Wednesday, May 13, 2015

శిల సిద్దాంతం


"ఏమిటీ ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు"
"ఎంత వెతికినా ’శిల’ దొరకడం లేదు"
"ఎలాంటి శిల కోసం వెతుకుతున్నావు"
"అత్యంత విలువైనది"
"ఎందుకోసం"
"పళ్ళూడకొట్టుకుందామని"
"పళ్ళూడ కొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేం"
"అవును . . . నిజం. నేను కోరుకున్న విలువైన రాయి దొరకకపోతే, నేను ఎప్పటికీ పళ్ళూడగొట్టను"
"అది నీ వల్ల కాదు. ఈ సమాజం నీ మెడలు వంచి నీ పళ్ళు ఊడగొడుతుంది. నీవు కేవలం వాయిదా వేయగలవు అంతే"
"ఇది నిజమా... నువ్వు ఎలా చెప్పగలవు"
"అనుభవం"
"అయితే ఇప్పుడు నీకు . . ."
"పళ్ళు లేవు. ఊడి చాలా కాలం అయ్యింది"
"అయితే నాకు . . ."
"తప్పదు"
"మరి నేనేం చేయగలను?"
"దొరికిన దానితో నీ పని కానియ్యి. పని పూర్తయ్యే లోపు అర్ధం చేసుకో"
"మరి నాకేమిటి లాభం"
"నువ్వు వాయిదా వేయడం వల్ల కూడా నీకు లాభం లేదు కదా"
"అర్ధం చేసుకోవడం వలన లాభం ఉంటుందా?"
"ఆత్మ సంతృప్తి ఉంటుంది. నువ్వు వాడిన శిల, మరియు దాని స్వరూపం నీకు పళ్ళూడ గొట్టుకునే విధానం నేర్పుతుంది"
"శిల కు స్వభావం ఉంటుందా?
"శిల స్వభావాన్ని తెలుసుకోవాలంటే నువు ’ఉలి’ కావాలి. శిలకు మనసు లేకపోతే శిల్పం ఎలా మారుతుంది"
"నీకు తెలుసా?"
"తెలుసు. . . కానీ... కాస్త లేటుగా, పళ్ళూడిపోయిన తరువాత"
"నీ అనుభవమంత సమయం తీసుకోకుండా, నాకు ’శిల సిద్దాంతం’ వివరించ గలవా?"
"ప్రయత్నిస్తాను. శిలలు మూడు రకాలు అవి (1) అగ్ని శిలలు (2) అవక్షేప శిలలు (3) రూపాంతర శిలలు"
"చాలా ఆసక్తిగా ఉంది"
"మధ్యలో మాట్లాడకు. అగ్ని శిలలు మొదట ద్రవ రూపంలో ఉండి తరువాత ఘన రూపంలోకి మారినవి. ఇవి స్పటిక రూపంలో ఉంటాయి. పొరలు ఉండవు కానీ బీటలు, అతుకులు ఉంటాయి. మొత్తంగా ఇవి కఠిన శిలలు. అవక్షేప శిలలు పూర్వపు శిలల శిధిల పదార్ధాలతో ఏర్పడుతాయి. వీటిలో మాతృ శిలల లక్షణాలు మరియు కొత్త వాతావరణం లక్షణాలు రెండూ ఉంటాయి. ఇవి పొరలు పొరలుగా ఉంటాయి, రకరకాల గుర్తులు ఉంటాయి మొత్తంగా మెత్తగా ఉంటాయి. ఆఖరిదైన రూపాంతర శిలలు పూర్వపు అగ్ని శిలలు మరియు అవక్షేప శిలల లో జరిగిన మార్పుల వలన, సహజ లక్షణాలను కోల్పోయి కొత్త శిలలు గా ఏర్పడుతాయి. అయితే ఈ శిలను గమనించడం ద్వారా అది ఏ మాతృకకు సంబంధినదో తెలుసుకోవచ్చు.  పైనుదహరించిన వాటిలో ఏదో ఒక దానినుండి ఇది రూపాంతరం చెంది ఉంటుంది"
"దీని వలన నాకు ఒరిగేదేమిటి"
"శిల సిద్దాంతం ద్వారా నీవు ఆ శిల యొక్క రసాయన సమ్మేళనాన్ని తెలుసుకుంటావు.  రసాయన సమ్మేళంలోని ఖనిజాలు, వాయువుల వివరాలు తెలుకు కోవడం ద్వారా వాటి లక్షణాలను తెలుసు కుంటావు.  తద్వారా నీ రసాయన అవపాతానికి అనువైన, అవసరమైన వాటిని మాత్రమే వాడుకుంటావు, నీకు అనవసరమైన, వ్యతిరేకమైన చర్యలనిచ్చే రసాయనాలకు దూరంగా ఉంటావు. దీని వలన పళ్ళూడకొట్టుకోవడం ఎలాగూ తప్పదు, కనీసం నీకిష్టమైన రీతిలో ఊడగొట్టుకోవచ్చు"
"అర్ధమయ్యింది"
"ఏమని"
"ముందు నా రసాయన అవపాతాన్ని కనుక్కుంటాను. ఆ తరువాత ఏ శిల దొరికితే దానితో, నాకు నష్టం కాని రీతిలో పళ్ళూడగొట్టేసుకుంటాను. ఈ అనుభవాన్ని పంచిన ముదుసలి శిలకు, ఈ యవ్వన శిలా వందనం"
"శిలయే శిలను రక్షించు గాక"

No comments: