

కధ ఎన్ని మలుపులు తిరిగినా
కోతి గమ్యం చేరాల్సిందే
అక్కడ..
ముసిముసిగా నవ్వుతూ
పై మెట్టు మీద కూర్చుని
పిల్లిని చూడనట్టు
కోతికి కోటి పనులున్నట్టు
కొత్త నాటకం మొదలు

అనుకోకుండా నిన్ను చూసి
ఆబగా పిల్లిని కౌగలించుకుని
ఆత్రంతో అడిగింది
"ఏమై పోయావు భయ్యా"

-డా. సురేష్ కుమార్ దిగుమర్తి //10.11.2019//

Thursday, October 24, 2019

గుణపాఠం

వాడు నన్ను కొట్టాడు
వాడికి సమ్మగా ఉంది
నాకు నొప్పిగా ఉంది

నేను కొట్టాను
నాకు తృప్తిగా ఉంది
తనకు మంటగా ఉంది

వాడు మళ్లీ కొట్టాడు
నాకు బాధ కలిగింది
వాడికి తృప్తి కలిగింది

అప్పుడు వాడు నాతో అన్నాడు
నువ్వేమొదలెట్టావు
నేను బాకీ తీర్చాను
నువ్వెలా ఉంటే
నేనలా ఉంటాను

దూరంగా నిలబడి చూస్తున్న కోతి
జుట్టు గోక్కొని చెట్టెక్కేసింది

 - డా. సు.కు.ది  17/10/2010

కుక్క చావు

అది కుక్కో, పిల్లో తెలియదుగానీ
కానీ చచ్చేది మాత్రం కుక్క చావే
రహదారిపై రోజూ కనిపించే దృశ్యమే ఇది
ఏ ఆకలి తనని తరిమిందో
ఏ కోరిక తనను తడిమిందో
తనెందుకలా రోడ్డు దాటాలనుకుందో
చక్రాల మధ్య చితికిపోయింది
లారీ తలకాయ తొక్కేసి వెళ్లిపోయింది
జీపు గుండెకాయను చిదిమేసింది
వచ్చీ పోయే వాహనాలన్నీ
పేగులను పచ్చడి చేసేస్తున్నాయి
కారుతున్న రక్తాన్ని
దారిన పోయే చోదకులు
కొంచెం కొంచెంగా పట్టుకుపోతున్నారు
తెల్లారేసరికి
అట్టముక్కలా
అతికించిన అందమైన బొమ్మలా
ఆ నిర్జీవ చర్మం

ప్రయాణికులకు స్వాగతం పలుకుతుంది
- డా. సు.కు.ది.  //15.09.2019//

Thursday, April 12, 2018

ఈ దేహం
స్నేహానికే కాదు
సమరానికి సిద్దమే!
ఈ మనస్సు
మోసపోవడానికే కాదు
గుణపాఠం చెప్పడానికి సిద్దమే!
ఈ గుండె
నన్ను బ్రతికించడానికే కాదు
ఎన్నో జీవితాలను వెలిగించడానికి సిద్దమే!
ఈ జీవం
జీవించడానికే కాదు
మరణించడానికి సిద్దమే!
నేను సిద్దమే అని చెబుతున్నా
నీ సంసిద్దత కోసం చూస్తున్నా
తోడొస్తావా మిత్రమా!

 డా. సు.కు.ది. 

(కాస్టింగ్ కౌచ్ భూతాన్ని బయటికి చూపిస్తున్న శ్రీరెడ్డి కి సంఘీభావంగా) 

Thursday, August 18, 2016

ఏమై పోయింది

ఒక్క క్షణం..
కళ్ళు చెమర్చాయి
గుండె ఆగినట్టయింది
నమ్మడం కష్టమైపోయింది
నా నమ్మకానికి
ఆత్మగౌరవానికి
ఆక్రందనకు
ఏకైక గుర్తు
ప్రపంచం ఒకవైపు
తనో వైపు ఉన్నా
భయపడని యోధుడు
ఆరిపోయిందనుకున్నా
ప్రతీసారీ
నీరుపోసి నిలబెట్టినోడు
వర్గాలు వందలైనా
వాగ్ధాటి కలిగిన ఏకైన మొనగాడు
జీవితం నేర్పిన అక్షరాలతో
నేర్పరులనే నిలబెట్టేయగలిగినోడు
మేజిక్కులు చేసేవోళ్లకి
లాజిక్కుల పంజా విసిరినోడు
నిద్రపోయిన జాతిని
నడిమధ్యలోకి నెట్టినోడు
ఒక్కసారిగా... ఒక్కసారిగా...
ఎందుకలా ఒంగిపోయాడు
అతని అంతః సంద్రంలో
ఏదో కలకలం మొదలైందా
ఆ సునామీ తాకిడికి
తను తల్లడిల్లిపోయాడా
కోట్ల గుండెల ఆశలన్నీ
కన్నీటి సముద్రాలవుతున్నాయా
మా సేనాధిపతికి
ఇన్ని ప్రకంపనలు పంపినదెవరు
గోటితో పోయినదాన్ని
గొడ్డలిదాకా తెచ్చినదెవరు
ఆలోచిస్తే ...
ఒక్క క్షణం..
కళ్ళు చెమర్చాయి
గుండె ఆగినట్టయింది
నమ్మడం కష్టమైపోయింది

Whose cow?

Yes, your cows were stolen
Yes, you saw them tanning the skin
why didn't you confirm the belongingness
why did you hurry to beat black and blue
This is called fundamentalism!
vengeance on marginalised!
Where are the thieves?
if they are caught
if they not dalits
can you repeat 'black and blue'
this is called caste discrimination!
what can you owe me
my dignity, respect, identity
my hands were wet with blood
I was having sharpest knives on my hands
but I don't want to see your blood
walk along with me to the religion of humanity
to practice 'three gems' of our constitution
LIBERTY, EQUALITY, FRATERNITY
[In Solidarity to my brethren in Amalapuram attack]

Monday, September 7, 2015

మాస్టర్ కీ!

ఓయీ రాజు!
రాజ్యం పోయిందని రాజసం పోయిందా
రాజసం లేని నీకు రాజ్యమెక్కడొస్తుందోయ్
ఆ క్షణాలు పోతే పోనీయ్.. ఆ లక్షణాలేమయ్యోయ్!!

నిలబడి చూసేది కాదు కదా ఆట
అయినా ఆడకుండా చూస్తూనే ఉంటావేం
ఎంతకాలం ఈ కాలం చెల్లిన క్రీడలు
చేసే పనిలో వైవిధ్యానికే విలువ
విలువ లేని వివిధ పనులకు కాదు
ఎంతకాలం సాగుతుందీ రణం
వాడ వాడలా నీకోసం నిలబడి
చూపిస్తున్న రాజ్యాంగం కనబడలేదా
అన్నింటికీ సమాధానం అందులోనే
రండి... రాజ్యాంగం గోల్ కొడదాం!!

రాజులా గౌరవించమన్నాడు పురుషోత్తముడు
రాజ్యాన్నే ఇచ్చేసాడు  అలెగ్జాండర్
రాజసం లేని నీకు రాజ్యమెక్కడొస్తుందోయ్!!

వర్గీకరణ అడిగేడిది మనం
రణంగా మార్చేది వాడు
హక్కులడిగితే నాలుక కోస్తాడట
పెద్దాయన పుస్తకం మన దగ్గర లేదని
వాడి ధీమా
ఇప్పుడు
చెదలతోనూ, చెట్లతోనూ, మట్టితోనూ కాదు
మన యుద్దం
మను ధర్మాన్ని తోసి
మన ధర్మాన్ని రాసిన ఆ పుస్తకంతో
రండి... రాజ్యాంగం గోల్ కొడదాం!!

గతం ఘనమైనదైనపుడు
భవిష్యత్తూ మనదే
వర్తమానం సంధికాలం
కోల్పోడానికి ఏమీ లేని వాడికి
గెలవడానికీ ఏమీ ఉండదు
యుద్దమే... అవసరమైనపుడు
వ్యర్ధమైన మాటలెందుకు
రండి... రాజ్యాంగం గోల్ కొడదాం!!

గాయాల చిట్టాలో
విజయాల పద్దులో
తేల్చుకునే సమయమిది
ముందుగా నడిచిన అడుగులు
స్పూర్తిగా నిలిచిన దిక్కులు
భవిష్యత్తును తాకిన అనుభవాలు
మనల్ని పిలుస్తున్నాయి
ఓయీ రాజు!
రాజ్యం పోయిందని రాజసం పోయిందా
రాజసం లేని నీకు రాజ్యమెక్కడొస్తుందోయ్
ఆ క్షణాలు పోతే పోనీయ్.. ఆ లక్షణాలేమయ్యోయ్

రండి... రాజ్యాంగం గోల్ కొడదాం!!


http://magazine.saarangabooks.com/2015/09/03/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%80/

Wednesday, May 13, 2015

నమ్మకమే విజయం

నమ్మకమే ప్రారంభం

ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉంటే


నమ్మకం పెరుగుతూ ఉంటుంది


ఒక్కో ముడి విప్పుతూ ఉంటే 


నమ్మకం పెరుగుతూ ఉంటుంది


ఒక్కో గమ్యం చేరుతూ వుంటే


నమ్మకం పెరుగుతూ ఉంటుంది


ఒక్కో పైసా మిగులుతూ ఉంటే


నమ్మకం పెరుగుతూ ఉంటుంది


ఒక్కో అక్షరం కదులుతూ ఉంటే


నమ్మకం పెరుగుతూ ఉంటుంది


ఒక్కో క్షణం సాగుతూ ఉంటే


నమ్మకం పెరుగుతూ ఉంటుంది


ఒక్కొక్కటి పేర్చుకు పోతున్న


నమ్మకమే విజయం


Wednesday, April 9, 2014

అయింది లేటు.. అయినా తగ్గలేదు ఘాటు



నీ మాటలలో ఏదో తెలియని అయస్కాంతం ఉంది
నీ దగ్గరగా వచ్చానేమో – నన్ను లాగేసింది
మాటల మైకంలో మురిపించేస్తుంది
ప్రేమల మాటలతో సొంతం అయ్యింది
ఈ ప్రేమ, ఈ మాట

జీవితాంతం ఉంటే బావుంటుంది!!

నువు నాకు నచ్చావంటూ నా మనసే చెబుతుంది
నీతోనే ఉండాలంటూ నియమాలే చెబుతుంది
ఊహలలోనైనా నీతో - ఎడబాటే అనిపిస్తే
మరుక్షణమే నే..ను - నీకోసం వచ్చేస్తా!!

http://chirb.it/D8Gksx http://chirb.it/D8Gksx

Wednesday, May 9, 2012

విగ్రహమే నిగ్రహం



బొమ్మ అంటే అందరికో లోకువే
ఉలకదు... పలకదు అనేనా

పలుకులను పంక్తులుగా తీర్చి దిద్దడం
ఒకే పంక్తిలోకి సమాజాన్ని సమీకరించడం
ప్రాణం విలువను బోధించడం
ప్రతీరోజూ గుర్తు చేసే బొమ్మ

ఆడిపోసుకోవడం అలవాటైన సమాజానికి
అడ్డంగా నిలబడి
అడ్డగోలుగా మాట్లాడొద్దని
అవగాహనని పెంచిన బొమ్మ

అవకాశం హద్దు ఆకాశమని
నీ ఇంటిముంగిట్లో నిలబడి
నీ భవిష్యత్తుని కళ్లకు చూపిస్తూ
నిలబడిన బొమ్మ

ఎన్ని విగ్రహాలు పడగొడితే
నాలోని రూపాన్ని పడగొట్టగలరు
నా గుండెల్లో నెలవున్న
నా చైతన్యంలో భాగమైన
ఆయన రూపం ఎత్తుకి
ఎవరు చేరుకోగలరు

ఆ రూపం నాలోనే కాదు
ఇప్పుడు అందరిలోనూ గూడు కట్టుకుంది
కొందరికి నాయకుడిలా
కొందరికి దేవుడిలా
కొందరికి మార్గదర్శిలా
కొందరికి శత్రువులా

ఇప్పుడది నా రూపం కాదు
అది నవ భారత రాజ్యాంగం
రత్నమై మెరిసిన భారతం

అందుకే ఇప్పుడు సమాజం
నా మీద కోపాన్ని
ఆ దిమ్మ మీదున్న బొమ్మ మీద చూపిస్తుంది
రాళ్లను దేవుళ్ళుగా కొలిచే రాజ్యంలో
ఒక అందమైన రూపాన్ని భరించడం కష్టమే

ఈరోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను
రాళ్ళతో నీ యుద్దం
ఆలోచనలతో నా యుద్దం
ఇదే నా విజయం
ఈ నిలకడైన నిజం కోసం
’బొమ్మలా’ నిలబడి చూస్తున్నాను

మేం స్ప్రింగులం.. రింగు రింగులుగా తిరిగి
గింగిరాలు కొట్టిస్తాం
నా బొమ్మ మీద ఉమ్మేసినోళ్లందరికీ
దిమ్మ తిరిగిపోయే షాకిస్తాం
మెదడు లోతుల్లోకి చొచ్చుకు పోయిన
బొమ్మను జ్ఞాపకం చేసుకుంటూ

14.4.2012


Thursday, October 6, 2011

అమ్మ ’చెప్పకూడనిది’ చెప్పింది

అమ్మ చెప్పింది!
చనిపొమ్మని
అందుకే ... చనిపోయాను
అమ్మకు చెప్పింది
చంపెయ్యమని
అందుకే చంపేసింది
నేనెవ్వరికీ పనికి రానని,
నావల్ల ఎవరికీ ఉపయోగం లేదని,
నేను చనిపోతేనే అందరికీ మంచి చేసినవాడినవుతానని,
సమాజం భావించింది.
ప్రతీ క్షణం నా అమాయకత్వాన్ని వాడుకున్నవాడికి
నేనంటే బరువే
నా అమాయకత్వం వలన పొందిన పెద్ద పెద్ద ఉపయోగాలకన్నా,
పొందలేక పోయిన చిన్న చిన్న ఉపయోగాల కోసమే నేను చావాలి.
ఈరోజు నా అమాయకత్వమే నేను చనిపోవడానికి అర్హత
నా అమాయకత్వం ద్వారా వీళ్ళు పొందిన లాభాలు సరిపోయినట్టులేదు
అందుకే నేను శాశ్వతంగా చావాలి
దాని ద్వారా వాళ్లంతా బ్రతకాలి
’వాళ్ళు బ్రతకడం కోసం నేను చావాలి’
కాదు.. కాదు.. నన్ను చంపెయ్యాలి
నన్ను చంపడానికి అమ్మ ఆయుధమయ్యింది
అమ్మకూ నన్ను చంపడమే న్యాయం అనిపించింది
బ్రతికినోడికన్నా.. చచ్చినోడి గొప్పోడని
అమ్మ నన్ను గొప్పోడిని చేయాలనుకుంది
ఈ అలజడిని, ఈ చావుని
ముందే ఊహించిందో హృదయం
చావునుండి తప్పించాలని ఎంతో తాపత్రయపడింది
కానీ.. అమ్మ ముందు ఓడిపోయింది
ఎందుకంటే అమ్మ అంతకుముందే ఓడిపోయింది
నేను అందరిలా లేకపోవడమే ...
అమ్మను ఓడిపోయెలా చేసింది
నేను అందరికన్నా ఎంతముందున్నానో
గుర్తించలేదు
ఎంత వెనుకున్నానో గుర్తించారు
ఎందుకో తెలుసా...
ఎవరైనా ఒక విశయాన్ని గుర్తించాలంటే
ముందుగా అది వారికి తెలిసి ఉండాలి
వారి ’అమాయకత్వం’
నాలోని ప్రత్యేకతలను అంగీకరించలేకపోయింది
అందుకే ఈ అవకాశాన్ని వాడుకొంది
ఒక గొప్ప పనిని నాకు అప్పజెప్పి
మరే పనీ చేయకుండా ఆపేసింది
అమ్మ చెప్పింది... చనిపొమ్మని
అమ్మే చంపేసింది.
[అమ్మ చెప్పింది [06.10.2011] సినిమా చూడడం ముగించిన వెంటనే... ఇలానే అనిపించింది]
-సురాధిప-

Tuesday, September 8, 2009

దీవెన మాలిక

దీవెన మాలిక
సరిగమపా...సప్త స్వరాలు
జీవన గమనంలో...ఏడు రంగులు
క్షణమే ధైర్యం - మరు క్షణమే భయం
క్షణమే సంతోషం - మరు క్షణమే సంశయం
ఏ రంగు ఎపుడొస్తుందో తెలుసు కోవడం జీవితం
ఏ శృతిలో పాడితే మాయమవుతుందో తెలిపేదే జ్నానం
నిన్నా మొన్నా నీకు తెలిసింది బాల్యం
నేడు, రేపు నీకు తెలిసేది జీవితం
ప్రశ్న అడిగితే బాల్యం
ప్రశ్నలే లోకమైతే యవ్వనం
ప్రశ్నకు జవాబు తడితే జీవితం
ప్రశ్నలన్నింటికీ సమాధానం అనుభవం
ఆ అనుభవం ఎవ్వరిదైనా నీకు అపురూపం
అనుభవాల సారాన్ని రంగరించి
అరచేత్తో దీవిస్తున్న వారందరికీ
వందనాలందించి
అణుకువ ఆభరణమై
క్రమశిక్షణ శిరోధారణమై
జగతినేలే విద్వత్తు


నీ కంఠ భూషణమై
సమాజాన్నెదిరించే శక్తి
నీ చిటికెనవేలి ఉంగరమై
అమ్మలోని పాఠాల పటిమ
నీ ఆలోచనల సమాహారమై
నాన్నలోని కార్య దీక్షత
నీ హృదయ స్పందనయై
అలుపులేని జీవిత సాగరంలో
నీ ప్రతీ అడుగు ఓ మలుపు కావాలని
ప్రతీ మలుపులోనూ
నువ్వు వెలుగై వెలగాలని
ఆ వెలుగులో అశేష ప్రజానీకానికి
నువ్వో బలమైన దిక్కవ్వాలని
కోరుకుంటున్న
బంధుమిత్ర సపరివార సమేతంగా
మా దిగుమర్తి వారి
శుభాశ్శీసులు

-సురేష్ కుమార్ దిగుమర్తి-
[07.09.2009 Shiney Beaula ను ఇలా శుభాకాంక్షలు అందించాను]

Sunday, March 8, 2009

రాక్షసులమా!

అమ్మా...
మేము రాక్షసులం కాదమ్మా
గాయపడ్డ గుండెలం
దగాపడ్డ మనుషులం
ప్రజాస్వామ్యంలో ఎదురుచూసి
అలసిపోయినోళ్ళం

ప్రాణాలరించైనా సాధించాలనే తప్ప
ప్రాణాలు తీయాలని ఎప్పుడూ అనుకోలేదు
అందుకే.. ఇన్నాళ్ళుగా ఊరకున్నాం
విధి నిర్వహణలో ఘోరం జరిగింది
మాలో.. ఒక కుటుంబానికి కాదు
80 లక్షల మందికి నాయకులైన వారు
అమరులయ్యారు
మా దిక్కులు చెరిగిపోయాయి
మా ఘోష అడవి పాలయ్యింది
మా మొర గాలిలో కలసిపోయింది
మా ప్రయత్నం వెటకారమయ్యింది

నాకు తెలివి లేనప్పుడు నాతో
ఉన్నవాళ్ళంతా నేడు పక్కకు తొలగారు
నా మార్గాన్నే తప్పంటూ
సూటిపోటి మాటలతో పొడుస్తూనే ఉన్నారు
నా అడుగు, మాట అన్నీ
బూతద్దంలో బొమ్మలయినాయి
నీకు మేము రాక్షసులమయినాము

మా నాయకులంతా నోళ్ళు
కుట్టేసుకున్నారు
అధికారాల ఆటలో మా జాతి
వారి ముందు చిన్నబోయింది
ప్రళయం వచ్చినా అది తెరుచుకోదు
లోకమంతా దుమ్మెత్తి పోస్తున్నా
వారికి పట్టదు

అందుకేనమ్మా...
ఆవేదన కట్టలు తెంచుకొని
ఆవేశం పెల్లుబికి
ఆశల ఎండమావి కూడా దూరమైపోతుంటే
ఆగలేక చేసిన అఘాయిత్యంలో ...
నీకు మేము రాక్షసులమయినాము
మావోళ్ళు వేగుచుక్కలైనారు

08.03.2009, 06.05 pm

Wednesday, February 25, 2009

నిశబ్దం పగిలింది






నిశబ్దం వీడి పోయింది
నా సహనం నశించి పోయింది
నా మౌనం ఇప్పుడు పొలికేకై అరుస్తుంది
నీ మాయ మాటలు నమ్మే రోజులు పోయాయి
నా వాటా...నాది
ఎవరు ఇవ్వరో తేల్చుకుంటాం
ఆరెతో చెప్పే కాదు
నీ నోరు కూడా కుట్టేస్తాను
కోసీ.. కోసీ.. రక్తానికి, మాంశానికి
నా కళ్ళు అలవాటు పడిపోయాయి
నాలో నేర్పరితనం పెరిగిపోయింది
నీ మాట ముగుసేలోగా
నీ చర్మం వలిచేస్తా
నువు కళ్ళు మూసేలోగా
నీ రక్తంలో నిన్ను స్నానం చేయిస్తా
ఖబడ్ఘార్...
నా మౌనం నీకు లోకువయ్యిందా
నా మంచితనం నీకు అలుసయ్యిందా
ప్రజాస్వామ్యంలో ఆట నీకే తెలుసా
నేను మొదలెట్టే వరకే అది
ఇప్పుడు సమాధానం చెప్పు
నిన్నటి వరకు ఇది నా సమస్య!
అందుకేనా అందరు చోద్యం చూస్తున్నారు
ఇక సమయం లేదు...మాట్లాడండి
నోట్లోని అడ్డాన్ని ఊసేయండి
మెదళ్ళుకున్న బూజు దులపి మాట్లాడండి
నేనిపుడు గాయపడ్డ ఆబోతును
నీ నాటకాలలో విసిగి, వేసారిన ఏనుగును
నేను ఊరిమీదికొస్తున్నాను
ఇంతవరకూ నా మౌనాన్ని చూసావు కదా
ఇప్పుడు నా కోపాన్ని కూడా చూడు
రగలిపోతున్న నా కళ్ళల్లోకి సూటిగా చూడు
దహించిపోతున్న నా గుండెను చూడు
మోగిస్తా... మోగిస్తా
నీ చెవులు పేలిపోయె దరువేస్తా
నీ కళ్ళు అదిరిపోయే నాట్యం చేస్తా
ఈ భయంతోనైనా నువు మాట్లాడాలి
పోకిరి మాటలు కాదు
తెరవెనుక ఆటలు కాదు
నేను యుద్దానికు సిద్దంగా ఉన్నాను
రా...రా..దమ్ముంటే తేల్చేసుకుందాం
అడుగని వారికే అన్నీ ఇస్తున్న నీకు
పదిహేనేళ్ళుగా నాగొంతు వినిపించడంలేదా
అరుపుటంటే ఎలా ఉందో వినిపిస్తాను
నిశబ్దం లావాలా పగిలితే
ఎలావుంటుందో చూపిస్తాను
న్యాయం కోసం వాటాలు పంచమన్నోడ్ని
తేడాలొస్తే నిన్నే వాటాలేసేస్తాను.


[ఎస్సీల వర్గీకరణలో నా వాటా కోసం]