Wednesday, October 16, 2024

' వర్గ ' న్యాయం

 కవిత // ' వర్గ ' న్యాయం //    


వ్యవస్థలకు వర్గీకరణలు కొత్త కాదు

వర్గాలకు కేటాయింపులు కొత్తకాదు

పంపాకాల లెక్కలలో

బొక్కలు కనిపించినపుడే

రాజ్యం అనివార్యమయింది

స్వార్ధ బుద్దులను నిలువరించడానికి

శ్రేష్ట పాలన అవసరమయ్యింది

 

వర్గీకరణ అంటే సౌలభ్యం

వర్గీకరణ అంటే నాణ్యత

వర్గీకరణ అంటే ఉనికి 

వర్గీకరణ అంటే వాస్తవికత

 

మార్క్స్ పోరులో

వెబర్ చట్టబద్దతలో

డర్ఖయిమ్ సంఘీభావంలో 

వర్గం’ అతి ప్రాముఖ్యం

అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ

కాంట్ అనుభవాల వర్గీకరణ

ఫుకో అధికార సంబంధాల వర్గీకరణ

సమాజానికి మేలు కాక కీడు చేసాయా

సిద్దాంతమైనా? సమాజమైనా

వర్గీకరణలో సౌలభ్యం ఉంటుంది 

 

ప్రాంతాలుగా వర్గీకరణ

లింగాలుగా వర్గీకరణ

సమాజాలుగా వర్గీకరణ

వయస్సుల వారీ వర్గీకరణ

నైపుణ్యాల వర్గీకరణ

కులాలుగా వర్గీకరణ

మేలు కాక కీడు చేసాయా

 

వర్గీకరణ జ్ఞానం ఉన్నతమైనది

విషయ పరిజ్ఞానంలోని

లోతులను చెబుతుంది

లోటు పాటులను సరిచేస్తుంది

వర్గీకరణ జ్ఞానానికి అంతం లేదు

వర్గీకరణ లేని సమాజమూ లేదు

సహేతుకత ఒక్కటే ప్రామాణికత

 

ఐక్యతలోనుండి మనుషులు పుట్టలేదు

మనుషులే ఐక్యత అవసరాన్ని గుర్తించారు

ఐక్యత చెరిగిపోని శాసనం కాదు

ఐక్యత నిర్భంధమూ కాదు

ఒప్పందాలు నిర్వీర్యమైనపుడు

నమ్మకాలు వమ్ము అయినపుడు

ఐక్యత అవకాశవాదమైనపుడు

పరిమిత వాదానికి రెక్కలొచ్చినపుడు

ఫలాల వర్గీకరణ అనివార్యమవుతుంది

 

సమానత్వమే ఐకమత్యం

వర్గీకరణే సమైఖ్య తత్వం

వర్గీకరణ గమ్యం సమానత్వం

వర్గీకరణ గమ్యం ఐకమత్యం

- డా. సురేష్ కుమార్ దిగుమర్తి