Friday, August 21, 2009

Mobile+ప్రేమ+Tension= Mobitension

ఆ అబ్బాయి, ఆ అమ్మాయి ప్రేమించుకొన్నారు. ఇద్దరివి వేరు వేరు ఊర్లు. అనుకోకుండా కలిసారు. కలుసుకొన్నది ఒక్క సారే. ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకొన్న కొన్ని రోజుల్లోనే మనసులు కూడా ఇచ్చి పుచ్చుకొన్నారు. వాళ్ళ భావాలు పంచుకోవడానికి ఎయిర్టెల్ కంపెనీ నెలకి మూడు నుండి ఆరు వేల్లు తీసుకొనేవారు. ప్రేమ ఖరీదైపోతుందని కాంట్రాక్ట్ రిలయన్స్ వాళ్ళకి మార్చేరు. అయిదు వందల రూపాయలతో అయిదువేల రూపాయల భావలను చేరవేసేవారు. ఎనిమిది వందల కిలోమీటర్ల భారాన్ని, అయిదువందల రూపాయలతో నడిపించేవారు.
నిరాటంకంగా సాగుతున్న ఖరీదైన ప్రేమలో ’ఇంతకీ మార్కెట్లో నీ ఖరీదెంత’ అని అమ్మాయి అడిగితే అబ్బాయికి మొబైల్ పగిలి చెవిలో పడ్డట్టయ్యింది. సిమ్ పెట్టి చెవిలో కెలికినట్టయ్యింది. అంతలోనే కోలుకుని ’నీ ఖరీదు, నా ఖరీదు సమానం’ అన్నాడు. మ్... మాటమీద నిలబడతావా అని అడిగితే, ఈ మాటే కాదు నా మొబైల్ నుండి నీ మొబైల్ ద్వారా నీ చెవిలో పడ్డ ప్రతీ మాటమీద నిలబడతాను, ఎందుకంటే ఒకే మాటమీద నిలబడితే stagnate అయిపోతామేమో అన్నాడు. మిగతా మాటల సంగతి ఎలా వున్నా ఆ ఒక్క మాటమీద నిలబడకపోతే ఫోను కట్ అయిపోద్ది అంటూ ప్రస్తుతానికి కట్ చేసింది.
అలా..అలా.. ఆరు ఫోన్లు, మూడు ఎస్.ఎమ్.ఎస్ లుగా సాగుతున్న మొబైల్ ప్రేమ ఒక రోజు రియాల్టీ షో వరకూ వచ్చింది. అమ్మాయి, అబ్బాయి లేకుండా ఇరువైపు కుటుంబాలు mobile లో date fix చేసేసుకొన్నారు. ఇక అమ్మాయికి, అబ్బాయికి Mobi-tension. ఇద్దరూ ఆ రోజంతా result కోసం Full charge చేసుకొని, signal దొరికే ప్రాంతంలో పెట్టుకొని ఎదురుచూపు.
[Reality Show begins]
మొహపాట పడుతున్న ఆడపిల్ల తండ్రిని మీకు ఏదైనా ఉద్దేశ్యం ఉందా అని అబ్బాయి వారడిగితే ఏమీలేదని సింగిల్ ముక్కలో తేల్చేసాడు ఆయన. కాలం కలిసొచ్చిందని,అబ్బాయి వారు మీ అమ్మాయికి మీరు మీ స్తాయికి తగ్గకుండా ఏమిస్తారో చెప్పండి అనగానే, స్తాయి తగ్గకుండా వాగ్ధానం చేసి, అది అమ్మాయికి, అబ్బాయికి జాయింట్ గా వేస్తాను [మీకు పైసా దక్కనివ్వనని] చెప్పాడు తండ్రి. అమ్మాయి తండ్రిని డబ్బులతో ఇబ్బంది పెట్టొద్దని మెసేజ్ [SMS] పంపించాడు అబ్బాయి. అమ్మయ్య, ఇబ్బంది పెట్టకుండానే పని అయిపోయింది. స్వామి కార్యం, స్వకార్యం సఫలమయిందని సంబర పడిపోయారు అబ్బాయి వారు. ఈ విశయాన్ని BSNL Friends and Family Offer లో తక్కువ డబ్బులతో ఎక్కువ సేపు మాట్లాడి, అబ్బాయికి కావలసిన సమాచారం మాత్రమే చేరవేయాలని, FFO ఫోన్లన్నీ రంగం లోకి దిగాయి.
మీ మామగారు చాలా మంచోరు. నువ్వనుకున్నట్టు కాదు. నీకు ఎంతిస్తానన్నారో తెలుసా. మేము అడుగలేదు, ఇబ్బంది పెట్టలేదు అని BSNL గట్టిగా మోగుతుంటే అబ్బాయిలో charging down అయిపోయింది. వీడెప్పుడూ ఇంతే దేనినీ తట్టుకోలేడు అని FFO సభ్యులంతా అనేసుకొన్నారు . అబ్బాయికి mobitension ప్రారంభం అయ్యింది. కానీ ఎంతసేపటికీ తను ప్రత్యేకంగా పెట్టుకొన్న ’ఆ’ రింగుటోను మోగకపోయేసరికి, ఇక ఆగలేక తమను ఆదుకుంటున్న రిలయన్స్ ద్వారా విశయాన్ని చేరవేసాడు. ఇదంతా నీ ప్లానే కదా అమ్మాయి నవ్వుతుంటే ఒంటరి గదిలో ’బొమ్మాళీ’ కనిపించింది. కరవమంటే కప్పకి కోపం, విడువమంటే పాముకి కోపం, ఇలా ఇరుక్కుపోయేనేంట్రా బాబూ అనుకొని, తరువాత ఏమి చేయాలో ఇద్దరూ ఒక ప్లాను తయారుచేసుకొని, ఆరోజు మొబైల్స్ కి విశ్రాంతినిచ్చారు.
తెల్లవారిన దగ్గరనుండీ మొబైల్ పామై కరిచేస్తుంది. తన గురించి తనకే తెలియని కౄర లక్షణాలను అమ్మాయి వారు చెబుతుంటే మొబైల్ ను మంటల్లో పెట్టి కాల్చేయాలనిపించింది అబ్బాయికి. కాలుతున్న చెవి నుండి, కారుతున్న రక్తంతో FFO కి ఫోను కలిపితే అవన్ని చాచి పెట్టి కొడితే గుండె కెవ్వుమంది. ఎంతివ్వాలో మేము చెప్పలేదు, ఇస్తేగాని కుదరదని మేము అనలేదు, ఇవ్వనని గాని, ఇవ్వలేనని గాని ఆయన అనలేదు. ఆయన మాట్లాడింది మాతో, problem ఉంటే మాతోనే చెప్పాలి, నీతో కాదు అని చెబుతూ ఉంటే అబ్బాయికి బిల్లు గిర్రున తిరిగింది.
నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి విలువ చెయ్యవు నీవు, నీకు డబ్బు కావాలా? నీ నెత్తి మీద రూపాయి పెడితే జనం నిన్ను రూపాయికి కొన్న రోజున మళ్ళీ నువ్వు నాకు కనిపించు, ఆ రోజు నీ మాట నిలబెట్టుకో అని అమ్మాయి రిలయన్స్ వారి contract రద్దు చేసుకొంది.
మన అబ్బాయిని మళ్ళీ చార్జ్ చేయాలంటే మన మాట వెనక్కి తీసుకోవాలని అమ్మాయి తండ్రికి ఫోన్ చేస్తే, స్తాయి తగ్గిపోతుందనుకున్నారేమో, ఆయన దానిని లిప్టు చేయడం మానేసాడు. సరేనని అబ్బాయికి ఫోన్ చేసి, నీ మాట ప్రకారమే కానిద్దాం. ఏం చెయ్యాలో చెప్పమని ఆయనకి చెప్పు. నేను ఫోను చేస్తే తీయడం లేదు. అమ్మాయికి నీ మీద ప్రేముంటే వచ్చేయమను, మాకు ఏమీ ఇబ్బంది లేదు అంటూ అబ్బాయి ప్రేమకి mobile లో పరీక్ష పెట్టారు.
వాడికి నువ్వు వద్దు, డబ్బు కావాలి. అయినా వాడికి నిన్ను పొందే అర్హత లేదు. సరిగ్గా ఆలోచించుకో. వీలయనంత త్వరలో నిర్ణయం తీసుకో అని అమ్మాయికి mobile లో warnings.
జీవితంలో కలసి బ్రతకాలన్న అన్న కోరిక తప్ప, స్వంత నిర్ణయాలు తీసుకోలేని ఆ అబ్బాయి, ఆ అమ్మాయి, ఖరీదైన ప్రేమకు వీడుకోలిచ్చి, contracts అన్నీ రద్దు చేసుకొని, కలసి బ్రతకాలా వద్దా అని ఆలోచిస్తూ, అప్పుడప్పుడూ తక్కువ డబ్బులు, తక్కువ సమయం, mobile లో మాట్లాడుకుంటూ కాలం గడిపేస్తున్నారు.
JAI MOBILE....JAI JAI MOBILE

No comments: