Saturday, August 22, 2009

ఎండుటాకు: ఎన్నో జీవితాల ఖరీదు

ఎంత పచ్చదనం? కనుచూపు మేరలో పచ్చదనం తప్ప మరేమీ కనిపించడం లేదు. మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు హైదరాబాదు నుండి గోదావరి జిల్లా వచ్చిన హరినాధ్ పరవశించిపోతూ. హరినాధ్ సూర్యతో కలసి పనిచేస్తున్న సామాజిక శాస్త్ర పరిశోధకుడు. నీకు నచ్చినంత కాలం ఇక్కడ ఉండి, ప్రదేశం అంతా చూసి వెళ్ళు, మావాడు నీకు అన్నీ చూపిస్తాడు అన్నాడు సూర్య వాళ్ళ అన్నయ్య వీరకుమార్ హరినాధ్ వైపు ప్రేమగా చూసి. తప్పకుండా అన్నా! నా పరిశోధనలో భాగంగా నాకొచ్చిన అవకాశాన్ని ఎంతమాత్రము చేజార్చుకోను అనే సరికి, భోజనాలు రెడీ అన్న చెల్లి పిలిస్తే అందరూ మేడ దిగి డైనింగ్ టేబిల్ చుట్టూ కూర్చున్నారు.
భోజనాలయ్యాక ముగ్గురూ మళ్ళీ మేడమీదకు చేరుకున్నారు. ఉదయం నుండీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను, కొంచెం వివరంగా సమాధానం కావాలి అన్నాడు హరి. ఇంకెందుకు ఆలస్యం అడగమన్నట్టుగా కళ్లతోనే సైగ చేసాడు వీరకుమార్. కోస్తాంధ్ర అంటే చాలా అభివృద్ది చెందిందని, తిండికి లోటుండదని, మాల మాదిగల జీవితాలలో కూడా గుణాత్మక మార్పు ఉంటుందని విన్నాను. కాని నేను చూసినంత వరకూ ఆ మార్పు కనిపించలేదు. పేటలో అంతా పాతకాలం నాటి తాటాకు ఇళ్ళు, నగీషీలేని డాబా ఇళ్ళు కనిపిస్తున్నాయి. కేవలం ఒకటి రెండు ఇళ్ళు మాత్రమే పరిపూర్ణమైనట్టుగా కనిపిస్తున్నాయి. ఇంతకీ అభివృద్ది ఎక్కడ ఉంది అంటూ ముగించాడు హరి. చిన్నగా నవ్వి, ఇక్కడ 90 శాతం ఇళ్ళల్లో చంద్రబాబు అవసరం లేకుండానే కలర్ టీ.వీ. లు కొనుకున్నారు, 10 శాతం ఇళ్ళల్లో ఏదో ఒకరకమైన హోమ్ ధియేటర్లు ఉన్నాయి తెలుసా అన్నాడు వీరకుమార్. మ్.. బాగానే వుంది. మరి చదువుకున్నోళ్ళు, ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటారు ఇంకొంచెం ఆత్రుతగా అడిగాడు హరి.
ప్రస్తుతం పేటలో ఉండి ఉద్యోగం చేస్తున్న వాడిని నేనే. ముగ్గురేమో ఆడపిల్లలు, వాళ్ళు అత్తవారింటి దగ్గరే ఉంటారు అని అసంపూర్ణంగా ముగించాడు వీరకుమార్. అంటే మాదిగ పేటలో మొదటి తరం ఉద్యోగస్తులు మీరేనన్నమాట, కనిపెట్టినట్టుగానే అన్నాడు హరి. లేదు, ’చదువు’ మా నాన్నల కాలంలోనే ప్రారంభం అయ్యింది. వాళ్ళల్లో నలుగురు ఉద్యోగస్తులయ్యారు. కానీ అందరూ ఊరికి దూరంగానే ఉద్యోగాలు చేసారు. కేవలం మానాన్న ఒక్కడే చివరి రోజులలో ఇక్కడికి వచ్చేసాడు. అంటే స్వాతంత్ర్యం వచ్చిన 62 సం.లలో మాపేటలో ఉద్యోగస్తులు 8 మంది. ఇక్కడే ఉండి ఉద్యోగం చేసినవాడిని నేనొక్కడినే అని ఊపిరి పీల్చుకున్నాడు వీరకుమార్.
"మీకు రిజర్వేషన్ ఉంది కదా! అన్నింటికి ప్రభుత్వమే చూసుకుంటుంది అంటారు. ఇన్నాళ్ళలో కేవలం 8 మంది ఉద్యోగస్తులేనా? ఇట్లయితే పెద్ద చదువులు ఎంతమంది చదివిండ్రు?" ఇంకా ఏదో తెలుసుకోవాలన్నట్టుగా అడిగాడు హరి. అందరూ అలానే అనుకుంటారు హరీ. సామాజిక, ఆర్ధిక పరిస్తుతలతో పోటీ పడి బ్రతుకు సాగిస్తున్న వీళ్ల జీవితాలలోకి తొంగి చూసిందెవరు. పధకాల అమలుపై మనసు పెట్టిందెవరు. ఇప్పటివరకూ డిగ్రీ పూర్తిచేసి, పి.జి చేసిన వారు మాలోనలుగురు. ముగ్గురు మా ఇంట్లోనే. మళ్ళీ మా ఇంట్లోనుండే ఇప్పుడు పి.హెచ్.డి చేస్తున్న మా తమ్ముడు, చెప్పి ఆపాడు వీరకుమార్.
"అంటే ఇప్పటి వరకూ చదువుకున్నవాళ్ళు పేటకోసం ఏమీ చేయలేదన్నమాట" సూటిగా వీరకుమార్ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు హరి. ఘాటుగా తగిలిన మాటకు అవాక్కయి, కొంత అసహనంగా కుర్చీలో వెనక్కి వాలాడు వీరకుమార్. 'సారీ అన్నా అప్రయత్నంగా అనేసాను" ఏదో అనబోయాడు హరి. తప్పులేదు హరీ, నువ్వు చెప్పిందీ నిజమే. నేనేమీ చేయలేకపోయాను. చేయాలని లేక కాదు, కేవలం చేయలేక. నాకు నేనే పెట్టుకున్న ఎన్నో పరిమితులు, చెప్పలేనంత అసహనం, పరిష్కారం లేదోమోనని అనుమానం, ఇలాంటి ఫీలింగ్స్ తో పధ్నాలుగు సంవత్సరాలుగా కుమిలిపోతున్నాను. ఇన్నేళ్ళలో ఈ ప్రశ్న అడిగినవాడివి నీవే. తప్పకుండా నా భావాలను నీతో పంచుకుంటాను అంటూ మొదలు పెట్టాడు వీరకుమార్.
నాకు పెళ్లయి పదిహేనేళ్లయింది. దానికి ఒక సంవత్సరం ముందే ఉద్యోగం వచ్చింది. నేను ఈ ఊరిలో ఉండడం మొదలు పెట్టింది అప్పుడే. నాన్న ఉద్యోగం వలన అప్పుడప్పుడు వచ్చిపోవడం తప్ప ఊరిలో ఎక్కువ కాలం ఉండలేదు. నా కాపురం ఇక్కడ మొదలయిన రోజే అనుకున్నాను. ఇక భవిశ్యత్తులో మా పేట వాళ్లంతా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మేమంతా కలసి గడపాలి అని. కానీ ఆ కల ఇప్పటివరకూ తీరలేదు. మొదట్లో అంతా బావుండేది. నాన్న కూడా ఇక్కడికే వచ్చేసారు. అంతా కలిసే ఉండే వాళ్ళం. పేటలో అందరూ ఇంటికి వచ్చిపోతుండేవారు. నాన్న ఉద్యోగం వలన వాళ్ళింట్లో వస్తువులకన్నా, మా ఇల్లు వారికి గొప్పగా కనిపించేది. మా అమ్మ అన్నీ వాళ్లకి వివరంగా చెప్పేది. ఒక సంవత్సరం బాగానే గడిచింది. ఆ తరువాత ఏమైందో తెలియదు. పేటలో ఏదో మార్పు వచ్చింది. చదువుకోమని చెప్పడం బూతు అయిపోయింది. రోజు రోజుకూ మా ఇంటిముందు చెత్త పేరుకు పోయేది, మా ఇంటి గోడలపై పిచ్చి పిచ్చి రాతలు కనిపించేవి. చిన్న అవకాశం వచ్చినా అందరూ మూకుమ్మడి దాడి చేసేవారు. ప్రతీ పనికి ఏదో రకంగా అడ్దుపడేవారు. ఏదైనా అడిగితే నీ ఉద్యోగం ఉంటే నువు తిను, మా జీవితాలలోకి రాకు అనేవారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, నేను ప్రహారీ కట్టడానికి ఇసుక, ఇటుక తీసుకువస్తే పని ప్రారంభించడానికి నెల పట్టింది. ప్రతీ రోజూ ఏదో గొడవ. వీళ్లందరికీ నేనే పెద్ద అడ్దంకి అయ్యాను.
"అమ్మో అంత దారుణమా"... కారణం?..ఆగాడు హరి
'అసూయ' సూటిగా హరి కళ్లల్లోకి చూసి అన్నాడు వీరకుమార్. జాతి మొత్తాన్ని ఓ చదువుకున్నోడు అలా అనడం జీర్ణించుకోలేకపోయాడు హరి. "నేనొప్పుకోను" గట్టిగా అనేసాడు హరి. చాలా సీరియస్ సాగుతున్న చర్చలో అన్నదమ్ములిద్దరూ రిలాక్స్ డ్ గా నవ్వేసారు. హరికి ఏమీ అర్ధం కాలేదు. నేనింత సీరియస్ గా అంటుంటే మీరు నవ్వుతారేంటి. ఆ మాట అనడానికి మీకు సిగ్గనిపించడం లేదా? ఆపుకోలేక అడిగాడు హరి. ఈ సారి సమాధానం చెప్పడం సూర్య మొదలు పెట్టాడు.
హరీ! మొదట్లో మేము అలాగే అనుకున్నాము. చివరికి ఈ పేట వదిలేసి వెళ్ళిపోదాము అనుకున్నాము. ఉద్యోగస్తులు పేటల్లో ఇందుకే ఉండరేమో అనుకున్నాము. మాకుటుంబ ప్రార్ధనలో ఈ విషయం చర్చకు రాని రోజు లేదు. ఆ తరువాతే అర్దమయింది మావాళ్ళ అమాయకత్వం ఎత్తు ఎవరెస్టు అని. ఈ మొత్తం మార్పుకి కారణం ఒక 'ఎండుకొబ్బరాకు' అని ఆగాడు సూర్య. ఎండు కొబ్బరాకా? what nonsense are you speaking, why are you romanticizing it. Tension తట్టుకోలేక అడిగాడు హరి. Cool హరి cool. I am not romanticizing it. It is true. కేవలం ఒక ఎండు కొబ్బరాకు ఇన్ని వివాదాలకు కారణమయిందంటే ఎవరికైనా నమ్మడం కష్టమే. వివరంగా చెబుతాను విను.
ఈ ఊరిలో గత కొన్ని సంవత్సరాలుగా పోరంబోకు భూమిని అనుభవిస్తున్న ఆసాముల వివరాలు కనుక్కొని, భూమిలేని వారి పేర్లు జోడించి రెవెన్యూ అధికారులకు ధరఖాస్తు చేయించాడు అన్నయ్య. తద్వారా వారి జీవన స్తాయి మారుతుందని ఆశించాడు. ఇది ఊర్లో ఉన్న పెద్దకాపులకు అస్సలు నచ్చేది కాదు. ఒక్కసారిగా మాదిగలకు ఇంత తెలివి ఎక్కడినుండి వచ్చిందని ఇబ్బంది పడి పోయేవారు. కొత్తగా ఉద్యోగం వచ్చిన మాదిగోడే ఇలాంటి సలహాలు ఇస్తున్నాడని అనుమానపడ్డారు. కాకపోతే సరైన ఆధారాలు లభించక తర్జన బర్జన పడుతూఉండేవారు. ఎవరు ఏమనుకున్నా ధరఖాస్తు మాత్రం చేరవలసిన అధికారులకు చేరిపోయింది. భూ పంపిణీకి రంగం సిద్దమయ్యింది.
ఇది ఇలా జరుగుతుండగా రోజు సూరిగాడు పెద్ద కాపు పొలంలోకి గడ్డి కోసుకోవడానికి వెళ్ళాడు. గడ్డి కోసుకుంటుండగా, సూరిగాడు కళ్ళు దూరంగా కనిపిస్తున్న ఒక వస్తువుపై కన్ను పడింది. మెల్లగా నాకు అది కావాలి అయ్యగోరు అని అడిగాడు పెద్దకాపు వైపు దీనంగా చూస్తూ. ఒరే సూరిగా నువ్వు ఆమాత్రం అడగాలంట్రా, తీసుకో అనేసరికి, సూరిగాడు ఎగిరిగంతేసాడు. గబగబా వస్తువును తన స్వంతం చేసేసుకొన్నాడు. సూరిగాడు కళ్ళల్లో ఆనందం చూసిన పెద్దకాపు, ఒరే సూరిగా మా పొలాల మీద ఎవర్రా కంప్లైంట్ ఇచ్చారంట. మేమేం ద్రోహం చేశాంరా వాడికి అని అడిగాడు. సూరిగాడి ఆనందం ఒక్క సారిగా ఆవిరైపోయింది, లిస్టులో ఉన్న వాడి పేరు తెలిసిపోయిందేమోనని భయం వేసింది. ఐదు నిమిషాలు క్రితం తను పొందిన సహాయానికి రుణం తీర్చేసుకోవాలనుకున్నాడు. తనకంటూ నేరం లేదని నిరూపించుకోవాలనుకున్నాడు. అందుకే పేటలో ఎవ్వరికి ఏమీ తెలియదని, అంతా వీరకుమార్ ఆలోచనేనని చెప్పేసి బరువు దించేసుకున్నాడు. పెద్దకాపు మొహంలో నవ్వు, ప్రశాంతత మెల్లగా మాయమయి, ఎర్రగా తయారయ్యింది. ఇదంతా గమనించే సమయం సూరిగాడికి లేదు, వీలైనంత త్వరగా అక్కడనుండి బయటపడాలని పారిపోయాడు. ఒక్క ఎండు కొబ్బరాకు కోసం నిజం చెప్పేసాడు అంటూ ముగించాడు సూర్య. "కొబ్బరాకు ఎందుకు పనికి వస్తుంది. దానితో సూరిగాడు ఏం చేస్తాడు, దానికంత ప్రాముఖ్యత ఏమిటి? అంటూ అడిగాడు హరి కొబ్బరాకు వెనుక రహస్యమేంటో తెలుసుకుందామని. నువ్వనుకున్నంత పెద్ద కారణమేమీ లేదు. తెచ్చి పొయ్యి లో పెట్టుకోవడమో, కొబ్బరి చీపుర్లు తయారు చేయడమో చేస్తాం అంతే. కాని క్షణం సూరిగాడికి ఇవి తప్ప ఏమీ తెలియదు. తన సమాధానం ఇంత వెనుకబాటుకు కారణమయిందని తనకు ఇప్పటికీ తెలియదు.
ఒక్కడు చదువుకుంటేనే ఇంత తలపోటుగా తయారైతే ఇక అందరూ చదువుకుంటే... ఆలోచిస్తేనే పెద్దకాపుకు తలతిరిగి పోయింది. మనసు చాలా వేగంగా పనిచేసింది. తన వాళ్ళందరినీ పిలిచాడు. తన బుర్రలో ఆలోచనను అందరికీ పంచాడు. అందరూ... అందరూ భేష్ అన్నారు. క్షణాలమీద అమలుకు నిర్ణయం తీసుకున్నారు. మా వాళ్లందరినీ పిలిపించాడు. "ఒరేయ్, వీరకుమార్ చదువుకుంటే మీ కేమొస్తుందిరా. వాడికి జీతంమొస్తుంది, వాడు బ్రతుకుతాడు. మీ బ్రతుకులనేమైనా మార్చగలడా? మీకేమైనా ఇవ్వగలడా? మీరు పనోళ్ళు, మేము యజమానులం. మేము మీకు జీతం ఇస్తాం, మీరు మాకు పనిచేసిపెడతారు. ఎప్పుడైనా కలిసుండేది మనమే. అదీకాక వీరకుమార్ కి చదువుకున్న పొగరు". అన్నాడు. ఆ మాటలు జనాల మనసుల్లో బాగా నాటుకొన్నాయి. అందుకే యజమానులకే బాసటగా నిలిచారు. ఒక చదువుకున్న వాడు తన పేట మొత్తానికి అవసరమైన డబ్బుని అందించడం కన్నా అంతకన్నా విలువైన జ్నానాన్ని ఇవ్వగలడని తెలిసుకోలేకపోయారు. ఒక మాదిగ వ్యక్తి చదువుకోవడం వల్ల మిగతా వారికి, తన జాతికి ఇంత నష్టమో, తన చదువు తన జాతి మొత్తం అభివృద్దిని తన ప్రమేయం లేకుండా ఆపేస్తుందని ఆరోజే మాకు తెలిసింది.
హరినాధ్ కి నిజంగానే ఏమీ అర్ధం కాలేదు. ఇందాక తనలో ఉన్న కోపం ఇప్పుడు లేదు. తను తెలుసుకోవాలన్న అభివృద్ది ఇలా ఉంటుందని ఊహించలేదు. మరి ఆ తరువాత మీరు ఇంక ఏమీ చేయలేదా? ఈ సారి గొంతులో ఆవేశం లేదు. తెలుసుకుందామన్న ఆశ తప్ప. కొంతకాలం మౌనంగా ఉన్న మాట నిజమ్,. మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు సూర్య. ఈ మధ్య కాలంలోనే నలుగురు ఇంటర్మీడియట్ పాసైయ్యారని తెలిసి, సంతోషంతో వాళ్ళిందరింటికీ వెళ్ళి, ఇంకా పై చదువులు చదివించాలని, మంచి భవిశ్యత్తు ఉంటుందని చెబుతున్న నావైపు వాళ్ళు అనుమానంగా చూస్తుంటే, ఒక ద్రోహి మాటలను వింటున్నట్టు వింటుంటే, అవగాహనా లోపంతో వాళ్ళ కన్న బిడ్డల భవిష్యత్తునే పణంగా పెడుతుంటే ఇప్పటికి 'ఎండు కొబ్బరాకు' ఎంత బలంగా పనిచేసుందో అర్ధమయ్యింది. అప్పటికి ఇప్పటికి కొంచెం మార్పు వచ్చింది. కారణం లేకుండా ఎదురు తిరిగే దగ్గరనుంచీ, మనలను ఇబ్బంది పెట్టకుండా వుంటున్నారు. కానీ మన ఆలోచనలను అర్ధం చేసుకొని, మన ఆంతర్యాన్ని గ్రహించి, వాళ్ల జీవితాలను బాగుచేసుకుంటే మనందరికీ బావుంటుంది. మన పేట అభివృద్ది చెందుతుంది.
ఈ మాటల సందడిలో ఎప్పుదు తెల్లారి పోయిందో వాళ్లకు తెలియలేదు. హరి ఒక్కసారి మేడంతా తిరిగి చూసాడు. సూరిగాడు ఇల్లెక్కడ అని అడిగాడు. పాతకాలం తాటాకుల ఇంటిముందు బక్కగా చిక్కిపోయి, కూర్చోవడానికి కూడా ఓపికలేక, ఎవరూ పట్టించుకోకపోవడం వలన, ఏడుస్తూ కూర్చున్న సూరిగాడిని చూసిన తరువాత, వీరకుమారు వైపు తిరిగి, అన్నా, ఇంత వరకూ ఎన్నో భరించారు. అయినా ఇక్కడే ఉన్నారు. దయచేసి మీ నిర్ణయం మార్చుకోవద్దు. తప్పకుండా మీ కలఫలించే రోజు వస్తుంది అంటూ వీరకుమార్ ను గట్టిగా హత్తుకున్నాడు.
"నేనూ అదే ఆశతో ఉన్నాను. ఆ తరువాత సూరుగాడికి భూమి వచ్చింది. ఇళ్లల్లో నేను చెప్పినవన్నీ వచ్చాయి. కాని మార్పు రాలేదు. అందుకే ఇకనుండీ నా ధృష్టి అంతా చదివించడమే. వీళ్ళందరి జీవితాలని పరిపూర్ణంగా మార్చగల శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉంది. దలితుల అభివృద్ది కోసం ఎవరూ పెద్ద పెద్ద త్యాగాలను చేయొద్దు. మీ బంధువులలో ఎవరో ఒకరికి మనస్పూర్తిగా సహాయం చేయండి. మీ ధృక్పధాన్ని పంచండి, భవిష్యత్తులో వాడు మీకు తోడవుతాడు, మీ సైన్యంలో ఒకడవుతాడు. పేటల్లో ఉద్యోగస్తులంతా ఈ మాత్రం పాటించినా మనం చాలా మార్పును చూడొచ్చు" అని చెప్పుకుపోతున్న వీరకుమార్, హరినాధ్ కు యుద్దానికు సిద్దపడ్డ సైన్యాధ్యక్షుడిలా కనిపించాడు.

8 comments:

S Swaroop Sirapangi said...

The narrated incident is nothing new. It is a wide spread phenomena in all the dalit dwells across the Indian sub continent. But the narrative skills of Mr.Digumarti Suresh kumar and the positive twisted end which he gave represented his strong commitment for the over all development of Dalits, especially his own Madigas, which is a rare prevalent notion among many Dalits.

From this story, in fact, when observed this kind of other stories, it can be clearly understandable that empowerment of weaker sections is not a easy task. Hence persons like Veera Kumar should certainly be optimistic, and other empowered families like Veera Kumar should also learn how to be optimistic in their endeavours, for the empowerment of Dalits or other weaker sections, in a long duration.

Suresh Kumar Digumarthi said...

@swaroop.

Thanks for your comment. A very good observation. My intention did reach you. It is not just a suggetion. It is a struggle we all are facing today.

కెక్యూబ్ వర్మ said...

మన సమాజం ఫ్యూడల్ మనస్తత్వం నుండి బయట పడలేదు. మార్పు అనేది తొందరగా రాదు. వీరాసామిలాంటి వారు చాలా తక్కువమంది మాత్రమే వుంటున్నారు. అవకాశాలు అందిపుచ్చుకున్నవారు తమ వాళ్ళకు దూరంగా జరిగి పరాయీకరణకు లోనవుతున్నారు. అందువలన మొత్తం జాతిని అభివృద్ధి పధంలోకి తీ్సుకువచ్చే సరైన ప్రణాళిక లేక పెత్తందారీ వర్గాల ఓటుబ్యాంకు రాజకీయాల సాలెగూడులో చిక్కుకుపోయి స్వజాతి హననానికి పాల్పడుతున్నారు. మీ కధనంలోని ఆవేదన అర్ధవంతంగావుంది.

Suresh Kumar Digumarthi said...

@ వర్మ గారు
మీరన్న మాట ముమ్మాటికి నిజం. ఇప్పుడు నయా ఫ్యూడల్స్ వల్ల సమస్య ఇంకా జటిలమవుతుంది. ఎవ్వరికీ సరైన అవగాహన లేదనిపిస్తుంది. సరైన దిశలో ఆలోచిస్తే ఇది అసలు సమస్యే కాదు. అలా చాలా సింపుల్ గా మన బాధ్యతలో భాగమైపోవాలని నా ఆవేదన. ధ్యన్య వాదాలు

Kathi Mahesh Kumar said...

కథలో చెప్పలనుకున్న విషయంలో చాలా స్పష్టత ఉంది. కథనం కోసం ఎంచుకున్న ఎత్తుగడ బాగుంది. కానీ,శైలి presentataion లో ఇంకా పరిణితి చెందాలి. మరిన్ని రాయరాదూ!

satyam sunkari said...

great; its ground reality of the dalits all over India. Leader should be with full of hopes. but, hopes are the strong pillors of success of the future. hope, definately, will bring the change.

Unknown said...

great, its ground reality of the dalits all over india. Leader should be fill up with full of confidence and hopes. hope is the strong piller for the change of existing social conditions.

Rathnakarr Penumaka said...

తమ్ముడు title చాలా బాగుంది ...tag line మరీ touching గా ఉంది .సహజమైన issue ని వివరించిన విధానం బాగుంది .పాత్రధారులందరూ నాకు పరిచితులానే అనిపించింది ...కథ ,కథనం సరళంగా సహజంగా ఉంది . ముగింపు ఆశాజనకంగా,అర్థవంతంగా ఉంది ...overall గా కథ బేషుగా ఉంది .