Sunday, March 8, 2009

రాక్షసులమా!

అమ్మా...
మేము రాక్షసులం కాదమ్మా
గాయపడ్డ గుండెలం
దగాపడ్డ మనుషులం
ప్రజాస్వామ్యంలో ఎదురుచూసి
అలసిపోయినోళ్ళం

ప్రాణాలరించైనా సాధించాలనే తప్ప
ప్రాణాలు తీయాలని ఎప్పుడూ అనుకోలేదు
అందుకే.. ఇన్నాళ్ళుగా ఊరకున్నాం
విధి నిర్వహణలో ఘోరం జరిగింది
మాలో.. ఒక కుటుంబానికి కాదు
80 లక్షల మందికి నాయకులైన వారు
అమరులయ్యారు
మా దిక్కులు చెరిగిపోయాయి
మా ఘోష అడవి పాలయ్యింది
మా మొర గాలిలో కలసిపోయింది
మా ప్రయత్నం వెటకారమయ్యింది

నాకు తెలివి లేనప్పుడు నాతో
ఉన్నవాళ్ళంతా నేడు పక్కకు తొలగారు
నా మార్గాన్నే తప్పంటూ
సూటిపోటి మాటలతో పొడుస్తూనే ఉన్నారు
నా అడుగు, మాట అన్నీ
బూతద్దంలో బొమ్మలయినాయి
నీకు మేము రాక్షసులమయినాము

మా నాయకులంతా నోళ్ళు
కుట్టేసుకున్నారు
అధికారాల ఆటలో మా జాతి
వారి ముందు చిన్నబోయింది
ప్రళయం వచ్చినా అది తెరుచుకోదు
లోకమంతా దుమ్మెత్తి పోస్తున్నా
వారికి పట్టదు

అందుకేనమ్మా...
ఆవేదన కట్టలు తెంచుకొని
ఆవేశం పెల్లుబికి
ఆశల ఎండమావి కూడా దూరమైపోతుంటే
ఆగలేక చేసిన అఘాయిత్యంలో ...
నీకు మేము రాక్షసులమయినాము
మావోళ్ళు వేగుచుక్కలైనారు

08.03.2009, 06.05 pm

No comments: