Tuesday, January 12, 2010

స్వేచ్చకోసం ద్వితీయ ముద్రణ

నేను 13.09.2009 ఖమ్మం కవులతో నా అనుబంధం నా అనుభంధం అని ఒక బ్లాగు రాసాను. దానిని సైదులు ’స్వేచ్చకోసం’ ద్వితీయ సంకలనంలో [భావకుల హృదయ స్పందన ’స్వేచ్చకోసం’ (ఓ పాఠకుని ప్రతిక్రియ)] వేసాడు. మళ్ళీ ఈ మధ్య ఫోన్ చేసి 13.01.2010 న ద్వితీయ సంకలనం విడుదల చేస్తున్నాము, నువ్వు వచ్చి ఆతీయ పలుకులు చెప్పాలి అన్నాడు. నేను వేరే పనిలో ఉన్నాను రాలేనంటే, నీ మాటలన్నీ బ్లాగులో రాయి, అవే చదువుతాను అన్నాడు. నా మాటలకు అంత విలువిచ్చిన స్నేహితునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తనకోసం...



తెలంగాణా ఆత్మను నింపుకొన్న "స్వేచ్చకోసం"
ప్రజా రచయితల సంఘం (ఖమ్మం) శ్రీ శీ స్మారక సంకలనం

తెలంగాణా బతుకు చిత్రాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన కావ్యం ఇది. చెట్టు పేరు చెప్పకుండానే పండు రుచి చూపించిన ఘనత పుస్తకం లోని కవితలది. మొదటి మాటలోనేతట్టిలేపేదే కవిత్వంఅని చెప్పిన సంపాదకులు ప్రతీ కవితతోనూ పాఠకుడిని స్పృశించే ప్రయత్నం చేసారు. ఈ సంకలనం పాత జీవితాలనుండి, కుల కుట్రల నుండి స్వేచ్చ కోరుకుంటుంది, స్వేచ్చగా దేశ భవిష్యత్తును తీర్చి దిద్దాలని ఆరాటపడుతుంది, తాను పడ్డ కష్టాలనుండే స్పూర్తి పొందుతుంది, కల్మషంలేని [నాటి] పల్లె బతుకును పోలిన వ్యవస్థను కోరుకుంటుంది, అన్నీ తానై అయిన అమ్మకు తానేం చేయాలో సూచిస్తుంది.

జీవితాలపై పరిశీలన

కాలం మారుతుందే కానీ జీవితాలు మారడం లేదని, వర్ణాశ్రమ ధర్మం మాటున ఇంకెన్ని జీవితాలు బలవుతాయో అని గద్దపాటి శ్రీనివాస్ ఆవేదన చెందుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వచ్చిన మార్పులు మనుషుల మనసులలో రాలేదని, ఇంకా మూఢ వాసనలే కొడుతున్నాయని, అమానుషాన్ని, దారుణాన్ని నేర్పిన సంస్కృతిని ప్రశ్నిస్తున్నారు శీలం భీష్మారెడ్డి.

కులం స్వేచ్చకోసం

కులధృవీకరణ పత్రం కోసం కులం కాని, మతం కాని వాడి నుండి హామీ పత్రాన్ని పొందడం వెనుక మమ్మల్ని చదువుకు మరింత దూరంగా నెట్టేసే కుట్ర నడుస్తుందని గరికపాటి మణీందర్ ఎలుగెత్తి చెబుతున్నారు. గుండె బలాన్నిచ్చే గొడ్డుమాంసము సై తప్పిన నోటికి కొత్త జీవాన్నిస్తుందని, ఇన్ని కులాలు తినడం మొదలెట్టాకే కుర్ర మాంసం కిర్రెక్కినదని, అయినా తినేకాడ ఆచ్చాపనేందని అమాయకంగా అడుగుతాడు జి. మాణిక్యరావు.

దేశ భవిష్యత్తు

దేశం ఎక్కడ వెలిగిపోతుందని వెటకరిస్తారు డి. రామచంద్ర. చేనేత కార్మికుల మరణాలు, జీవితాలను మింగేసిన రోడ్లు, కరువు కాటకాలు అన్నింటికీ ప్రజలే సమాధానం చెప్పి, చరిత్ర పునర్మించాలంటాడు. సాయపడని వ్యవసాయం, తీర్చలేని అప్పులు, కళ్లం లోనే ప్రాణాలొదిన రైతు గురుంచి ఆర్ధ్రంగా చెబుతారు జి. లెనిన్ శ్రీనివాస్. మధ్యలోనే ఆగిన మొండి గోడలు, ఎందుకూ పనికి రాని అర్జీలపై అర్జీలు, ఏమయ్యాయో చెప్పాలని అడుగుతాడు వేము.

