Thursday, April 3, 2014

ప్లీజ్ అబద్దం చెప్పండి, మీ కాగితం నాకు దొరికింది.

’రాత్రి మేడం గారు ఫోన్ చేసింది’ చెప్పింది మా పనావిడ. మా ఇద్దరినీ పరిచయం చేసింది ఆవిడే. నాకు ఇంట్లో పని చేసే వాళ్ళు కావాలి అని చూస్తున్నాప్పుడు, అతి తక్కువ డబ్బులతో అన్ని పనులూ చేసిపెట్టే వారిని చూస్తానని చెప్పి, ఈమెను మా ఇంటికి పంపించింది. మా ఇంట్లో పని మొదలు పెట్టిన తరువాత జీతం మాట్లాడుకున్నాం. అందరూ ఇచ్చేదానికన్నా ఎక్కువ డబ్బులకు ఒప్పందం కుదిరింది. పరిచయస్తులు పరిచయం చేసిన వ్యక్తి కాబట్టి పని బాగా చేస్తుందనుకుని ఒప్పందం ఖరారు చేసేసాను. ఆ మేడం రాత్రి ఫోన్ చేసారు. ఈ ఫోన్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఈ మధ్య మాట్లాడుకోవడం లేదంట. ఇవన్నీ మెదడులో తిరుగుతుండగా "ఏమిటో విశేషం" అన్నాను. హాలులొ తడిగుడ్ద పెడుతున్న తను తల ఎత్తకుండానే "మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని బాధ పడుతుందట. నేను ఆమెను పట్టించుకోవడం లేదని నన్ను నిందిస్తుంది" అని చెప్పి నీళ్ల బకెట్ ను మరో చోటికి మార్చింది. నేను చిన్నగా నవ్వి "పోనీలే.. ఆమెను ఎందుకు దూరం చేసుకోవడం. మాట్లాడితేనో, వెళ్ళొస్తేనో అంతా సర్దుకుంటుంది" అన్నాను. ముందుకు వాలిన ముంగురులను వెనక్కి తోసి, జారిపోబోయిన పవిటను మళ్ళీ దోపి, చేసున్న పనిని ఆపి, నా కళ్లల్లోకి సూటిగా చూస్తూ "ఆమె నా మనసు బాధ పెట్టింది. నేను వెళ్లను" అంది. 


మా పనావిడ మాంచి సరదా మనిషి. ఆమె ఇంట్లోకి అడుగు పెట్టగానే నిద్రపోయినోళ్ళంగా లేచి కూర్చుంటారు. గల గలా cube digital లాగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలలో ఎక్కువ సమయం నా పెళ్ళి గురించే. ప్రతీ రోజూ ఆ విశయం మీద నేను, మా అమ్మ, అ సమయానికి ఉన్న అతిధులు, మరియు మా పనావిడ సరదాగా గడిపేస్తుంటాం. కానీ ఈ మధ్య మా పనావిడ ఆ మేడం గారి మీద ఎడ మొహం, పెడ మొహంగా ఉన్నట్టు చెబుతూనే ఉంది. నేను పెద్దగా పట్టించుకోలేదు. ఓ రోజు మా అమ్మతో ఓ మాట చెప్పింది. "అస్తమానూ మీ అబ్బాయికి సంబంధం చూడమని అడుగుతున్నానని నువ్వే చేసేసుకో పెళ్ళి అని మోటు సరసం ఆడింది మా మేడం అంది. మీ అబ్బాయికి నా తమ్ముడు వయసో, నా పెద్ద కొడుకో వయసో ఉంటుంది. నాకు చాలా బాధ అనిపించింది. అందుకే ఆవిడ దగ్గరకు వెళ్లడం మానేసాను. మీ అబ్బాయికి తెలిస్తే బావుండదు" అని అమ్మ దగ్గర బాధపడిందట. అదే విశయాన్ని మనసులో పెట్టుకుందని నేను అనుకుంటున్నాను. అందుకే నేనేదో సర్చి చెప్పే ప్రయత్నం చేసాను. 

హాలులో తడిగుడ్డ పెట్టడం పూర్తయిన తరువాత మాస్టర్ బెడ్ రూం లో పని మొదలు పెట్టింది. నేను వంట గదిలో ఉన్నాను. "ఏవండోయ్. మీరు, మేడం ఈసారి ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు నేను మీ ఇంట్లో పని చేయడం లేదని చెప్పండి" అంది. తను ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో నాకర్ధం కాలేదు. "నేనెందు అలా చెప్పాలి. నేను చెప్పను" అన్నాను. నాకింత సహాయం చేసి, నాకో పని మనిషిని ఏర్పాటు చేసిన ఆవిడకు నేను అబద్దం చెప్పాలా? కుదరదు అన్నాను. సార్ నా మాట వినండి. మీకు తెలియని విశయం ఒకటుంది. నేను మీకు ఆ విశయం చెబితే, మీరు ఆమెను అడుగుతారని భయం తో చెప్పడం లేదు. నా మాట విని నేను పని మానేసానని చెప్పండి అంది కొంచెం వాయిస్ తగ్గించి. నేను చేస్తున్న పనిని ఆపి, ఆమె వద్దకు వెళ్లాను. ఏం జరిగిందో చెప్పు. నేను ఎవ్వరికీ చెప్పను, అడగను అని భరోసా ఇచ్చాను. కానీ నువ్వు చెప్పేది నాకు ముందే తెలుసు అని లోలోపల గర్వ పడుతున్నాను. అప్పుడే భళ్ళున ఏదో పేలిన శబ్దం వచ్చింది "మేడం నన్ను మీ ఇంట్లో పని మానేయమని చెప్పింది". నాకు నమ్మాలనిపించలేదు. ఎందుకంటే మేడం ఇలా చేయడం వలన ఏ ఉపయోగం ఉండదు. ఇది నిజమని నా ఆలోచనలకు అందడం లేదు. అలా చెప్పాల్సిన అవసరం ఆమెకు ఏముంటుంది అంటూ కొంచెం అనుమానంగా అడిగాను. మీకు పెళ్ళి సంబంధాలు చూడమంటూ ఏదో కాయితం ఇచ్చారంట కదా. అందులో మీ వర్ణం రాసి ఉందంట. ఆరోజే నన్ను పని మానేయమంది.  

నాకు నెమ్మదిగా సినిమా మొత్తం 70 mm లో కనిపిస్తుంది. నాకు పెళ్ళి సంబంధాలు చూడాలని ఆవిడ ఎంతగానో ఆత్రుత పడింది. మీ caste ఏమిటో చెప్పండి, నేను మీకు సంబంధాలు చూస్తాను అంది. నేను ఏ కులం లో పుట్టినా నాకు కులం పట్టింపు  లేదు. నాకు సరిపడా అమ్మాయి దొరికినప్పుడు చెప్పండి అనే వాడిని. మీ కులమేంటని వాళ్లడిగినా చెప్పాలి గదా! అనేది. అవసరం వచ్చినపుడు చెబుతానులెమ్మని చెప్పి వచ్చేసే వాడిని. కాని ఓ రోజు, వాళ్ళింటికి ఎవరో వచ్చారని, ఉన్నపళంగా నా biodata కావాలని అడిగింది. సరేనని అన్ని వివరాలు రాసి (కులంతో సహా) ఇచ్చాను. 

ఆ కాగితం గురించే ఇప్పుడు ఈమె మాట్లాడుతుంది. నా ఆలోచనలను భగ్నం చేస్తూ ఈమె మాట్లాడుతుంది. నాకు వేరే చోట పని దొరకక ఇక్కడ పని చేయడం లేదు సార్. మీరు పని చేసుకోవడం ఇబ్బంది అని చేస్తుంది. ఈ మాటలు మాట్లాడేటపుడు ఆమెలో ఓ Disability కోణం కనిపిస్తుంది. బహుశ తన స్థాయిలో దానిని జాలి లేదా మంచితనం అనవచ్చు. మా ఆయన చాలా తిక్కోడు, ఈ విశయం మా ఆయనకు తెలిస్తే ఖచ్చితంగా మానేయమంటాడు. రాత్రి మేడం మా ఆయనతో  ఫోన్ లో మాట్లాడుతుంటే ఈ విశయం అతనికి చెబుతుందేమో అని అనుమానం వచ్చింది. అలా జరిగితే ఖచ్చితంగా నేను రాను అంటూ ఆపింది. 

నేను ఎలా స్పందించాలి. బాగా డబ్బులున్న ఓ ’గౌడ’ మేడం కి, వాచ్ మేన్ (మా పనావిడ భర్త) గా పనిచేస్తున్న ’గౌడ’ వ్యక్తికి నా మాదిగత్వంతో సమస్య.   వాళ్ళిద్దరికీ గౌడ స్త్రీ నా ఇంట్లో పనిచేయడం అవమానం లేదా అంటు. నా ప్రమేయం లేకుండానే నా చుట్టూ సామాజిక కంచె. ఆ కంచెను నేను చదివిన చదువు, నేను చెప్పే చదువు, నేనిచ్చే జీతం జయించలేక పోయాయి. 

ఇది అంత ఆశ్చర్యపోయేంత విశయం కాదు. జీవితంలో ప్రతీ క్షణం ఎంతో మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనువాదాన్ని మోస్తూనే ఉన్నారు. పైనుదహరించిన ఎవ్వరికీ నేను స్పందించాల్సిన అవసరం లేదు. ’ఇప్పుడు కులం ఎక్కడుంది చెప్పండి’ అనే కుహనా వాదులతో నేను ఎప్పుడూ వాదిస్తూ ఉంటాను. వారికోసం చరిత్రలో పనికొస్తుందని రాసుకున్న వ్యాసం ఇది అంతే. 

రెండేళ్ళ క్రితం నేను ఇలాంటిదే ఒక బ్లాగు వ్రాసాను. అందులోనూ మీ కులం చెబితే నేను మీకు పెళ్ళి సంబంధం చూస్తాను అని రెండు రోజుల పరిచయంలో ఓ వ్యక్తి అడిగాడు. దీనిని బట్టి చూస్తే మన చురుకుదనాన్ని, తేజస్సును, పఠిమను, శరీర రంగును, చూసిన వాళ్లకి నేనేకులానికి చెందుతానో అన్న సందిగ్ధం పోవాలంటే పెళ్ళి సంబంధాల బయోడేటా ఇస్తే సరిపోతుందని తెలుసుకున్నాను. 

ఈ కొత్త విధానాన్ని కనిపెట్టిన మనువాదులను అభినందిస్తూ చెబుతున్నా "మీరు నా వెంట్రుక ముక్క కూడా పీకలేరు". 

2 comments:

hari.S.babu said...

అంతే మనలో ధైర్యం ఉంటే యెవరూ యేమీ పీక లేరు!ధైర్యం లేనివాళ్ళనే భయపెడుతుంది కులమయిన, మతమయిన, కుక్కయినా, నక్కయినా - యేదైనా?

hari.S.babu said...

అంతే మనలో ధైర్యం ఉంటే యెవరూ యేమీ పీక లేరు!ధైర్యం లేనివాళ్ళనే భయపెడుతుంది కులమయిన, మతమయిన, కుక్కయినా, నక్కయినా - యేదైనా?