అమ్మ చెప్పింది!
చనిపొమ్మని
అందుకే ... చనిపోయాను
అమ్మకు చెప్పింది
చంపెయ్యమని
అందుకే చంపేసింది
నేనెవ్వరికీ పనికి రానని,
నావల్ల ఎవరికీ ఉపయోగం లేదని,
నేను చనిపోతేనే అందరికీ మంచి చేసినవాడినవుతానని,
సమాజం భావించింది.
ప్రతీ క్షణం నా అమాయకత్వాన్ని వాడుకున్నవాడికి
నేనంటే బరువే
నా అమాయకత్వం వలన పొందిన పెద్ద పెద్ద ఉపయోగాలకన్నా,
పొందలేక పోయిన చిన్న చిన్న ఉపయోగాల కోసమే నేను చావాలి.
ఈరోజు నా అమాయకత్వమే నేను చనిపోవడానికి అర్హత
నా అమాయకత్వం ద్వారా వీళ్ళు పొందిన లాభాలు సరిపోయినట్టులేదు
అందుకే నేను శాశ్వతంగా చావాలి
దాని ద్వారా వాళ్లంతా బ్రతకాలి
’వాళ్ళు బ్రతకడం కోసం నేను చావాలి’
కాదు.. కాదు.. నన్ను చంపెయ్యాలి
నన్ను చంపడానికి అమ్మ ఆయుధమయ్యింది
అమ్మకూ నన్ను చంపడమే న్యాయం అనిపించింది
బ్రతికినోడికన్నా.. చచ్చినోడి గొప్పోడని
అమ్మ నన్ను గొప్పోడిని చేయాలనుకుంది
ఈ అలజడిని, ఈ చావుని
ముందే ఊహించిందో హృదయం
చావునుండి తప్పించాలని ఎంతో తాపత్రయపడింది
కానీ.. అమ్మ ముందు ఓడిపోయింది
ఎందుకంటే అమ్మ అంతకుముందే ఓడిపోయింది
నేను అందరిలా లేకపోవడమే ...
అమ్మను ఓడిపోయెలా చేసింది
నేను అందరికన్నా ఎంతముందున్నానో
గుర్తించలేదు
ఎంత వెనుకున్నానో గుర్తించారు
ఎందుకో తెలుసా...
ఎవరైనా ఒక విశయాన్ని గుర్తించాలంటే
ముందుగా అది వారికి తెలిసి ఉండాలి
వారి ’అమాయకత్వం’
నాలోని ప్రత్యేకతలను అంగీకరించలేకపోయింది
అందుకే ఈ అవకాశాన్ని వాడుకొంది
ఒక గొప్ప పనిని నాకు అప్పజెప్పి
మరే పనీ చేయకుండా ఆపేసింది
అమ్మ చెప్పింది... చనిపొమ్మని
అమ్మే చంపేసింది.
[అమ్మ చెప్పింది [06.10.2011] సినిమా చూడడం ముగించిన వెంటనే... ఇలానే అనిపించింది]
-సురాధిప-
1 comment:
heart touching movie. nee kavita inkaa baruvekkinchindi.
Post a Comment