పదిహేనేళ్ళ సామాజిక ఉద్యమం, రాజ’కీయ’ అడుగులు ప్రారంభించింది. రాష్ట్రంలోనే అధిక జనాభాకు ఒక ’రాజ’కీయ గొంతు రాబోతుంది. అందరికోసమనిం చెప్పి, కొంతమందికే కొమ్ముకాసే ’గొంతు’ కాదది. నిక్కచ్చిగా, నిర్భయంగా వాటాలగురుంచి మాటాడే ధైర్యం ఉన్న M.R.P.S. పది శాతం జనాభా ఇన్నాళ్ళూ ఎవరో ఒకరి చెంతన చేరి, తమకు రావాల్సిన ఫలాల కోసం ఎదురుచూడడం కన్నా, తమ అవసరాలు తామే తీర్చుకుంటామని, మందకృష్ణ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీసుకున్న నిర్ణయం హర్షణీయం. సమాజంలో అణగారిన వర్గాలకు (ఎవరైనా) ప్రత్యేక వసతులు కల్పించాలని అంబేద్కర్ చూపిన బాటలో, అణగారిన వారిలో అట్టడుగు వారున్నారని కొత్త భాష్యం చెప్పిన కృష్ణ మాదిగ, రాజ్యాధికారంతోనే అన్ని మార్గాలను సాధించగల శక్తి ఉందని తేల్చి చెప్పిన బాబాసాహెబ్ బాటలో మరో అడుగు ముందుకు వేశాడు.
M.R.P.S రాజకీయ నిర్ణయాన్ని కొంతమంది 'కృష్ణ మాదిగ' కోణంలోనూ, మరికొంత మంది 'మాదిగ' కోణంలో చూస్తున్నారు. ఎవరు ఏ కోణంలో చూసినా భవిష్యత్తులో మాదిగల జీవితాలు ఓ కొత్త కోణంలో సాగబోతున్నాయన్నది వాస్తవం. ఇప్పటి వరకూ విద్య, ఉద్యోగం మరియు ఇతర రంగాలలో మా వాటా ఇవ్వండి అంటూ బ్రతిమాలిన మాదిగలు, ఇక నుండి ఎవరి వాటాలు వారికి పంచే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. నిన్నటి వరకూ ఎస్సీల వర్గీకరణోద్యమంలో మందకృష్ణ ఒక్కడేనా అన్న ప్రశ్నకు, కాదు, ఇకనుండీ 294 మంది శాసన సభకు, 42 మంది పార్లమెంటుకు అర్హత కలిగిన నాయకులు పోటీలో నిలబడతారు. ఇప్పుడున్న రాజకీయాటనే ప్రాతిపదికగా తీసుకున్నా, దానికి మరిన్ని రెట్లు నాయకులు తయారయ్యే సావకాశం మెండుగా వుంది. ఇంతమంది కొత్త తరం నాయకులు, తమ జాతిని పునాదిగా చేసుకొని నిలబడడం అనేది, వర్గీకరణోద్యమ ఫలితమే. ఒకనాడు ’వీళ్ళెంత?’ అన్న ప్రతీ రంగంలోనూ మాదిగలు రాణించడం, M.R.P.S ఘనతే.
ఇన్ని గొప్ప మార్పులను తీసుకు వచ్చిన ఉద్యమం ప్రధాన సమస్యను, ఇన్నాళ్ళుగా రాజకీయ పార్టీలు, మాదిగ (రాజకీయ) నాయకులు పరిష్కరించ లేకపోయారు. కనీసం, నమ్మకాన్ని కూడా ఇవ్వలేకపోయారు. ఎ.బి.సి.డి మాత్రమే కాదు, ఎ నుండి జెడ్ వరకూ అయినా అవసరాన్ని, అభివృద్దిలో వెనుకబాటు తనాన్ని ప్రాతిపదికతో వర్గీకరణ చేయాలన్న M.R.P.S దృక్పధం తప్పకుండా రాజకీయాలను ఓ కొత్త కోణంలో చూపిస్తుంది. అది ’ఇందిరమ్మ రాజ్యమో’, ’అన్నగారి’ రాజ్యమో లేక ’శాస్త్రీయత ముసుగుల రాజ్యమో’ కాదు, ’మన’ రాజ్యం అవుతుంది.
ఇంతవరకూ డబ్బే ప్రధాన లక్ష్యంగా నడచిన రాజకీయాలు, అణగారిన వర్గాల అధికారం దిశగా నడక ప్రారంభిస్తాయి. వడ్దించే వాడు మనవాడైతే, బంతిలో ఎక్కడ కూర్చున్నా పరవాలేదని, M.R.P.S రాజకీయ నిర్ణయం తరువాత ఎస్సీల వర్గీకరణ కాదు, సమాజ వర్గీకరణకు శ్రీకారం చుట్టబోతుంది. దామాషా పద్దతిలో ఎవరి వాటాను వారికే ఇచ్చి అసలు సిసలైన సమాజాన్ని M.R.P.S నిర్మిస్తుంది. ఏ సమస్యకైనా పరిష్కారం ఆలస్యమవుతుందేమో గాని, అసంభవం మాత్రం కాదని, వర్గీకరణకి మోకాలడ్డిన నాయకులంతా తెలుసుకోవాలి. నిరంతర అణచివేత ఎన్నటికీ సాధ్యం కాదని మరోసారి నిరూపించింది M.R.P.S. బలంగా అణచిదేదైనా ఉన్న స్తాయికన్నా ఎక్కువ ఎత్తు ఎగురుతుంది అన్న మాటకు సాదృశ్యమే M.R.P.S రాజకీయ నిర్ణయం.
ఇప్పటికే తన కార్యకలాపాల ద్వారా సామాజిక ఉద్యమం కోసం అనేక మంది నాయకులను తయారు చేసిన ఎం.ఆర్.పి.యస్, వారినే రాజకీయోద్యమంలో పాలు పంచుకొనేలా చేయడం, తనకున్న కృతజ్నతను, నిబద్దతను తెలియజేస్తుంది. వర్గీకరణని ఆపడం ద్వారా మాదిగల అభివృద్దిని ఆపగలిగామని మాలలు, మాల మాదిగలను విడదీసామని అగ్రవర్ణ రాజకీయా పార్టీలు సంబరపడినా, ఐక్యత, సామాజిక న్యాయం అనే పేర్లతో ఇంకా వెనుకబడి వున్న 58 కులాలను ప్రధాన స్రవంతిలోకి రాకుండా ఆపగలిగారని గుర్తించాలి. సమాజంలో అన్ని ఉద్యమాల పరిధి వారి వారి అవసరాల మేరకే ఉన్న తరుణంలో, తన వారిందరికీ న్యాయం జరగాలని పోరు ప్రారంభించిన M.R.P.S, తన రాజకీయ ప్రయాణంలోనూ తనలాంటి వారెందరికోసమో తప్పకుండా ఆలోచిస్తుంది.
ఎవరు ఎన్ని మాటలన్నా, ఎంత విమర్శించినా, మాదిగలు, దాని ఉపకులాలు M.R.P.S మీద, దాని నాయకత్వం మీద నమ్మకాన్ని కోల్పోలేదు. రానున్న మహా యజ్నంలో సంఘటితమైన మాదిగలను ఎదుర్కొనే శక్తి ఎవరికీ ఉండదు. మాదిగ అనే పదం ప్రధాన స్రవంతిలో భాగమయినట్టుగానే, సామాజిక న్యాయం కూడా సర్వసాధారణం కావాలని M.R.P.S ఆశిస్తుంది.
3 comments:
it needs theoritical understands try to read balagopal's tangeld web from epw
Thank you Ramesh, you have guessed my next project.
Parties based on caste
I doubt how they go in future. Even BSP which has its routes in Dalit revolution has changed its stand accordingly to survive. I feel if MRPS identifiy all important and critical challenges and work in that way, it will definitely reach all the people irrespective of caste.
Post a Comment