బరబ్బాను అర్ధం చేసుకోవడం అంటే ఒక దేశ రాజకీయ, సామాజిక, మానసిక, ధర్మ పరిస్తితులను అర్ధం చేసుకోవడంగా కనిపిస్తుంది. అనగనగా ఒక రోమా సామ్రాజ్యం. అక్కడి రాజకీయ పరిస్తితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఇలాంటి పరిస్తితులలో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూలగొట్టి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతమంది ఎన్ని మార్గాలు ఎన్నుకున్నారో మనకి తెలియదు గానీ, బరబ్బా అనే వ్యక్తి మాత్రం తీవ్రవాదాన్ని ఎంచుకున్నాడు. గెరిల్లా యుద్ద విధానాన్ని పాటిస్తూ రోమా ప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తున్నాడు.
అలాంటి సమయంలోనే మరొక వ్యక్తి రోమా సామ్రాజ్యపు క్రూర పాలనకు మూలాలైన మనిషి లోని స్వార్ధం, అసూయ, ధన బలం, అధికార దాహం, అంశాలపైన అవగాహన కల్పించడానికి పూనుకున్నాడు. ఆయన పేరు యేసు. అప్పటి వరకూ ఆధారమనుకున్న ధర్మ శాస్త్రాలు కొద్ది మంది పావులు వాడుకోవడాన్ని గమనించాడు. ఆ శాస్త్రాలకు అప్పటి కాలమాన అవసరాలను బట్టి కొన్ని మార్పులు చేయడానికి పూనుకున్నాడు. అందుకే సమాజంలో పాటిస్తున్న ఎన్నో అంశాలపై ఆయన వ్యాఖ్యానాలు ఇవ్వడం జరిగింది. యుద్దం అలసిపోయిన మనిషికి శాంతి అవసరం అన్నట్టుగా సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును చూస్తున్న ప్రజలకు యేసు ఒకింత ఓదార్పును కలిగించాడు. అందుకే ప్రజలు తండోపతండాలుగా ఆయన ప్రసంగాలకోసం ఎగబడ్డారు. అయితే విసిగి వేసారి పోయిన ప్రజలకు ఒక ఆశ కలిగించాడు. అదే పరలోకం. దేవుని రాజ్యం. ఈ రాజ్యం మనది కాదు అన్నాడు. ఇక్కడ పొందిన శ్రమలకు అక్కడ పరిహారం ఉంది అన్నాడు. ప్రజలకు ఒక నమ్మకం కలిగింది.
యేసుకు పెరిగుతున్న ఆదరణ బరబ్బాను ఆశ్చర్యపరిచింది. వెంటనే ఒక రాజకీయ నమూనాను తయారు చేసాడు. ఇద్దరం కలసిపోదాం అన్నాడు. బుద్ది, భుజ బలం తోడయితే వారి గమ్యం సులభమవుతుందని తన ఆలోచనను యేసు ముందుంచాడు. అయితే యేసు, తమ మార్గాలు వేరని, వారు కలసి పనిచేయడం సాధ్యం కాదని , సున్నితంగా తిరస్కరించాడు. ఆ తరువాత ఎక్కడా వీరిద్దరి కలసిన సంభాషణలు మనం చూడలేదు.
రాజ ద్రోహం నేరం మీద యేసు బంధించబడ్డాడు. ఒక సామాన్యుడు మహా జనాంగంతో రాజు అని పిలుపించుకుంటుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి భయం వేస్తుంది. ఆ భయం నుండే యేసుకు ఏ శిక్ష వేస్తే మరోసారి ఇలాంటివి జరుగకుండా ఉంటాయో అనే దానిపై చర్చ జరిగింది. సిలువ వేయడమే పెద్ద శిక్ష అనుకుంటే, శిలువ మోయడం కూడా జత చేసారు. ఆ వీధులలో అలా యేసు మోయలేక సిలువ మోస్తూ ఉంటే, మనిషన్నవాడెవ్వడూ మరో సారి యేసులా ఆలోచించకూడదన్నది రోమా ప్రభుత్వ ఉద్దేశ్యం.
ప్రజల సమక్షం లో తీర్పు జరుగుతుంది. యేసుపై శిక్ష ఖరారయ్యింది. కానీ ఎవరిని విడుదల చేయాలి. ప్రజలకు కోరుకొనే అవకాశం దొరికింది. ప్రజలు ఈ అవకాశాన్ని జారవిడుచుకోలేదు. ప్రజల తరపున యుద్దం చేస్తున్న బరబ్బానే కోరుకున్నారు. ఇది కేవలం అనుకోకుండా జరిగిన ప్రక్రియ కాదు. రాజకీయ క్రీడ. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య జరిగిన బహిరంగ ఆట. ప్రభుత్వానికి వేరే అవకాశం లేదు. ఇంత ప్రజాదరణ కలిగిన యేసును చంపెయ్యడమే ముఖ్యోద్దేశం. ప్రస్తుతం బరబ్బాకి అంత ప్రజాదరణ లేదు. అందుకే బరబ్బాను విడుదల చేసారు.
కానీ బరబ్బా మనసు నలిగిపోయింది. తను ఏ ప్రభుత్వం మారాలనికొని యుద్దం చేసాడో, ఆ ప్రయత్నంలో ఒక అమాయకుడికి కూరమైన శిక్షను విధించారు. నిజానికి రోమా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నింటికీ కారణమైన తనకు విడుదల, ప్రజల సంక్షేమాన్ని కోరుకొని, కొంత ఊరట కలిగించి, కొత్త జీవాన్ని నింపిన యేసుకు సిలువ శిక్ష. యేసు చెప్పాలనుకున్న రాజ్యం బరబ్బాకు అర్ధమయ్యింది. యేసు లాంటి వాడు బ్రతికి ఉంటే సంపూర్ణంగా వ్యవస్థ మారడానికి అవకాశం ఉంటుంది. ప్రవర్తనతో ప్రతీ వ్యక్తీ సైనికుడిగా మారే అవకాశం ఉంది. ఆ అవకాశం మరో సారి రాదు. మళ్ళీ నిర్మించుకోగలనన్న నమ్మకం లేదు. అందుకే అతని అడుగులు వేగంగా కదిలాయి. పరుగు పెడుతున్నాడు. గుండె పగిలేలా అరుస్తున్నాడు “యేసు నిర్దోషి”. దయచేసి అతనిని విడచిపెట్టండి, అతనికి బదులుగా నన్ను సిలువ వేయండి. నోరు మెదపలేని మహో జనాంగం ముందు ఒక వ్యక్తి (ఒకే ఒక వ్యక్తి) భోరున విలపిస్తున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు, తన్ను తాను అర్పించుకోడానికి సిద్దపడ్డాడు. ఒక అమాయకుడు శిక్షింపబడకూడదని.
• ఏ విషయాలు అర్ధం కాని వారికి యేసుకు ఎందుకు సిలువ వేసారో అర్ధం కాదు.
• యేసు దేవుడు కాబట్టి, సిలువ వేయుంచుకోవడానికి వచ్చాడు కాబట్టి అని, ఆ పని పూర్తయ్యే వరకూ ఎదురు చూసిన వారికి సిలువ ప్రయాణ నేపధ్యం అర్ధం కాదు
• బరబ్బాను బందిపోటు దొంగగా చూసిన వారికి ఆనాటి రాజకీయ నేపధ్యం, అతని అంత:సంఘర్షణ అర్ధం కాదు
• బైబిలులో ఏం రాసినా అది గొప్పే అనుకునే వాడికి “ఏమీ అర్ధం కాదు”
No comments:
Post a Comment