స్పూర్తి

విశాలమైన పల్లెల్లో, కాలుశ్య రహిత సమాజంలోనే పచ్చడి మెతుకులను అచ్చంగా అందించే అమ్మలోనూ, ప్రగతి’ సాధ్యమవుతుందని బాబు అభిప్రాయ పడతాడు. సూర్యుడు విశ్రాంతి కోసం కాదు, మరో ఉదయాన్ని సృష్టించడానికి తరలిపోయాడని అంతులేని ఆశావాదాన్ని అందించారు చొల్లేటి సునీత. చరిత్రను మార్చగలిగే యువత నేడు కర్కశంగా మారిపోతుందని భోగరాజు శోభన్ బాబు బాధపడుతున్నారు. ’అమ్మ కంట్లో ఎన్ని కన్నీళ్లు గుచ్చుకొన్నాయోఅంటూ తెలంగాణా పదాలలో అక్షరం అంతుచూడాలని చెబుతున్న సాయి లిఖిత మాటలు హృదయానికి హత్తుకొంటాయి. మనిషి లోపలి పొరల్ని చేదిస్తే-అంతర్మధనంలో అమృతం జాలువారి-అందరి హృదయాలకు-ఆత్మీయత పంచుతుందని వురిమెళ్ల సునంద మనసు మమతల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తారు.

పల్లె స్వేచ్చ కోసం

కడగండ్లు జీవితంలో వడగళ్ళై కురుస్తున్నాఆత్మ స్థైర్యంతోనే నా జీవన గమనం అంటారు బొమ్మరాత యల్లయ్య.
మితిమీరిన సైన్స్ పరిఞ్నానం విలయాన్ని సృష్టిస్తుందని మరో కోణాన్ని చూపిస్తారు కృష్ణ చైతన్య. మావూళ్ళో దేవుళ్ళు వూళ్ళోనైనా అలానే ఉంటారని, దేవుడి పేరుతో జరిగే ఆకృత్యాలని కళ్లకు కట్టినట్టు చూపిస్తారు వేకువ బాబు. తెలంగాణా ఎప్పుడూ గంగి గోవు కాదు, దెబ్బతిన్న పులులా తిరగబడుతుందని తెలంగాణా ఆత్మ గౌరవాన్ని తట్టి లేపుతారు శ్రీహరి అలవాల. స్వేచ్చగా తిరిగే మనిషి చుట్టూ అల్లుకున్న ఆంక్షలన్నీ "అనూహ్య అంకురాలుగా పోతగాని సత్యనారాయణ మంటల్ని రాజేస్తారు.
సంకలనం మహమ్మారి గుట్కా గురించి మొగిలి, బతుకు బండిని లాగుతున్న ముగ్గమ్మాయి గురించి టి.డి.చారి వివరించగా, కాదేదీ కాలుష్యానికనర్హం అని మానవాళి మనుగడను తుంచే నిత్య మరణ మృదంగాలనుకొత్త’గా గుర్తు చేస్తారు శంకర్ రెడ్డి.
అమ్మకోసం
అమ్మబోయిన తమలపాకుల్ని కొనబోయిన బియ్యం ఖరీదులోంచి తీసేస్తే మిగిలేది ఆకలే అని రోజులు మారినా మారని పేదరికం గురించి మాట్లాడుతారు సీతారాం. ’మాయమ్మ నుదుటిపై పగిలిన నెర్రల్ని చూసినప్పుడల్లా ’ ’మాయమ్మకు అమ్మనవ్వాలనుందిఅంటూ సైదులిచ్చిన ముగింపు మన బాధ్యతను, కర్తవ్యాన్ని తట్టిలేపుతుంది
శ్రీశ్రీ
ఈ సంకలనం శ్రీశ్రీ ని కొత్త తరం కవులకు పరచయం చేసింది, అర్ధం చేసుకొనే అవకాశం కల్పించింది. కొత్త భావుకులెవరైనా శ్రీశ్రీ ని పరిశీలిస్తే కవిత్వం సులభవుతుందని తేల్చి చెబుతూనే కవి ఎదలోతును పెంచే ప్రయత్నం చేసింది.

స్వేచ్చ కోసం
(ఖమ్మం కవుల శ్రీశ్రీ స్మారక కవితా సంకలనం)
సంపాదకులు:
సైదులు ఐనాల
శ్రీనివాసు గద్దపాటి

ప్రధమ ముద్రణ: జూన్ 2008
ద్వితీయ ముద్రణ: జూన్ 2009

ప్రతులకు:
ఐనాల సైదులు, కన్వీనర్, ప్రజా.ర.స
(కేజి) సిరిపురం, వైరా మండలం, ఖమ్మం జిల్లా - 507 165
cell: 9948714105

గద్దపాటి శ్రీనివాసు
ఇం.నెం # 4-2-151/65/1/సి/1, శ్రీనివాసనగర్, ఖమ్మం
cell: 9951660789

No comments: