ఆదివారం అనుబధం - కె. అంజన Sun, 17 Mar 2013, IST
కర్నాటకలోని ఓ పేద కుటుంబం తొలి సంతానాన్ని కళ్లారా చూడాలని ఎంతగానో ఉబలాటపడింది. అనుకున్న సమయం రానే వచ్చింది. పండంటి బాబు పుట్టాడు. ముద్దుగా, చలాకీగా వున్నాడు. ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషంగా అని పేరు పెట్టుకుని... పనిపాటల్లో చేదోడువాదోడుగా వుంటాడని ఆశపడ్డారు. అయితే ఆ ఆనందం ఎన్నోరోజులు నిలవలేదు. ఎడమకాలిపాదంలో లోపం వుందని గుర్తించి కుంగిపోయారు. పిల్లవాడు ఎదిగేకొందీ ఆ లోపం మరింత స్పష్టంకాసాగింది. ఒక కన్ను కన్నూ కాదు. ఒక కాలు కాలూ కాదనుకున్న తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. పరీక్షించాక పిల్లవాడి వైకల్యాన్ని తొలగించడానికి చిన్నపాటి ఆపరేషన్ చేయాల్సి వస్తుందన్నారు. కానీ భయపడి వెనక్కి తగ్గారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదరికమే వారితో అలా చేయించింది. అయితేనేం! పిల్లవాడు భలే హుషారు. ఆటల్లో అయితే మరీను. పొద్దంతా ఆటలే ఆటలు. బళ్లో చేరాక కూడా ఆటల తర్వాతే తిండి. ఉదయం బళ్లోకి వెళితే... తిరిగి ఇల్లు చేరేది రాత్రి భోజనానికే. అల్లరిచిల్లరి ఆటలు మానుకోవాలనీ, బడి వదలగానే ఇంటికి రావాలనీ కోప్పడి రెండు దెబ్బలు వేయబోతే పరుగు లంకించుకునేవాడు. ఇంటి చుట్టూ వున్న చెక్క కంచెను దూకి పారిపోయేవాడు. ఆ తర్వాత 'అమ్మో అంత ఎత్తు దూకేశానా?' అని తనకు తానే ఆశ్చర్యపడేవాడు. నేస్తాలతో చెపితే వారు నమ్మేవారుకాదు. దాంతో ఇంట్లోవున్న క్యాసెట్ టేపులు తీసుకొచ్చి రెండు చెట్లకు కట్టి మిత్రులను దూకమనేవాడు. వాళ్ల వల్ల అయ్యేది కాదు. అప్పుడు తను దూకి చూపించేవాడు. చెట్లు ఎక్కడం, ఈత కొట్టడమంటే కూడా అమితాసక్తి కనబరచేవాడు. నేస్తాలతో కలసి కావేరీ నదిలోనూ, ఇతర పిల్ల కాలువల్లోనూ ఈదేవాడు. మిత్రులంతా అలసిపోయినా తను ఒక్కడే అలా చేపపిల్లలా విసుగూ విరామం లేకుండా ఈదుతూనే వుండేవాడు. స్కూల్లో అన్ని అవయవాలు సక్రమంగా వున్న పిల్లలతో పోటీపడి గెలిచేవాడు. కానీ తగు ప్రోత్సాహమే దొరికేది కాదు. పెద్దయ్యాక కూడా ఇదే పరిస్థితి. ఆసక్తి వున్న క్రీడల్లో రాణించడానికి డబ్బు, ప్రోత్సాహం, పని ఏదీ లేదు. చివరికి తనంతట తానుగా బెంగుళూరుకు చెందిన ఓ ఎన్జీవో సంస్థలో చేరి వికలాంగులకు ఇచ్చే క్రీడల్లో శిక్షణ పొందాడు. అనంతరం 2011లో వైశ్యా బ్యాంకులో క్లర్కుగా చేరాడు. బ్యాంకు మేనేజర్ గిరీశకు క్రీడల పట్ల అందునా హైజంప్ పట్ల వున్న ఆసక్తిని తెలుసుకుని అతనికి అవసరమైన శిక్షణను బ్యాంకు తరపున ఇప్పించడమేకాక పలు పోటీలకు పంపారు. గిరీశకు అది ఎంత పెద్ద సాయమో మాటల్లో చెప్పతరం కాదు. మొట్టమొదటిసారిగా కువైట్, మలేషియాలో వికలాంగులకు జరిగిన పోటీలకు హాజరై బంగారు పతకాలు సంపాదించాడు. తర్వాత 2012లో లండన్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో పాల్గొని రజత పతకాన్ని పొందాడు. కాళ్లకు బూట్లు లేకుండా హైజంప్ చేసి పతకం పొందిన క్రీడాకారుడిగా మంచి గుర్తింపు పొంది తన బీద తల్లిదండ్రుల్లో సంతోషాన్ని నింపాడు. లండన్ క్రీడల్లో గెలుపొంది సంపాదించిన డబ్బుతో... సోదరి పెళ్లికి, ఇంటి మరమత్తుకు చేసిన అప్పును తీర్చడమే కాక వైకల్యాన్ని అధిగమించిన రియల్ హీరోగా గుర్తింపు పొందాడు.
ప్రపంచంలో ఎవరైనా సరే తమ బిడ్డలు ఆరోగ్యంగా పుట్టాలని కోరుకుంటారు. అమెరికాకు చెందిన బోరిస్, డుష్కా కూడా అలాంటి దంపతులే. నర్స్‌గా, పాస్టర్‌గా పనిచేసే వారికి తమ తొలి సంతానాన్ని చూసినప్పుడు నోట మాటరాలేదు. కాలో చెయ్యో లేకపోతేనే అయ్యో అనుకుంటాం. అలాంటి రెండు కాళ్లూ, చేతులూ లేకుండా విచిత్రంగా పుట్టిన పిల్లవాణ్ణి చూసేసరికి... వారు మాటలే మర్చిపోయారు. ఆ బిడ్డడే నిక్ వుజైక్. వాణ్ణి ఎలా పెంచాలో వారికి అర్ధమే కాలేదు. ఏం చేయాలో కూడా తోచలేదు. భగవంతుడి ప్రసాదంగా భావించి వాడికి కాళ్లూ చేతులూ తామే అయి పెంచసాగారు. ఊహ తెలిశాక...తన చుట్టూ వున్న వారిని చూశాక... తను అందరిలా ఎందుకు లేడు? తనకు మాత్రమే కాళ్లూ, చేతులూ ఎందుకు లేవు? నేను ఇలాగే ఎందుకు పుట్టాను? వంటి అనేక ప్రశ్నలు నిక్‌ను వేధించసాగాయి. ఏడేళ్ల వయసులో కృత్రిమ చేతులు, కాళ్లను తగిలించుకుని చూశాడు. అప్పుడు కూడా తను తోటి పిల్లల్లా కాక వేరేగానే కనిపించాడు. పైగా వాటిని కదిలించడం తనకు శక్తికి మించిన భారమైంది. దాంతో వాటిని తీసిపారేశాడు. తోటి వారిని తాకటానికి, ఏదైనా వస్తువు పట్టుకోవడానికి, తన పనులు తను చేసుకోవడానికి చేతులు లేవు. పరుగెత్తడానికి, ఆడుకోవడానికి, నడవడానికి, డాన్స్ చేయడానికి, తనంతట తాను నిలబడడానికి కాళ్లు లేవు. ఇంటి దగ్గర, స్కూల్లో, కాలేజీలో ... ప్రతిచోటా తనకు తానే తేడాగా కనిపించేవాడు. పైగా తోటి పిల్లల వేధింపులు, అల్లరి, ఎత్తిపొడుపు మాటలు వుండనే వుంటాయి. అన్నిటినీ మించి తన పుట్టుకకు సార్ధకత ఏంటి? అన్న ప్రశ్న నిద్రలో సైతం వదిలేదికాదు. అప్పుడే ఒక సమాధానం తోచింది. సమస్యల్లో వున్నవారికి, బాధల్లో వున్నవారికి, తనలాగా వైకల్యంతో బాధపడేవారికి ఓదార్పుతో కూడిన వచనాలు చెప్తేనో! తన జీవితాన్ని వారి ముందు పరిచి తమ సమస్యలను అధిగమించడం పెద్ద కష్టం కాదని చెబితేనో! అన్న ఆలోచన వచ్చింది. ఇక అక్కడి నుంచి నిక్‌లో కొత్త ఉత్సాహం పొంగిపొర్లింది. తనకు తానే కొత్తగా కనిపించసాగాడు. ఏడవ తరగతిలో వున్నప్పుడు స్కూలు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అప్పటి నుంచి స్థానికంగా వికలాంగులకోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థలకు ముందు పీఠిన నిలిచి తన వంతు సాయం అందించసాగాడు. వైకల్యంతో బాధపడేవారి సాయంకోసం స్వచ్ఛంద సంస్థలతో కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టాడు. 2005లో ప్రతిష్టాత్మక 'యంగ్ ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా అందుకున్నాడు. యువతకు మార్గదర్శకంగా నిలిచే యువతీయువకులకు మాత్రమే ఆ అవార్డును ఇస్తారు. అవార్డు నిక్‌లో కొత్త ఉత్సాహాన్ని కూరింది. ప్రపంచ పర్యటన ప్రారంభించి యువతీయువకులు, పిన్నలు పెద్దలు, ఆడ మగ, వికలాంగులు అన్న బేధం లేకుండా ఎన్నో లక్షల మందికి తన వాణి వినిపించాడు. వారిలో నూతనోత్సాహాన్ని నింపాడు. 20 దేశాలను పర్యటించి పలు దేశాధినేతలను సైతం కలుసుకున్నాడు. ఏ వయసువారితోనైనా ఇట్టే కలిసిపోయి సమయస్ఫూర్తితో, హాస్యకరుణరసాలను పలికిస్తూ, ప్రేరణనిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు పోతున్నాడు నిక్.
ముద్దులు మూటకట్టే ఆ చిన్నారిని చూసి ఆనందించాలో, చేతులు లేవని బాధపడాలో ఆ క్షణంలో బిల్, ఇనెజ్ దంపతులకు అంతుబట్టలేదు. చేతులు లేకుండా క్షణం గడవదే. మరి తను బతికేదెలా అన్న సందేహం కన్నవారితో సహా బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు అందరిలోనూ కలిగింది. ఆ పరిస్థితుల్లో ఫిలిప్పైన్స్‌లో వుండలేక బిడ్డతో సహా అమెరికా వచ్చేసి అక్కడే స్థిరపడిపోయారు. ఆ తల్లిలో మాత్రం బిడ్డ జెస్సీ వైకల్యం అనుక్షణం గుర్తొచ్చేది. రోజుల తరబడి ఏడ్చేది. రెండు చేతులు లేకుండా బతకడమెలా! అనిపించేది. ఓసారి తన రెండు చేతులు కట్టేసుకొని కనీసం ఒక్క రోజు వుండగలనేమోనని ప్రయత్నించింది. రోజులు కాదు కదా. నిముషం కూడా గడవదని అనుభవ పూర్వకంగా తెలుసుకుంది. ఆ క్షణం ఆ విషయంలో పాప శాపగ్రస్తగానే కనిపించిందామె కళ్లకు. అంతమాత్రాన తాము ఏమాత్రం దిగాలు పడినా, నిరాశ పడినా పాప భవిష్యత్తు నాశనమౌతుందనుకున్నారా దంపతులు. తమకు తాము ధైర్యం చెప్పుకొని ముందుకు నడవాలనుకున్నారు. అన్ని పనులు తనంతట తనే చేసుకొనేలా జెస్సీకి శిక్షణ ఇవ్వాలనుకున్నాను. అంతేకాదు. మామూలు మనుషులందరి వల్లా కాని పనులు కూడా చేయగలిగేలా నేర్పాలనుకున్నారు. అయితే మరోవైపు జెస్సీ ఎదిగే కొద్దీ తన లోపమేమిటో తనకు తెలియసాగింది. కానీ అమ్మానాన్నల మాటలు, చేతలు, ఆప్యాయత, శిక్షణ ఆ లోపాన్ని మర్చిపోయేలా చేశాయి. బ్రష్ చేసుకోవడం, తల దువ్వుకోవడం, స్నానం చేయడం, తినడం, కాగితం మీద బొమ్మలు వేయడం, రాయడం...ఈత కొట్టడం... అన్నీ కాళ్లతోనే. కొంచెం ఎదిగే కొద్దీ స్నేహితులతో కలిసి మెలగడం నేర్పారు. తోటి పిల్లల ఎగతాళి, చిన్నచూపు, వేధింపులు అన్నిటినీ ధైర్యంగా, తెలివిగా ఎదుర్కొంది జెస్సీ. డాన్స్ చేయడం, ఈదడం కూడా నేర్పించారు. చేతులు లేకుండా తనను తను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. అందుకు ఈత ఒక్కటే సరిపోదు. మార్షల్ ఆర్ట్స్ క్లబ్‌లో చేర్చారు. తైక్వాండో నేర్చుకుంది. అందులో బ్లాక్‌బెల్ట్ సంపాదించడానికి తను చేసిన కృషి, పడ్డ కష్టం, పెట్టిన శ్రద్ధ అంతా ఇంతా కాదు. కారు కూడా కాళ్లతోనే నడిపేస్తుంది. ఒక కాలు స్టీరింగ్ మీద, మరో కాలు బ్రేక్ మీద పెట్టి సునా యాసంగా కారు నడిపేస్తుంది. విమానం నడుపు తోంది. ప్రపంచంలో కెల్లా చేతులు లేని తొలి పైలెట్‌గా రికార్డు సృష్టించింది. అన్నిటినీ మించి తనలాంటి వికలాంగులను ఉత్తేజితులను చేసేలా ఉపన్యాసాలిస్తూ ముందుకు సాగుతోంది.
ముంబైలో నివసించే ఓ తమిళ కుటుంబంలో ముద్దు లొలికే పాప పుట్టింది. తనను చూసి తల్లిదండ్రులు ఎంతగా మురిసిపోయారో! తమ జీవితాల్లో అమృతం కురిపించిన పాపకు సుధ అని నామకరణం చేశారు. తను నడిచినా, పరుగెత్తినా డాన్స్ చేసినట్టే వుండేది. మూడవ ఏట నుంచే సొంతగా డాన్స్ చేయడం మొదలెట్టింది. దాంతో సంప్రదాయ నృత్యం నేర్పించాలనుకున్నారు అమ్మానాన్నా. సుధను తీసుకుని డాన్స్ స్కూలుకెళ్లారు. పాప మరీ చిన్నగా వుందని, నేర్పడం కుదరదని చెప్పేరు. అయితే డాన్స్ పట్ల పాపకున్న మమకారం తెలిసిన పెద్దలు తన ఐదవ ఏట 'కళా సదన్'లో చేర్పించారు. అక్కడ గురువుల శిక్షణ, వ్యక్తిగత ఆసక్తి, పట్టుదల పాపను మంచి నృత్యకారిణిగా మార్చాయి. పదిహేడేళ్ల వయసులోనే 75 నృత్య ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల అభినందన మాలలు అందుకుంది. అయితే ఓసారి బస్సు దుర్ఘటనలో కాలికి గాయమైంది. దగ్గరలో వున్న ఆస్పత్రిలో వైద్యుడు చేసిన చిన్నపాటి తప్పిదంతో... కాలికైన గాయం గాంగ్రిన్‌గా మారి వైకల్యాన్ని మిగిల్చింది. చానాళ్లు కంటిమీద కునుకు లేకుండా ఏడ్చింది సుధ. తండ్రి తెచ్చిన చక్రాల కుర్చీలో కూర్చోడానికి ఏమాత్రం సుముఖత చూపించలేదు. పగలురాత్రి తేడా లేకుండా చెక్క కర్రలతోనే నడక సాధన చేసింది. ఓసారి పత్రికల్లో కృత్రిమకాళ్లను అమర్చే డాక్టర్ సేధి గురించి చదివి ఆయనను కలుసుకుంది. సుధకు నృత్యం పట్ల వున్న ఆసక్తి ని చూసి ముచ్చటపడిన డాక్టర్‌గారు ఆమెకు డాన్స్ చేయడానికి అనువైన చెక్కకాలిని అమర్చారు. అయితే నడిచిప్పుడు రక్తం రావడమేకాక విపరీతమైన బాధగా అన్పించేది. అయినా సరే చక్క కాలితో డాన్స్ సాధన చేసేది. కానీ తన నృత్య భంగిమలకు అనుకూలంగా వుండేదికాదు. ఓసారి తన డాన్స్ మాష్టారిని కూడా వెంట తీసుకుని డా||సేధిని కలుసుకుంది. ఆయన వీరితో మాట్లాడాక కృత్రిమ కాలిలో అనేక మార్పులు చేర్పులు చేశారు. పట్టు విడవకుండా కృత్రిమ కాలితోనే శిక్షణను పూర్తిచేసింది. 1984 జనవరి 28వ తేదీన మరో నర్తకితో కలిసి ప్రదర్శన ఇచ్చింది. కాలు కోల్పోయాక సుధ తొలిసారిగా ఇచ్చిన ప్రదర్శన కావడంతో దీనికి మీడియాలోనూ, కళాభిమానుల్లోను సహజంగానే ఉత్సుకతను రేకెత్తించింది. ఒకసారి వేదికమీదకు వెళ్లాక సుధ తన వైకల్యాన్ని మర్చిపోయి లీనమై చేసిన నృత్యం చూసి ప్రేక్షకులు కరతాళ ధ్వనుల రూపంలో అభినందనలు అందించారు. పత్రికల్లో చక్కటి కథనాలు వెలువడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న ఉషాకిరణ్ మూవీస్ అధినేత, చిత్ర నిర్మాత రామోజీరావు ఆమె జీవితం ఆధారంగా చిత్రాన్ని తీయాలనుకున్నారు. అందులో తన పాత్రను తనే పోషిస్తే బాగుంటుందని సుధను అడగ్గా మొదట నిరాకరించినా అనంతరం అంగీకరించింది. అలా రూపొందిందే 'మయూరి' చిత్రం. ఇందులో సుధ కనబరచిన నటన ఇటు ప్రేక్షకులనే కాక అటు విమర్శకులను కూడా ఆకట్టుకుంది. పలు అవార్డులనూ అందుకుంది. తర్వాత అదే చిత్రాన్ని హిందీలో కూడా తీశారు. పలు తమిళ, హిందీ చిత్రాలలో నటించినా బుల్లి తెరకే అధిక ప్రాధాన్యతన్చి నేటికీ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది.
1950ల్లో పీటర్ లాంగ్‌స్టాఫ్ జన్మించాడు. అదీ వికలాంగుడిగా. రెండు చేతులు లేని కొడుకును చూసుకుని ఆ తల్లిదండ్రులు రోజల తరబడి రోదించారు. ఆనక ఒకరికొకరు ఓదార్చుకున్నారు. పెరిగిపెద్దయ్యే కొద్దీ పీటర్ తన కాళ్లనే చేతులుగా చేసుకొని పనులు చేసుకోవడం మొదలెట్టాడు. కాళ్లతోనే తలుపు తీయడం, లైటు వేయడం, పెన్ను పట్టుకొని రాయడం...ఒకటేంటి అన్నీ చేసేవాడు. తోటివారి ఎకసెక్కాలూ భరించాడు. అటువంటివి ఎదురైనప్పుడల్లా అతనిలో పట్టుదల మరింత పెరిగేది. ఎదుటివారు చేయలేనిది కూడా తాను చేసేయాలని పట్టుదల కలిగేది. అలా అబ్బిందే చిత్రకళ. కాలితో కుంచె పట్టుకొని మనసులోని ఆకారాలకు తగినట్టుగా బొమ్మలు వేయడమంటే ఎంత కష్టం. ఆ పనిని పీటర్ లాంగ్‌స్టాఫ్ సునాయాసంగా చేసేస్తాడు. కాలినే చేతిగా మలుచుకుని అందమైన ఊహా ప్రపంచాన్ని కాగితాలమీద ఆవిష్కరిస్తాడు. అంతేనా! ఫుట్‌బాల్ ఆడడమేకాక నేర్పిస్తూ.. కాళ్లతోనే కారు నడుపుతూ... తనను చూచి నవ్విన నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నాడు.
గిరీశ, సుధ, జెస్సీ, నిక్, పీటర్... ఐదుగురివీ ఐదు రంగాలు. వైకల్యాలు. తమ శారీరక లోపాలను అధిగమించి ఎందరికో స్ఫూర్తినిస్తూ ముందుకు సాగుతున్నారంటే కారణం...
ఆరాటం ముందు ఆటంకం ఎంత? సంకల్పం ముందు వైకల్యం ఎంత? దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత? ఎదురీత ముందు నిస్సహాయత ఎంత? నమ్మకం... పట్టుదల నా రెండు రెక్కలుగా ఎగిరేస్తా ఆశల ఆకాశాన... పాదాలను పిడికిలిగా... నా గుండెను గుప్పిటగా గెలిచేస్తా....సంతోషపు సామ్రాజ్యాన్నంతా...
No comments:
Post a Comment