బొమ్మ అంటే అందరికో లోకువే
ఉలకదు... పలకదు అనేనా
పలుకులను పంక్తులుగా తీర్చి దిద్దడం
ఒకే పంక్తిలోకి సమాజాన్ని సమీకరించడం
ప్రాణం విలువను బోధించడం
ప్రతీరోజూ గుర్తు చేసే బొమ్మ
ఆడిపోసుకోవడం అలవాటైన సమాజానికి
అడ్డంగా నిలబడి
అడ్డగోలుగా మాట్లాడొద్దని
అవగాహనని పెంచిన బొమ్మ
అవకాశం హద్దు ఆకాశమని
నీ ఇంటిముంగిట్లో నిలబడి
నీ భవిష్యత్తుని కళ్లకు చూపిస్తూ
నిలబడిన బొమ్మ
ఎన్ని విగ్రహాలు పడగొడితే
నాలోని రూపాన్ని పడగొట్టగలరు
నా గుండెల్లో నెలవున్న
నా చైతన్యంలో భాగమైన
ఆయన రూపం ఎత్తుకి
ఎవరు చేరుకోగలరు
ఆ రూపం నాలోనే కాదు
ఇప్పుడు అందరిలోనూ గూడు కట్టుకుంది |
కొందరికి నాయకుడిలా
కొందరికి దేవుడిలా
కొందరికి మార్గదర్శిలా
కొందరికి శత్రువులా
ఇప్పుడది నా రూపం కాదు
అది నవ భారత రాజ్యాంగం
రత్నమై మెరిసిన భారతం
అందుకే ఇప్పుడు సమాజం
నా మీద కోపాన్ని
ఆ దిమ్మ మీదున్న బొమ్మ మీద చూపిస్తుంది
రాళ్లను దేవుళ్ళుగా కొలిచే రాజ్యంలో
ఒక అందమైన రూపాన్ని భరించడం కష్టమే
ఈరోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను
రాళ్ళతో నీ యుద్దం
ఆలోచనలతో నా యుద్దం
ఇదే నా విజయం
ఈ నిలకడైన నిజం కోసం
’బొమ్మలా’ నిలబడి చూస్తున్నాను
మేం స్ప్రింగులం.. రింగు రింగులుగా తిరిగి
గింగిరాలు కొట్టిస్తాం
నా బొమ్మ మీద ఉమ్మేసినోళ్లందరికీ
దిమ్మ తిరిగిపోయే షాకిస్తాం
మెదడు లోతుల్లోకి చొచ్చుకు పోయిన
బొమ్మను జ్ఞాపకం చేసుకుంటూ
|
No comments:
Post a Comment