1. నన్ను కలిసిన మొదటి ఖమ్మం కవి ఐనాల సైదులు. విచిత్రమైన కలయిక, కొన్ని క్షణాలలోనే అల్లుకున్న అనుబంధం, అంతలోనే మేమిద్దరం హైదరాబాదు యూనివర్సిటీలో రూమ్మేట్స్ అయిపోయాము. సైదులు కలయిక నా జీవితంలో చాలా విలువైన మార్పులను తీసుకువచ్చింది. తను కలసిన ప్రతీసారి ఒక్కో తూటాను నాపై వదిలి, మనసు పొరల్ని పేల్చేసి వెళ్ళిపోతాడు. నీ మాట పవర్ఫుల్ అని ఒకసారి, నీ మాటకన్నా నీ రాత ఇంకా పవర్ఫుల్ అని ఇంకోసారీ అనేసి, నా లోపలి వాడిని వెలికి (కెలికి) వెళ్ళిపోతాడు.ఈ రోజు నేను రాస్తున్న ప్రతీమాటకి ఈ 'ఖమ్మం' సైదులే స్పూర్తి.
2. ఈసారి కలసినపుడు తనతో గద్దపాటి శ్రీనివాస్ ని తీసుకువచ్చాడు. మా 'ఖమ్మం' కవి అంటూ పరిచయం చేసాడు. నువ్వు మా ఖమ్మం రావలయ్యా, అప్పుడే కదా మావాళ్ళు గురించి తెలిసేది అంటూ చాలా సార్లు ఆహ్వానించేవాడు. ఖమ్మం కవులు, రచయితల ఆధ్వ్యర్యంలో జరిగే ప్రతీ పనిని కళ్ళకు కట్టినట్టుగా వివరించేవాడు. అదే ఇప్పుడు నన్ను ఖమ్మం కవుల 'స్వేచ్చ కోసం' కు స్పందన రాయడానికి కారణం.
3. ఐనాల సైదులు, గద్దపాటి శ్రీనివాస్ సంపాదకత్వంలో వచ్చిన శ్రీ శ్రీ స్మారక కవితా సంకలనం "స్వేచ్చ కోసం" భావుకులందరికీ ఎంతో స్వేచ్చనిచ్చింది. కవిత్వానికున్న ప్రామాణికత ముసుగును తొలగించి మనసుపొరల్లో అల్లుకున్న ఏ భావాల తోరణమైనా కవితే అని చాటి చెప్పింది. రూపం మార్చిన కుల భూతాన్ని, కువ్వలలై ఎగిరెల్లిన మాదిగ మనసుని, శ్రీ శ్రీ సరళ సామ్రాజ్యాన్ని, బానిస చేసిన డాలర్ వర్షాన్ని, భరతమాత అరవై వసంతాల సిగ్గుని, ఎందుకో కొరగాని వినతి పత్రాల్ని వివరంగా చూపించింది.
ఈ ప్రజా రచయితల సమాఖ్య, అపనమ్మకాల అమ్మను నమ్మనంది, మండే ఆకలి బాధను ఎవరు తీసుస్తారంది, పురుగు మందుల పిరికితనానికి ధైర్యాన్నిచ్చింది, స్త్రీ మూర్థి తనపై జరుగుతున్న ఆగడాలకు ఖడ్గమై రావాలంది, కుంభకోణాల ఎన్నీకలాలను తన్నుకు చావమని, నఖ శిఖ పర్యంతం శ్రీ శ్రీ ని స్పౄశించి వదిలింది.
ఆ తడిమిన అక్షరాలను త్వరలో వివరిస్తాను
No comments:
Post a Comment