Friday, December 15, 2017

అంబేద్కర్ రచనలు – మహిళలు - దళిత మహిళలు

మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలే ప్రధాన అంశంగా ప్రపంచస్థాయి శిఖరాగ్ర సదస్సు ఒక వైపు, మట్టిపూలు బహుజని సాహితి సదస్సు ఒకవైపు అస్తిత్వం నుండి ఆకాశం వరకూ మహిళల భాగస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఇది. ఇది భారతరత్న అంబేద్కర్ కల. భారతీయ స్త్రీల కోసం అంబేద్కర్ పడిన తపన, కష్టం మరియు త్యాగం మన మనకు స్పష్టంగా తెలుసు. "అంబేద్కర్ రచనల్లో దళిత మహిళ" అనే అంశం హిందూ కోడ్ బిల్లులా విస్తారంగా కనిపించదు. దలిత మహిళ వివిధ రూపాల్లో అంబేద్కరునిలో కనిపిస్తుంది. అవేమనగా ఆయన ఆలోచన, రచన మరియు ఆచరణ. 1927 సం. మార్చి 19 & 20 తేదీలలో డిప్రెస్సుడు క్లాసుల సదస్సులో ఆయన ప్రధానంగా 'స్త్రీల విముక్తి' గురించి వక్కాణించడం జరిగినది. స్త్రీల యొక్క మానసిక-ఆత్మ స్వాతంత్య్రం పెంపొందడానికి ఇలాంటి సదస్సులు మరిన్ని జరగాలని, వారందరూ విధిగా హాజరు కావాలని ప్రభోదించాడు. ఆయన ఉద్దేశ్యంలో తల్లులు ఎలా ఉంటారో పిల్లలు అలానే ఉంటారు కాబట్టి 'విద్య' పురుషులకు ఎంత ముఖ్యమో స్త్రీలకు అంతే ముఖ్యమని బోధించాడు. 1927 డిసెంబరు 25 న జరిగిన మనుస్మృతి దహనం భారతదేశంలో ఉన్న అన్ని రకాల విచక్షణకు కారణమైన భౌతిక రూపాన్ని ధ్వంశం చేస్తూ, మన మనసులలో నాటుకుపోయిన స్వరూపాన్ని కూడా ధ్వంశం చేయాలన్నాడు. మను ధర్మంలో స్త్రీ బానిసత్వమే ధర్మంగా కొనియాడడం జరుగుతుంది. దళిత స్త్రీ కుల చట్రంలో పై కులాల స్త్రీలు సానుభూతిని కూడా పొందలేకపోవడం అత్యంత విచారకరం. ఎప్పుడైతే మనువు రూపం మనుషుల మస్తిష్కం లోనుండి తొలగిపోతుందో అప్పుడు ఈ దేశంలో ప్రధానమైన సమస్యలన్నీ సమసిపోతాయి. తద్వారా దళిత మహిళ అనేక రకాలైన స్వేచ్చను తిరిగి పొందుతుంది. మొత్తంగా చూసినట్టయితే సమస్య లోపల సమస్య. అంతులేని సమస్యల అంతర్వలయాలు. కారణం లేకుండా కార్యం జరుగదు కాబట్టి ఆ కారణాన్ని నాశనం చేయవలసిన అవసరం ఉంది. ఆధిపత్య కారణం స్థానంలో మానవత్వ కారణాన్ని ప్రతిక్షేపించాలి. దాని భ్రమణాన్ని, పరిభ్రమణాన్ని నిర్దేశించాలి. ఆ ప్రక్రియలో భాగమే మనుస్మృతి దహనంగా మనం అర్ధం చేసుకోవాలి. 1942 సం. జూలై 18-19 తేదీలలో డిప్రెస్డ్ క్లాసుల స్రీల సదస్సులో డా. అంబేద్కర్ మాట్లాడుతూ 'ఒక జాతి యొక్క అభివృద్ది కొలమానం ఆ జాతిలోని స్త్రీ సాధించిన అభివృద్దితోనే పోల్చగలమని అన్నారు. అంతేకాక ప్రతీ వివాహితురాలు తన భర్తకు సేవకురాలి అనే భావంతో విభేదించి, స్నేహితురాలిగా, భర్తకు తోడుగా సమస్థాయిలో నిలవాలన్నారు. అందులో భాగంగానే సమానమైన పనికి సమానమైన వేతనం, జీతంతో కూడిన ప్రసూతి సెలవు వంటివి ప్రతిపాదించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే స్త్రీ ప్రసూతి సెలవులను జాతి ప్రయోజనాలు మరియు నిర్మాణంలో ధృక్పధంతో చూడాలని సూచించారు. 

మరో ముఖ్యమైన సాక్ష్యం భారత రాజ్యాంగం. అంబేద్కరుడు స్త్రీల అభ్యున్నతికి అంకిత భావంతో, ఉత్సాహంతో మరియు నమ్మకంతో పనిచేసారన్న సంగతి మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. అసమానతలను సృష్టించిన అన్ని కారణాలను చేధించి, వాటిని స్థానంలో సమానతను పెంపొందింపజేసే ఒక ప్రతిని రూపొందిస్తే, దాని పేరే రాజ్యాంగం. స్తూలంగా చెప్పాలంటే చట్టం సమానత్వం, అవకాశాల సమానత్వం, మరియు వేతనాల సమానత్వం వంటి నిబంధనలు ఓ కొత్త భవిష్యత్తుకి శ్రీకారం చుట్టినవి. మరొక ప్రత్యేకమైన అంశం "హిందూ కోడ్ బిల్ 1948". కేవలం రాజకీయ కారణాల వల్లనే ఈ బిల్లు చట్టం రూపం దాల్చలేదు. కానీ ఈ బిల్లు తరువాతి కాలంలో వచ్చిన హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, హిందూ మైనారిటీ మరియు గార్డియన్ చట్టం, దత్తత మరియు నిర్వహణ చట్టం వంటి వాటికి మాతృకగా నిలిచింది. వివాహం, విడాకులు, మనోవర్తి, పసిపిల్లల సంరక్షణ, ఆస్తి వారసత్వం ఇవన్నీ ఉదహరణలే. అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కూడా ప్రతీ వర్గానికి అధికారం పంచుకునే అవకాశాన్ని కలిగించాయి. అంబేద్కర్ మాటలలో 'మహిళల తోడులేని ఐక్యతకు అర్ధం లేదు', 'స్త్రీకి విద్య లేకపోతే విద్యకు ఫలితం లేదు', 'స్త్రీశక్తి జతకాని ఉద్యమం సంపూర్ణం కాదు'. ఆయన నమ్మకంలో సమాజ స్థాయి అంటే ఆ సమాజంలో ఉన్న మహిళ యొక్క హోదా. అంటే భారత సమాజం యొక్క స్థాయి దలిత మహిళకు ఆపాదించిన హోదా వలన తగ్గిపోయింది. అంటే భారత సమాజ స్థాయి దలిత మహిళపై ఆధారపడి ఉన్నది అని మనం గమనించాలి. ఆ స్థాయి రూపాంతరం కేవలం విద్య ద్వారానే జరుగుతుందన్న సత్యాన్ని మనం గ్రహించాలి. విద్యావంతురాలైన దళిత స్త్రీ సమాజ అంతరాలను తొలగించడానికి కూడా ముఖ్య పాత్ర పోషించగలుగుతుందన్న సంగతి తెలుసుకోవాలి. డా. అంబేద్కర్ దళిత స్త్రీపై పలు రకాల గురుతర బాధ్యతలు ఉంచారు. అవేవనగా బాహ్య మరియు అంతర్గత పితృస్వామ్యాలను ప్రశ్నించాలి, తమ పురుషులను వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించాలి. వారితో కలసి సామాజిక ఉద్యమంలో పాలు పంచుకోవాలి. ఇలా అంతర్గత వ్యవస్థ పునర్నిర్మాణం చేసుకుంటూ బాహ్య వ్యవస్థలో పునర్నిర్మాణం చేయాలని ఆయన ఆశపడ్డారు. శాంతాబాయి ధాని ఆలయ సత్యాగ్రహం, షెడ్యూల్డు కులాల ఫెడెరేషన్ లో భాగం కావడం ఒక ఉదాహరణ. అంతేకాక అంబేద్కర్ జోగినీలను వ్యభిచార రూపంలో ఉన్న వృత్తులలోనుండి బయటికి రమ్మన్నాడు. ఆర్దికంగా కొంత ఇబ్బంది కలిగినా ఆత్మ గౌరవంతో బ్రతకడం చాలా ముఖ్యమన్నాడు. ఆయన అక్కడితో ఆగలేదు. యువకులకు జోగినీలను పెళ్లి చేసుకోమని అర్జించాడు. అంబేద్కర్ తన మహద్ ప్రసంగంలో 'దలిత స్త్రీలందరూ తమ అధీన స్తితిని తెలియజేసే దుస్తులు మరియు ఆభరణాలను వదిలివేసి, ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబిందే దుస్తులనే ధరించాలని అన్నాడు'. ఆయన ధృష్టిలో అది విముక్తికి సూచిక. ఎందుకంటే ఆయన ధృష్టిలో దలిత స్రీలు ఆత్మ గౌరవాన్ని నిండిన వారిగా, బహిరంగంగా మాట్లాడే ధైర్యం కలవారిగా, అభిప్రాయాలను స్పష్టంగా చెప్పగలిగే వారిగా ఉండాలి అని కోరుకుంటూనే వారు చెప్పే విషయాలను సవినయంగా వినాలి అనుకునేవారు. ఎందుకంటే అవి మరింత లోతైన అంశాలు తెలియజేస్తాయి. ఒక ఉదాహరణ ఏమంటే, 1945 మే 6 న జరిగిన అంటరాని మహిళల ఫెడరేషన్ లో మీనంబాయి శివరాజ్ "అంటరాని కులాలలో స్త్రీకి విడాకులకు మరియు పునర్వివాహానికి అవకాశాలు ఉన్నవి. హిందూ ధర్మాన్ని చొప్పించడం వలన పరిస్తితి దిగజారుతుంది కాబట్టి హిందూ ధర్మాన్ని మాకు వర్తింపజేయొద్దని కోరింది. ఈ పునర్వివాహాలు చర్చ హిందూ కోడ్ లో చేర్చడం సమాజాన్ని దలితీకరించడమని అర్ధం చేసుకోవాలి. అలాగే కులాంతర వివాహాలు ప్రోత్సహించడం అంటే సమాజంలో మానవ విలువలు పెంచడమే కదా!


వర్తమాన సమాజంలో అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన కొన్ని సంఘటనలు దళిత మహిళా గౌరవానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. దళిత స్త్రీ కేంద్రంగా కుల దురహంకార స్త్రీలు/ పురుషులు దాడులు జరుపుతూ, నగ్నంగా ఉరేగిస్తూ, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలలో ఉంచడం భైతికమైన దాడి మాత్రమే కాక మానసికమైనది కూడా. ఎన్.ఆర్.సి.బి.- 2017 ప్రకారం దళిత స్త్రీలపై లైంగిక నేరాలు పెరిగినవి. రోజుకు ఆరుగురు దళిత మహిళలు లైంగికంగా బలి అవుతున్నారు. ఒక్క సంవత్సరంలోనే వివిధ రకాలుగా 5713 కేసులు నమోదైనవి. భారత నేర గణాంకాలు-2016 ప్రకారం దళిత స్త్రీలపై జరిగిన లైంగిక నేరాల పట్టికలో తెలంగాణా రాష్ట్రం తొమ్మిదవ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలోను ఉన్నాయి. ఈ గణాంకాలు ప్రపంచ స్థాయి మానవ ప్రమాణాలను కూడా పెంచవలసిన అవసరాన్ని చూపిస్తుంది.

పొరలు పొరలుగా ఉన్న దళిత స్త్రీ ఈ సమాజంలో ప్రతీ పొరలోనూ యుద్దం చేయాలి. యుద్దం చేయాలంటే శిక్షణ కావాలి. శిక్షణ లేని యుద్దం వలన ఓటమి, ఓటమి వలన మరింత దుర్బర పరిస్తితులు వస్తాయి. అందుకే దళిత స్త్రీలను విద్య ద్వారా సుశిక్షుతులుగా చేయాలనుకున్నాడు. ఆయన ఒకచోట 'ఓల్డ్ ఈజ్ నాట్ గోల్డ్' అంటాడు. ఆయన ప్రస్తుతాన్ని ఉద్దేశిస్తున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం గతం యొక్క ఫలితం. ఆయన కోరుకునే భవిష్యత్తు కోసం వర్తమానంలో మార్పులు కావాలి. ఆయన ఆచరణాత్మక సిద్దాంతం అంటే చిన్న గీతను ముట్టుకోకుండా, పక్కన పెద్ద గీయడం. ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంలో కోయాలి, అక్షరానికి అక్షరమే సమాధానం కావాలి. మనుస్మృతి అనే వ్రాతప్రతికి రాజ్యాంగం అనే వ్రాతప్రతి సమాధానం. ఇప్పుడు మనముందున్న 'టెక్స్ట్' రాజ్యాంగం. అదే మన గమ్యం మరియు మన గమనం. విద్య ఇప్పుడు ఆ టెక్స్ట్ ను అర్ధం చేసుకోవడానికి కావాలి, ఆ టెక్స్ట్ సాయంతో యుద్దం చేయడానికి తోడ్పడాలి, పూలే దంపతుల కలల సామ్రాజ్యం నిర్మించడానికి కావాలి. డా.అంబేద్కర్ పూలేకు అసలైన వారసుడు స్త్రీలకు నిజమైన విమోచకుడు. ఆయనది ప్రాపంచిక ధృక్పధం. దలితుల సమస్య మానవ హక్కుల సమస్య. స్త్రీల సమస్య జాతి సమస్య. ఒక దేశ భవిష్యత్తు అణగారిన వర్గాల అభివృద్దిపై ఆధారపడి ఉన్నది. దళిత స్త్రీకి ఈ సమాజం మొత్తాని ప్రక్షాళన చేయవలసిన బాధ్యత ఉన్నది.

(మట్టిపూలు బహుజని సాహితీ సద్దస్సులోని ప్రసంగాని సంక్షిప్త రూపం)
మరింత సంక్షిప్త రూపం 06.12.2017  ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమయ్యింది.

No comments: