- సృజనకు ఆకాశమే హద్దని నిరూపిస్తున్న నాట్యగురువు
- మానసిక, శారీరక వికలురకు నృత్యంలో శిక్షణ
- కళకు వైకల్యం అడ్డురాదని ప్రపంచానికి చాటిచెప్పిన అనన్య కృషి
- దేశాధ్యక్షుల చేత సైతం కంటతడి పెట్టించిన కళాసృష్టి
మానసిక అంగవైకల్యం - సమాజానికి, ప్రపంచానికి కాస్త దూరంగా ఉండే జీవితాలు వీరివి. ఇలాంటి వారికి నృత్యంలో శిక్షణనిచ్చి కళాకారులుగా ప్రపంచానికి పరిచయం చేయవచ్చనే ఆలోచనలోనే పదునైన సృజనాత్మకత ఉంది. అంతేనా ఆ ఆలోచనలో అంతులేని ఓరుð, సహనం, మానవత, సవాళ్లను ఎదుర్కొనే తత్వం ఇవన్నీ మిళితమై ఉండాలి. అపðడే అది సాధ్యమవుతుంది. మెంటల్లీ డిజేబుల్డ్ వారే కాక శారీరక అంగవైకల్యం ఉన్న పిల్లలు, యువతీయువకులు కూడా పాషా నేతృత్వంలో నృత్య కళాకారులుగా తమ ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా చాటుతున్నారు. వైకల్యం అనే ముద్ర నుండి కృషి ఉంటే ఏదైనా సాకల్యమే- అనే దిశగా వారిని నడిపిస్తున్న సయ్యద్ సలావుద్దీన్ పాషా మరెంత మందికో ఒక కొత్త మార్గాన్ని చూపారనవచ్చు. చక్రాల కుర్చీలోంచి కిందకు దిగలేని వ్యక్తి అద్భుతమైన నాట్య విన్యాసం ప్రదర్శిస్తే చూసేవారు విభ్రాంతికి గురవటం ఖాయం. అక్కడ మరో కొత్త లోకం ఆవిష్కృతం అవుతుంది. నాట్యంతో పాటు పోటీపడుతున్న సామర్ధ్యమూ, ఆత్మవిశ్వాసంతో వీక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తారు వారు. డిజేబుల్డ్ డ్యాన్స్ థియేటర్ సంస్థని స్థాపించివేలాదిమంది మానసిక, శారీరక అంగవికలురని నృత్య కళాకారులుగా తీర్చిదిద్దిన పాషాని ఇటీవల హైదరాబాదులో ప్రదర్శన ఇచ్చిన సందర్భంగా ఆంధ్రప్రభ లైఫ్ పలకరించింది ఆ విశేషాలు
మీరు నృత్యం పట్ల ఎలా ఆకర్షితులు అయ్యారు?
చిన్నప్పటినుంచే నాకు పాటలన్నా, సంగీతమన్నా, మనసుని పరవశింపచేసే నృత్యమన్నా చాలా ఇష్టం. ఆ క్రమంలోనే నృత్యం నేర్చుకోవాలనే తపన కలిగింది. నా తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో నృత్యం నేర్చుకోగలిగాను.
మీరు ఏఏ నృత్యాలు నేర్చుకున్నారు? వైకల్యం ఉన్నవారిని నృత్య కళాకారులుగా తీర్చిదిద్దాలని ఎందుకు అనిపించింది?
భారతీయ నృత్య రీతులపై అత్యంత ఆసక్తి ఉండటంతో బెంగళూరులోని నాట్యగురు మాయారావు వద్ద కథక్ నృత్యాన్ని నేర్చుకునే అదృష్టం కలిగింది. అలాగే చెన్నైలోని నాట్యగురు కిట్టప్ప పిళ్లౖెె వద్ద భరతనాట్యాన్ని, కూచిపూడిని నేర్చుకున్నా. ముస్లిం మతంలో, ఆ మతం చెప్పే మానవతా విలువలను కచ్ఛితంగా పాటించే కుటుంబంలో పుట్టటం వలన ఇలాంటి ఆశయం వైపు మొగ్గు చూపాను. వికలాంగులు, మానసిక వికలాంగులను చూసినపుడు వారికి కావలసింది కేవలం జాలి కాదని కాస్త చేయూతనిస్తే వారిలో ఆత్మవిశ్వాసాన్ని మేలుకొలపవచ్చని అనిపించేది. ఈ ఆలోచనే వీల్ ఛైర్ నృత్య రూపకల్పన వైపు అడుగులు వెెయించింది.
వీల్ ఛైర్ డ్యాన్సు ఎలా చేస్తారు?
సాధారణ నృత్యరీతులకు భిన్నంగా ఉంటుంది ఇది. ఇందులో భారతీయ నృత్యరీతులతో పాటు సూఫీ నాట్యం, సంగీతం, భారతీయ సాహిత్య సంపద కూడా సమపాళ్లలో మేళవించి ఉంటాయి. మా పూర్వీకులు మైసూరు మహారాజుల ఆస్థానంలో వైద్యులుగా పనిచేసి గౌరవం పొందినవారు. అందుకే నాపై నృత్య కళలతో పాటు యోగా ప్రభావం కూడా ఉంది. యోగాని కూడా నా నృత్యరీతుల్లో భాగం చేశాను. కుర్చీతో నృత్యం చేసేటపుడు క ళాకారులు గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల వేగంతో కుర్చీలతోనే పరుగులు తీస్తారు. అలాగే చక్కని నటనని కూడా ప్రదర్శిస్తారు. చూస్తున్న ప్రేక్షకులు ఆ సమయంలో తమనితాము మరచిపోయి నృత్యంలో లీనమైపోతారు.
వికలాంగులకు సాధనతో నేర్పించే అవకాశం ఉంది...కానీ మానసిక వికలాంగుల విషయంలో నృత్యంలో శిక్షణనివ్వటం మీకు కష్టంగా అనిపించలేదా?
మీరన్నది నిజమే. వాళ్లు స్థిరంగా ఒకచోట కూర్చోలేరు. కొంతమంది గట్టిగా అరవటం, దగ్గరకొచ్చినవారిని తోసేయటం, కొట్టటం లాంటి పనులు చేస్తారు. అయితే ఆ సమయంలో మనం కూడా కోపాన్ని ప్రదర్శించి తాళ్లతో బంధించడం లాంటి పనులు చేయకూడదు. వారికి మంచిగా నచ్చచెప్పి మనమాట వినేలా చేసుకోవాలి. అంతకుమించి వారికి అర్థమయ్యేలా శిక్షణనివ్వాల్సి ఉంటుంది. ఇదంతా కష్టంతో కూడుకున్న పనే. అయితే ఆ సమయంలో మనం చూపించే కాస్త మానవత్వం కొన్ని జీవితాలకు వెలుగునిస్తుందంటే ఆ శ్రమ పెద్దగా లెక్కలోకి రాదు. మంచిమార్గంలోకి రానున్న వారి భవిష్యత్తుని తలచుకుంటేనే ఎంతటి కష్టాన్నయినా మర్చిపోగలం. అదే నన్ను నడిపించే శక్తి.
వీల్ ఛైర్‌లో చేసే నృత్య ప్రదర్శనలు ఎలా ఉంటాయి?
సాధారణంగా కుర్చీలో కూర్చుని నృత్య విన్యాసాలు చేయాలంటే ఎవరికైనా కష్టమే. అందునా వేగంగా కదిలే చక్రాల కుర్చీలో కూర్చుని వికలాంగులు చేసే విన్యాసాలు చూపరుల్లో ఉత్కంఠని రేపుతాయి. వీల్ ఛైర్ డ్యాన్సులో సూఫీ డ్యాన్సులు, మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు కూడా ప్రదర్శిస్తాము. చిన్నారులను సైతం ఆకట్టుకునేలా పంచతంత్ర కథలు, రాముడు, హనుమంతుడు, కృష్ణుడు లాంటి పాత్రలు ప్రదర్శిస్తున్నపుడు వారు చక్రాల కుర్చీల్లో ఉన్నారని, అంగవైకల్యం ఉన్నవారనే విషయమే మర్చిపోతాం. ప్రతి కళాకారుడు తమదైన నటనని, నృత్య విన్యాసాలను ప్రదర్శిస్తారు.
భారతీయ సాహిత్యాన్ని వీల్ ఛైర్ డ్యాన్స్‌తో ఎలా మిళితం చేశారు?
అవును...నృత్యమంతా భారతీయత ఉట్టిపడేలా ఉంటుంది. చిన్నతనం నుంచే నృత్యం పట్ల ఆసక్తి ఉండటం వలన రామాయణం, మహా భారతంలాంటి అద్భుత కావ్యాలను ఆసక్తిగా చదివాను. మనిషి తన జీవన ప్రస్థానంలో భగవద్గీతని ఎలా అన్వయించుకోవాలో కూడా అర్థం చేసుకున్నాను. అలాగే పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు అన్నింటినీ చదివాను. వాటి ప్రభావంతోనే వీల్ ఛైర్ నాట్యంలో కొత్త ప్రయోగాలు చేశాను. సూఫీ సంగీతంతో కూడిన కలగలిసిన నృత్యరీతులను కూడా రూపొందించాను. అయితే ఇదంతా నా ఒక్కడి విజయంగా చెప్పలేను. నాభావాలను సరిగ్గా అర్థం చేసుకుంటూ, వాటిని ఆచరణలో పెడుతూ తమదైన శైలితో విజయంవైపు అడుగులు వేస్తున్న నాశిష్యులది కూడా. అలాగే ఈ ప్రస్థానంలో నాకు తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది చెందుతుంది.
ఇప్పటివరకు ఎన్ని దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు?
ఇంగ్లండ్, ఇటలీ, మలేషియా ఇలా ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలు తిరిగి పదివేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాం. ఎన్నో దేశాలలో దేశాధినేతలు, రాజకీయ వేత్తలు, నృత్య నిష్ణాతులు, అంతకు మించి కోట్లాది ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాము. వికలాంగులను చిన్నచూపు చూడరాదన్నదే నా లక్ష్యం. అదినేరే దిశగా చేస్తున్న నా ప్రయత్నం ఫలిస్తున్నది.
మీకు సంతృప్తినిచ్చిన ప్రదర్శనలు?
ఒరిస్సా రాజధాని నగరం భువనేశ్వర్‌లో దాదాపు 20వేలమంది ఆదివాసీల సమక్షంలో నిర్వహించిన వీల్ ఛైర్ నృత్యాన్ని జీవితంలో మర్చిపోలేను. ఆ ప్రదర్శన పూర్తి కాగానే ఆదివాసీలు స్పందించిన తీరు నా మనసులో ఒక తీయని అనుభూతిగా మిగిలిపోయింది. వారు నృత్యం చేసిన ప్రతి కళాకారుడినీ తమ గుండెలకు హత్తుకుని మరీ అభినందనలు తెలిపారు. అలాగే ఇంగ్లండులో అందునా పార్లమెంటులో ఇచ్చిన ప్రదర్శన ప్రేక్షకులనే కాదు, దేశాధ్యక్షుడే కళ్లనీళ్లతో ఉద్వేగానికి గురయ్యేలా చేసింది.
ఇప్పటి వరకు మీరు ఎంతమందికి వీల్‌ఛైర్ నృత్యాన్ని నేర్పి ఉంటారు?
ప్రపంచవ్యాప్తంగా నాకు ఐదువేలపైన శిష్యులున్నారు. ఉత్తర ఆఫ్రికాలో ఒక మారుమూల గ్రామంలో బట్టలుతికే రజక కుటుంబంలో పుట్టి ఒక్క నిముషంలో వీల్ ఛైర్‌ని అరవైసార్లు తిప్పి గిన్నిస్ రికార్డు సాధించిన గుల్షర్ నా శిష్యుడే.
మీకు నచ్చిన శిష్యులెవరు?
ఎవరని చెప్పను? ప్రతి ప్రదర్శనకూ పురిటి నొప్పులు పడతాం....అది పూర్తి కాగానే బిడ్డపుట్టిన ఆనందంతో పరవశించిపోయే స్త్రీ పరిస్థితే నాది కూడా. మీ ప్రశ్నకు ఏ గురువైనా ఇచ్చే సమాధానమే.... అందరూ నాకు నచ్చినవారే.
మరి మీరు సాగిస్తున్న ఈ బృహత్కార్యానికి, వికలాంగుల సేవకు నిధులెలా?
ప్రపంచంలో వికలాంగుల శాతం పెరుగుతూ వస్తోంది. ఇది ఆందోళన చెందాల్సిన విషయమే. వీరికోసం స్థాపించిన 'ఎబిలిటీ అన్ లిమిటెడ్ ఫౌండేషన్' పేరుతో ప్రారంభించిన సంస్థ ఢిల్లిd కేంద్రంగా, మరో రెండు బ్రాంచిలతో పనిచేస్తోంది. దీనికి నిధులను ప్రదర్శనల ఏర్పాటు ద్వారానే సమకూర్చుకుంటున్నాం.
మీ లక్ష్యం నేరవేరుతుందని అనుకుంటున్నారా?
ఖచ్చితంగా! వికలాంగుల సత్తా ప్రపంచానికి చాటాలన్నదే నా లక్ష్యం. అది నెరవేరేందుకు తొలి అడుగు వేశామనుకుంటున్నాం. పదివేల ప్రదర్శనలు ఇవ్వటం ద్వారా లిమ్కా బుక్ రికార్డుని అందుకున్నారు నా శిష్యులు. అలాగే భారత రాష్ట్రపతి సహా అనేక దేశాధ్యక్షుల ప్రశంసలు అందుకోవటమూ మరువలేనిది. గత 37 సంవత్సరాలుగా వికలాంగుల సేవలో తరించటంతో నా జీవతం ధన్యమైందని, ఇది నాకు దేవుడిచ్చిన వరమని భావిస్తున్నాను. భవిష్యత్తులో మరింతమందికి శిక్షణనిస్తాను.
-దుగ్గు రఘు
సిటీ కల్చర్ ప్రతినిథి, హైదరాబాద్
No comments:
Post a Comment