Saturday, November 9, 2019

అత్తగారి అబద్దం

రోజు సాయంత్రం ప్రీతమ్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఏదో కొత్తదనం కనిపించింది. ఇల్లంతా బాగా సర్దినట్టు, ఎప్పుడూ చెల్లా చెదురుగా పడి ఉండే వస్తువులు అమర్చినట్టు కనిపించాయి. అదనపు మంచం మీద పడేసి ఉండే ఉతికిన బట్టలూ కనిపించలేదు. నా ఇంటికే వచ్చానా అనే అనుమానంప్రీతమ్ మనసులో కలిగింది. అంతలోనే తేరుకుని, ‘నా జీవితంలో ఏదో అద్భుతం జరుగబోతుందేమోఅని ఊహించుకుని, సంబరపడి పనుల్లో మునిగిపోయాడు. ఆ రోజు శుక్రవారం కావడం వలన తొందరగా పడుకోవాల్సిన అవసరం లేదు కనుక కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేయాలనీ అనుకున్నాడు. భోజనాలు పూర్తయ్యాక నెమ్మదిగా లాప్ టాప్ తెరిచాడు. మెయిల్లు, వాట్సాప్ మెసేజీలు చదవడం పూర్తయ్యాక, ముందు రోజు కిండిల్ లో కొన్న కొత్త పుస్తకాన్ని చదువుదామని తెరిచాడు. అదేం ఖర్మో గాని నిద్ర ముంచుకొచ్చేసింది. ఛీపిచ్చి నిద్ర. ఇది నా జీవితం మొత్తానికి ఒక శాపం. మేధావులంతా నిద్రలేని రాత్రులు ఎలా గడుపుతారో ఏమిటోఅనుకుంటూ మంచం మీదకి చేరి నిద్ర పోయాడు. ఒక అరగంట గాఢ నిద్ర తరువాత ఏదో శబ్దం అయి మెలుకవ వచ్చింది. కళ్ళు తెరచి చూస్తే వాళ్ళావిడ జాహ్నవి, పక్కల్లో పిల్లోడిని వేస్తుంది. సమయం పన్నెండు అయినా, జాహ్నవి పడుకోవడానికి ఇంకో గంటైనా పడుతుంది. యూట్యూబు, వాట్సాప్ పూర్తయ్యాక లేటుగా పడుకుంటుంది. పైనుండి కిందికి వాళ్ళిద్దరినీ చూసి మళ్ళీ దుప్పటి కప్పేసాడు ప్రీతమ్. ఈసారి గాఢ నిద్రలోనికి వెళ్ళడం లేదు. మళ్ళీ మళ్ళీ మెలకువ వచ్చేస్తుంది. మేలుకొన్న ప్రతీసారీ పక్కన చూస్తున్నాడు, కానీ అక్కడ జాహ్నవి కనిపించడం లేదు. హాల్లో లైట్ ఆపేసి ఉంది. బాత్రూం వైపు చూసాడు. గడియ పెట్టే ఉంది. ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ నీళ్ళు తాగుదామని క్రిందికి చూసాడు. అక్కడ వాటర్ బాటిల్ కనపడలేదు. ఈ మధ్య జాహ్నవి నీళ్ళు పెట్టడం మానేసిందని అప్పుడు గుర్తుకొచ్చింది. సర్లే నీళ్ళు తెచ్చుకుందాం అని పైకి లేచాడు. సమయం ఒంటి గంట అయింది. నెమ్మదిగా హాల్లోకి వెళ్ళే సరికి బెడ్ లైట్ వెలుగులో రెండు కొరివి దెయ్యాలు దగ్గరగా కూర్చుని, నెమ్మదిగా గుసగుససలాడుకున్నాయి. ప్రీతమ్ ను చూసే సరికి మాటలు ఆపేసి మొహాలు దూరంగా జరిపారు. ఒక దెయ్యం వాళ్ళావిడ జాహ్నవి. మరో దెయ్యం జాహ్నవి చెల్లి పప్పీ. ఈ దృశ్యం ప్రీతమ్కు కొత్తేం కాదు. కుటుంబాలకు సంబంధిన సీక్రెట్ ప్రాజెక్టులు ఉన్నప్పుడు వాళ్ళు అలా మాట్లాడుకుంటారు. మిగిలిన సమయాల్లో అయితే ప్రీతమ్కు ఇబ్బంది అవుతుందని చెప్పినా వినకుండా గట్టిగా మాట్లాడతారు. ప్రీతమ్ను చూసిన తరువాత కొంచెం వాయిస్ పెంచారు, రేడియో స్టేషన్ మారినంత ఈజీగా టాపిక్ మారిందని అర్ధమయ్యింది. ఇలా స్టేషన్లు మార్చడంలో జాహ్నవి వాళ్ళు మహా ముదుర్లు. ఇవేమీ పట్టించుకోనట్టే వెళ్లి నీళ్ళు తాగి, మరి కొన్ని నీళ్ళు తెచ్చుకుని పడుకున్నాడు ప్రీతమ్.
సాధారంగా ప్రీతమ్ అంతకుముందు జరిగిన సంఘటనలను బట్టి ఒక అంచనాకు వచ్చేస్తాడు. కానీ ఈసారి తన బుర్రకు ఏదీ తట్టడం లేదు. అందువల్ల నిద్ర పట్టడం లేదు. అలాగే దుప్పటి ముసుగేసుకుని, పడుకుని, ఆలోచిస్తున్నాడు. ఆ తరువాత ప్రతీ పావుగంటకి వాళ్ళావిడ జాహ్నవి రావడం పిల్లవాడిని సర్దడం, మళ్ళీ వెళ్ళిపోవడం జరిగుతుంది. ఆలా ఓ రెండు సార్లు జరిగాక ప్రీతమ్కు అర్ధం అయ్యింది. అది పిల్లాడి కోసం అయి ఉండదు, తనను పరిశీలించడం కోసం అని. ప్రీతమ్ అప్పుడుడప్పుడూ పైకి లేచి, మొబైల్ చూసి, మళ్ళీ పడుకుంటున్నాడు. ఈసారి తన కళ్ళు అలసిపోవడం లేదు, అలాగని సహకరించడం లేదు. చివరికి ఎలాగైతేనే సుమారు రెండున్నర గంటలకి జాహ్నవి వచ్చి పడుకుంది. మళ్ళీ వెళ్తుందేమో అడుకున్నాడు కానీ పావుగంటలో గురకపెట్టేసింది, కాబట్టి ప్రీతమ్ కూడా పడుకున్నాడు.
ఉదయం ఆరుగంటలకి మెలుకువ వచ్చి చూస్తే జాహ్నవి మంచం మీదే ఉంది. అమ్మయ్య తెల్లారే గూడు పుఠానీ ఏమీ లేదన్నమాటఅనుకుని, పొద్దున్నే పాలు తేవాలని భార్య చెప్పిన మాటలు గుర్తొచ్చి, పాలకి బయలుదేరాడు. పాలు తీసుకున్నాక, దగ్గరలో పచ్చిక బయళ్ళ దగ్గరకెళ్ళి కాసేపు ప్రకృతి అందాలు ఆస్వాదించి, ఇంటికి బయలుదేరాడు. గేటు ముందు బండి ఆపి, గేటు తీయాలని చూసేసరికి, పోర్టికోలో, ప్రీతమ్ ఎప్పుడూ కూర్చునే కుర్చీలో, ఒక మగ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఒక్కసారి షాక్ తిని, పరికించి చూసాడు. అంతలో ప్రీతమ్ను గమనించిన ఆతను వడివడిగా ప్రీతమ్ వైపు వచ్చాడు. ఇంతకీ ఆయన ప్రీతమ్ వాళ్ళ మామగారు నారాయణ. సంబ్రమ్మాశ్చర్యాలల్తో లోపలికి అడుగు పెట్టాడు ప్రీతమ్. అప్పటికి  ఇంకా లగేజి లోపల పెట్టలేదు. అక్కడ చూస్తే లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది. ఓహ్.. అంటీ కూడా వచ్చిందా?” అన్నాడు ప్రీతమ్. ఆ.. వచ్చింది అని ముక్తసరి సమాధానం చెప్పాడు నారాయణ. ప్రీతమ్ మాత్రం చాలా హేపీగా ఫీల్ అయ్యాడు ఎందుకంటే వారిని రమ్మని పిలచింది తనే. తన భార్యకు తనకూ ఈ మధ్యన పొంతన కుదరడం లేదు. జాహ్నవి సహాయనిరాకరణ ఉద్యమం బలంగా చేస్తుంది. తన చేతుల్లో ఏ పరిష్కారం లేదని తెలుసుకున్న ప్రీతమ్, జాహ్నవి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా కొంత స్వాంతన పొందాలని ఆశించాడు. ఓహ్.. ఈరోజుతో నా సమస్యలన్నీ పోతున్నాయి. రేపటి నుండి నాకు మంచిరోజులు వచ్చేస్తాయిఅని ప్రీతమ్ మనసు లోలోపల బ్రేక్ డాన్స్ చేస్తుంది. ఈలోపులో అత్తగారు కాంతం  బాత్రూం నుండి బయటికి వచ్చింది. ఆ ఆనందంతో ఇద్దరినీ లోనికి ఆహ్వానించాడు. అప్పటికి సమయం ఉదయం ఏడున్నర అయింది. సాధారణంగా శనివారం వస్తే తొమ్మిది దాటాక గానీ జాహ్నవి లేవదు. అసలే రాత్రి ఇంకా లేట్ అయింది. కాబట్టి వీళ్ళిద్దరికీ నేనే టీ చేసి ఇవ్వాలన్న మాటఅనుకుని లోపలి అడుగుపెట్టాడు ప్రీతమ్. అప్పుడే వంట గదిలోనుండి జాహ్నవి నవ్వుతూ బయటికి వచ్చి వాళ్ళమ్మను ఆహ్వానించింది. ఒక్కసారిగా ప్రీతమ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ మసక మసక మబ్బుల్లో నిన్న సాయంత్రం నుండి ప్రీతమ్ను ఆశ్చర్యానికి గురిచేసిన అంశాలన్నీ లీలగా కనిపించాయి. గాల్లో తిరుగుతున్న మనసు భూమి మీదికి వచ్చింది. అమ్మ నాన్న వస్తున్నారన్న సంగతి జాహ్నవికి ముందే తెలుసన్నమాట. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఈరోజు జరుగబోయే మహాసంగ్రామానికి వ్యూహాలు రచించారన్నమాట. ఇలాంటి అతి తెలివితేటలన్నీ మా అత్తగారి కుటుంబం నుండే నేర్చుకోవాలి అనుకొని, సర్లే సత్యం మన దగ్గర ఉంది. న్యాయం మనవైపే ఉంటుంది. మనకెందుకు బెంగ అనుకుని భుజాలు తడుముకొని, రాత్రి నాన బెట్టిన బూట్లను ఉతుక్కోవడానికి వెళ్ళిపోయాడు ప్రీతమ్. మధ్యలో మామ నారాయణ గారు అటుగా వచ్చి, చూడనట్టుగా వెళ్ళిపోయారు. బూట్లు పని అయిపోగానే, పని మనిషికి, జాహ్నవికి వీలుకాదు అనుకునే తెల్లబట్టలకు నీలి మందు తగిలించి, ఆరబెట్టి ఇంటలోకొచ్చాడు. ఇక చర్చ ఎప్పుడు మొదలవుతుందో అని ప్రీతమ్కు చాలా ఆరాటంగా ఉంది. కానీ వీళ్ళు వస్తున్నారని ముందస్తు సమాచారం లేకపోవడం వలన ప్రీతమ్ మీ-సేవా సెంటర్లో ఆధార్ కార్డు మార్పులు పని పెట్టుకున్నాడు. ఆధరైజ్డ్ సెంటర్లు తక్కువ ఉండడం వలన కేవలం పరిమిత సంఖ్యాకులకే పని అవుతుంది. ప్రీతమ్ నంబరు ఎప్పుడు వస్తుందో, ప్రీతమ్ తిరిగి ఎన్ని గంటలకు ఇంటికి రాగాలుగుతాడో, తన వలన ఈ కార్యక్రమం ఆలస్యం అయిపోతుందేమో తెగ బాధపడిపోతున్నాడు. ఎలాగైనా సరే మొదటిగా వచ్చిన వారిలో ఉండాలని తొమ్మిది గంటలకే పరుగెత్తాడు. మీ-సేవ సెంటరు దగ్గరకొచ్చేసరికి ఆ ప్రాంగణమంతా వివిధ వాహనాలతో నిండి పోయింది. లోపలి వెళ్లేసరికి హాల్లో కుర్చీలన్నీ నిండుగా ఉన్నాయి. నెమ్మదిగా తోసుకుంటూ ముందుకెళ్ళి మేడం ఆధార్ కార్డు టోకెన్ కావాలిఅన్నాడు. రోజుకి నలభై రెండు ఇస్తామండి, ఈరోజు కోటా అయిపొయిందిఅని చెప్పింది ఆవిడ. మేడం టోకెన్ దొరకాలంటే ఎన్ని గంటలకు రావాలి?” అడిగాడు సంకోచంగా. తెలియదండి, మేము వచ్చేసరికే వాళ్ళంతా వచ్చి, పేపరు మీద ఆర్డరు రాసుకుని ఉంటున్నారుఅని చెప్పింది ఓపికగా. స్టేట్ బ్యాంక్ లో గానీ, కెనరా బ్యాంక్ కో గానీ ట్రై చేయండి అని సలహా కూడా ఇచ్చింది దిగాలుగా ఉన్న ప్రీతమ్ మొహం చూసి. మీరెన్ని గంటలకు వస్తారోఅన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ, “ఎనిమిదిఅందావిడ కళ్ళెగరేసి. గుండె గతుక్కుమంది. పది గంటలకు ప్రారంభమయ్యే ఓ పనికి ఎనిమిదికి ముందే జనం వస్తున్నారా! ఎంత కష్టం వచ్చింది. అనుకుని బయటకు వచ్చాడు. వెంటనే మామ నారాయణ గారు గుర్తొచ్చారు. మళ్ళీ ఉత్సాహం ఓహ్.. ఈ పని అవ్వకపోయినా పర్లేదు, ఆ పని అవుతుంది కదాఅనుకుని మళ్ళీ సరదాగా ఇంటికి బయలుదేరాడు. ఇంట్లోకి అడుగు పెట్టేసరికి మామగారు, అత్తగారు,  ప్రీతమ్కు బాగా తెలిసిన వాళ్ళు ఎవరో వస్తే, వారితో మాట్లాడుతున్నారు. ఆ మాటలు పూర్తయ్యేసరికి మామగారు నిద్ర పోయారు. ఛీఈరోజు బయటి వెళ్లి కొంత మంది మిత్రులను కలవాలి అని కూడా అనుకున్నాను. అదీ జరుగలేదుఅని బాధపడుతూ “How to Deal with Difficult People: Smart Tactics for Overcoming the Problem People in Your Life” పుస్తకం చదవడం మొదలు పెట్టాడు ప్రీతమ్. పేజీలు కదిలిపోతున్నాయి కానీ బుర్రలోకి ఏదీ ఎక్కడం లేదు.  రెంటికీ చెడ్డ రేవడిలా అయిపొయింది ప్రీతమ్ పరిస్తితి. ఇంతలో భోజనం టైం అయ్యింది. ప్రీతమ్ వెళ్లి మామగారిని నిద్ర లేపేసాడు. నిద్ర, భోజనం తరువాత ఖాళీయే కదా. అప్పుడైనా మీటింగ్ జరుతుందేమోనని ఆశ. అత్త గారు చెయ్యేసిన కోడి కూర రుచిగా భోంచేసి, మళ్ళీ ఎదురుచూడడం మొదలెట్టాడు. మామగారు దివాన్ కాట్ మీద కూర్చొని, సరదాగా మాట్లాడుతూనే మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయాడు. నెమ్మది నెమ్మదిగా అత్తగారు, మరదలు, భార్య అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఒక్కొక్కరూ నిద్రలోకి పోతూ ఉంటే ప్రీతమ్కు బీ.పీ. పెరిగిపోతుంది. నాలుగు తరువాత ఎలాగూ లేస్తారు కదా అని ఎదురుచూస్తూ మళ్ళీ పుస్తకం తెరచాడు. ధ్యానం కుదరడం లేదు. ఇక నా వల్ల కాదు, నేను కూడా ఓ కునుకేస్తాఅని పడుకున్నాడు ప్రీతమ్. నిద్ర బాగానే పట్టినట్టుంది. కళ్ళు తెరిచే సరికి సాయంత్రం నాలుగు అయ్యింది. ఉత్సాహంగా పైకి లేచాడు. మిగతావాళ్ళు ఎవ్వరూ ఇప్పట్లో ఈలోకంలోకి వచ్చే సూచనలు కనబడడం లేదు. దీనమ్మ జీవితంఅనుకొని, ఒక మిత్రుడికి ఫోన్ చేస్తే, “నేను ఖాళీగా ఉన్నాను ఎప్పుడు కల్లుద్దాంఅన్నాడు ఆ మిత్రుడు. ఇప్పుడు నువ్వే నాకు దేవుడురాఅంటూ వాడి దగ్గరకి పరుగెత్తాడు ప్రీతమ్. తన బాధ అంతా వాడి దగ్గర కక్కేసి, కాసేపు నవ్వుకుని తీరిగ్గా రాత్రి ఏడున్నరకి ఇంటికి చేరుకున్నాడు. మిత్రుడితో  ఉన్నంతసేపూ బాగానే ఉంది కానీ ఒంటరిగా ప్రయాణించేటపుడు మళ్ళీ ఆరాటం మొదలయ్యింది. ప్రీతమ్కు కావలసిన వాతావరణం ఏమైనా ఉందా అని చూసుకుంటూ లోపలి అడుగుపెట్టాడు. ఏ కోశానా ప్రీతమ్ కోరిక తీరే సందర్భం కనబడడం లేదు. ఇక ఈరోజు అవ్వదని అర్ధమయ్యింది. సర్లే రేపు చూద్దాం అనుకొని వదిలేసాడు.
ఊహించని రీతిలో, రాత్రి  భోజనాలయ్యాక మామగారు అందరినీ పిలిచారు. ఇక నా టైం వచ్చిందన్న మాటఅనుకుని ఉత్సాహంగా వెళ్లాడు ప్రీతమ్. చెప్పండి మీ ప్రాబ్లం ఏమిటిఅడిగాడు మామ నారాయణ గారు. అన్నీ ముందే చెప్పేసాము కదా. మళ్ళీ కొత్తగా ఎందుకు, కేవలం సారాశం చెబితే చాలుకదా అనుకొన్న ప్రీతమ్ మీ అమ్మాయి నాతో సమాధానంగా ఉండడం లేదు. నాకు నచ్చని పనులే చేస్తుంది. సహాయ నిరాకరణ ఉద్యమం బలంగా చేస్తుంది. వద్దన్న పనులు చేయడమే కాకుండా, వేరే ఎవరికోసమో నాతో గొడవ పడుతుంది. ఇవన్నీ చూస్తుంటే తను నాతో గొడవ పడడమే ముఖ్య ఉద్దేశ్యంలా ఉంది. ఈ ప్రేమలేని జీవితాలు ఎంతకాలం బ్రతకాలో తెలియడం లేదుఅంటూ నిట్టూర్చాడు. పెద్దగా ఎవరూ భాగస్వాములు కావడం లేదు. అందరూ ప్రీతమ్ వైపు తోలుబొమ్మలాట చూసినట్టు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రీతమ్ అత్తగారు కాంతం. మరోవిషయం ఉంది అంటూ ప్రీతమ్ మళ్ళీ మొదలెట్టాడు నేను ఏమి అనినా అది తనను అవమానించడానికే అని భావిస్తుంది. నా బ్రతుకంతా తనను అవమానించడానికే అని అంటుందిఅని ముగించాడు. ఇది నిజంఅంది జాహ్నవి వెంటనే.  ప్రీతమ్ ఆశ్చర్యపడలేదు. జాహ్నవి కేవలం నెగటివ్స్ కే స్పందిస్తుంది. మామ గారి వైపు చూస్తూ `ఉమ అని నా పాత స్నేహితురాలు. ఒక సందర్భంలో మా మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అది ఎంత వరకూ వెళ్లిందంటే ఆమె నన్ను చంపుతానని భయపెట్టించింది. అలాగే ఆ అమ్మాయి జాహ్నవిని కలిసిన రెండో పరిచయంలోనే నా గురించి చెడుగా చెప్పడం మొదలెట్టింది. ఉమ నా జీవితం మీద పగబట్టిందని ఆరోజే అర్ధమయ్యింది. అందుకే ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్న వాళ్ల పరిచయాన్ని వదిలేయమని, నేను కూడా వదిలేస్తున్నానని చెప్పాను` అని ఆపి అందరి వైపు చూసాడు ప్రీతమ్. అత్త, మామలు ఆశక్తిగా వింటున్నారు. జాహ్నవి మాత్రం అసహనంగా ఉంది. ప్రీతమ్ మళ్లీ మొదలెట్టాడు. `నిజానికి జాహ్నవి తనతో రిలేషన్ కొనసాగిస్తుందని నాకు తెలియదు. అనుకోకుండా ఒక రోజు తన ఫోన్ లో ఒక వింత పేరు కనిపించింది. వెంటనే ఆ నంబరు నా ఫోన్ లో కొడితే అది ఉమ నంబరు. నాకు గుండె ఆగిపోయినంత పనయ్యింది. జాహ్నవి సీక్రెట్గా ఉమతో మాట్లాడుతుందా? అంత అవసరం తనకేమొచ్చిందో నాకు అర్ధం కాలేదు. ఇంతలో జాహ్నవి వచ్చింది. ఇది ఏమిటి అని అడిగాను. అంత సీక్రెట్ పేరు ఎందుకు పెట్టావు అన్నాను. ఏదో అలా పెట్టేసాను అంది లైట్ గా. సరే ఇకనుండి మానేస్తావా అన్నాను. నా ఫ్రెండ్స్ విషయంలో జోక్యం చేసుకోకు అంది` అని ఆపి, నన్ను ఏమి చేయమంటారు అని అడిగాడు ప్రీతమ్.
`జాహ్నవి ఆమెతో మాట్లాడితే మీకేమిటి ఇబ్బంది` అంటూ అడిగాడు మామగారు ఇదేదో పెద్ద జోక్ లా..
ఈ పరిచయం మామూలు పరిచయం అయితే నాకు ఇబ్బంది లేదు. నా మీద పీకల దాగా కోపం పెంచుకుని, నన్ను శత్రువుగా చూస్తున్న వ్యక్తితో పరిచయం. సదరు వ్యక్తి సంబంధాలు బావున్నప్పుడు ఎలా వుంటుందో, అవి తెగిపోయాక ఎలా వుంటుందో స్పష్టంగా తెలిసిన వ్యక్తిని నేను. ఇప్పుడు తను జాహ్నవి అమాయకత్వాన్ని ఆధారచేసుకుని నా మీద పగ సాధిస్తుంది. జాహ్నవి మనసుని నెమ్మదిగా విషంగా మార్చేస్తుంది. అది ఇప్పటికే మొదలయ్యింది. జాహ్నవికి ఎంత చెప్పినా అర్ధం కావడం లేదు. ఈ మధ్య మళ్లీ గమనించాను. తను అలాగే కొనసాగిస్తుంది. ఇప్పుడది ఏ స్థాయికి వెళ్లింది అంటే నా శత్రువుతో నువ్వు సంబంధం సాగిస్తే నా పెళ్ళానివి కావు అన్నాను. తను కూడా అంతే వేగంతో నువ్వు నా మొగుడివి కాదు అంది. ఇప్పుడు అర్ధం అయ్యిందా తను ఎంత దూరం వెళ్లిందో. తన ప్రభావం ఎంత ఉందో` అని ఇక ఏమీ మాట్లాడలేక ఆగిపోయాడు ప్రీతమ్.
నారాయణ గారికి ఏదో అర్ధమయ్యినట్టుంది. అమ్మా జాహ్నవి `మీ ఆయన వద్దన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడడం. తన వలన నీకు కలిగిన పరిచయం. అదీ చాలా తక్కువ సమయం. మానేస్తే సరిపోతుంది కదా` అన్నాడు సర్ది చెప్పే ధోరణిలో. నెమ్మదిగా రణరంగం వేడెక్కింది. ఉమ నా ఫ్రెండ్. ఎవ్వరు చెప్పినా నేను తన స్నేహం వదలను` అని తెగేసి చెప్పింది జాహ్నవి. జాహ్నవి లీడ్ తీసుకుంది. ప్రీతమ్ చెప్పినవన్నీ అబద్దాలని కొట్టిపారేసింది మెడిమిక్స్ యాడ్ లా అవన్నీ మర్చిపోండి, మెడిమిక్స్ మాత్రం రాసుకోండిఅన్నట్టు. అందరూ ఆ అమ్మాయి వైపు ఆరాధనా పూర్వకంగా చూస్తున్నారు. ప్రీతమ్ అనుభవించిన వేదన, ప్రీతమ్ ఎదురుచూసిన ఆశ అన్నీ వృధా అయిపోయాయి. ప్రీతమ్కు మాట్లాడే అవకాశం రావడం లేదు. బలవంతంగా తీసుకుంటున్నాడు. కానీ ఎంతో సేపు నిలవడం లేదు. జాహ్నవి యుద్దంలో హిట్లర్ వచ్చినంత దూకుడుగా వస్తుంది. చివరిగా తన తీర్పు చెప్పింది. నా భర్త ఫోనులో ఎక్కువ సేపు మాట్లాడకూడదు, తన బెస్ట్ ఫ్రెండ్ కరీంతో అస్సలు మాట్లాడకూడదు, నా మీద ఎవ్వరికీ ఏరకమైన ఫిర్యాదు చేయకూడదు. ఒకవేళ అలా జరిగితే ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇక నా బాద్యతలంటారా అవి మీకన్నా నాకే ఎక్కువ తెలుసు. నాకెవ్వరూ చెప్పక్కర్లేదుఅంటూ ముగించింది ఒక వార్నింగ్ లా. అత్తగారు కాంతం విజయ గర్వంతో కూతురి వైపు చూసింది. మామ నారాయణ ప్రీతమ్ను సమర్దించాలని ఒక ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. సరే సరే .. మీ ఇద్దరూ గొడవలు మానేసి, మీ పిల్లాడి కోసం కలసి ఉండండి. పడుకోండి నిద్రొస్తుందిఅని మంచమెక్కేసాడు నారాయణ గారు. ఈ మొత్తం సీనులో రెండు విషయాలు ప్రీతమ్కు గుర్తుండి పోయాయి. ఒకటి జాహ్నవి వార్నింగ్, రెండు మా అత్తగారి కళ్ళల్లో గర్వం.
రెండో రోజు అంతా మామూలుగా ప్రారంభం అయింది. ఆరోజు ఒక సభకు వెళ్లాలని ప్రీతమ్ ముందుగా నిర్ణయించుకోవడం వలన ఉదయాన్నే వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం ఆలస్యంగా వచ్చాడు. ఇంట్లో వాళ్ళందరి భోజనాలు అయిపోయినాయంట. ఇల్లంతా నిశబ్దంగా ఉంది. అత్తగారు తప్ప అందరూ పడుకున్నారు. ఆవిడే ప్రీతమ్కు భోజనం వడ్డించింది. ప్రీతమ్ మనసులో ఒకటే ఆలోచన. ప్రీతమ్ లేనపుడు ఏమి జరిగి ఉంటుంది’, ‘జాహ్నవికి వీళ్ళు ఏమైనా బోధ చేసారా’, ‘ప్రీతమ్ ఉండగా చెప్పలేనివి ఏమైనా చెప్పి ఉంటారా’, ‘నిన్న ఆగిపోయిన చర్చ ఎలా కొనసాగించి ఉంటారువంటి ఆలోచనలు ప్రీతమ్ మెదడుని తొలిచేస్తున్నాయి. ప్రీతమ్ కోరుకున్న పరిష్కారం దొరకనేలేదు. కాని దానిని ఎలా కొనసాగించాలో తోచడం లేదు. సర్లేఇంకో రెండు రోజులు ఉంటారేమో అన్నీ సర్దుకుపోతాయిలే అనుకొన్నాడు. తరువాత పని ఏమి చేద్దామని ఆలోచిస్తే వాళ్ళ బాబు మేఘాన్ష్ గుర్తొచ్చాడు. మేఘాన్ష్ ఎప్పటినుండో సినిమాకి తీసుకెళ్ళమని అడుగుతున్నాడు. సినిమాని అర్ధం చేసుకొనే వయసేం కాదు కానీ సరదా. మేఘాన్ష్ కోరిక తీరుద్దామని అడుకున్నాడు ప్రీతమ్. చక చకా ‘BookMyShow’ లో టికెట్స్ బుక్ చేసి, బెడ్ రూమ్ లోనుండి హాల్ లోకి రాగానే, మామగారు కళ్ళు తెరిచి, “మాకు టికెట్స్ బుక్ చేయండి, వెళ్ళిపోతాంఅన్నాడు. ప్రీతమ్ గుండె గుటుక్కుమంది. అదేంటి? అప్పుడేనా? ఇక్కడేమీ తేలలేదు కదా! అన్నాడు లోలోపల కంగారు పడుతూ. ఇంక ఏమీ మాట్లాడొద్దు, వండితే ఇంట్లో తినండి, లేకపోతే బయట తినండి. అంతే. ఈ సమస్యకు పరిష్కారం రాదుఅన్నాడు నారాయణ గారు వినపడీ వినపడనట్టు. ఇది చెప్పడానికే వచ్చారా?” అడిగాడు ప్రీతమ్ నారాయణకు మాత్రమే వినబడేలా. మధ్యాహ్నం దీని మీద చాలా గొడవ అయ్యింది. ఇక నేను మీకు ఏమీ చెప్పలేనుఅనేసాడు నారాయణ గారు. ఆయన ఎవరికో భయపడుతున్నాడు ప్రీతమ్కు అర్ధమయ్యింది. ఇబ్బంది పెట్టకూడదని వదిలేసాడు. మేఘాన్ష్ తీసుకుని సినిమాకెళ్ళాడు.
రాత్రి ఇంటికి చేరుకున్నాక మళ్ళీ టికెట్ల గోల మొదలయ్యింది. ప్రీతమ్ జాగ్రత్తగా వదిలించుకొని వెళ్ళిపోయి పడుకున్నాడు. తెల్లారి ఉద్యోగానికి వెళ్ళాలి కదా. ఉదయమే లేచాడు. ప్రీతమ్ మనసులో ఉన్న వెలితి తీరలేదు. ఈరోజు దాటితే వీళ్ళు వెళ్ళిపోతారు. నా సమస్య అలాగే ఉండిపోతే నా జీవితానికి అర్ధమే లేకుండా పోతుందిఅనుకుంటున్నాడు ప్రీతమ్. ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు. పావు గంట ముందే తయారైపోయాడు. మళ్ళీ అందరినీ కూర్చోబెట్టాడు. మీరేమో వెళ్ళిపోతాము అంటున్నారు. నాకైతే ఏ సమాధానం చెప్పలేదుఅని వాళ్ళ మొహాలవైపు చూసాడు ప్రీతమ్. అందరూ చాలా బుద్దిగా వింటున్నారు. మళ్ళీ మొదలు పెట్టాడు నాకు గుర్తున్నదల్లా మీ అమ్మాయి వార్నింగ్ మాత్రమే. మీరు ఏదో ఒక సమాధానం చెప్పి వెళ్ళండిఅన్నాడు ప్రీతమ్ కొంచెం కరకుగా. మళ్ళీ అదే దృశ్యం-తోలుబొమ్మల్లాట. మళ్ళీ ప్రీతమే మొదలుపెట్టాడు. మీరు చెప్పేది లేకపోతే నేనే చెబుతాను. నా మాట వినని వారు, నాతో సమాధానంగా ఉండలేని వారు ఈ ఇంటి నుండి వెళ్ళిపొండి. ఇది నా ఇల్లు. ఇక్కడ అంతా నా ఇష్ట ప్రకారమే జరగాలి. నేనంటే ఇష్టపడే వాళ్ళే నా ఇంటికి రావాలి. అంతేకాని నాతోనే ఉంటూ నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు నాకు అవసరం లేదుఅన్నాడు శ్రుతి తప్పిన గొంతులో. జాహ్నవి అంతే దురుసుగా లేచింది. ప్రీతమ్ అన్న ప్రతీ మాట రిపీట్ చేసింది. ప్రీతమ్ను నువ్వే ఇంట్లోనుండి వెళ్లిపొఅంది. భార్యగా ఇది నా హక్కు అంది”. ఆమెకెప్పుడూ హక్కులే తప్ప భాద్యతలు గుర్తు ఉండవు. ప్రీతమ్ మొన్న రాత్రి నుండి ఆమె బాధ్యతల గురించి మాట్లాడుతున్నాడు. అలాంటపుడు మెడిమిక్స్యాడ్ వేస్తుంది, హక్కుల దగ్గర మాత్రం అమ్మోరులా గర్జిస్తుంది. ఆమె అంతేనని ప్రీతమ్కు బాగా తెలుసు. కానీ పెద్ద వాళ్ళు బాధ్యత తీసుకుంటారని, నాలుగు మంచి మాటలు చెబుతారని ఆశపడుతున్నాడు. ఎవరు ఉంటారో, ఎవరు వెళ్తారో తేల్చుకుని చెబితే టికెట్ బుక్ చేస్తానుఅని  చెప్పేసి ఆఫీసుకి బయలుదేరాడు ప్రీతమ్. వెనుక నుండి ప్రీతమ్ భార్య జాహ్నవి మాటలు వినబడుతున్నాయి. నీ తాటాకు చప్పుళ్ళకు ఎవరూ భయపడరు. నువ్వు నన్ను కాలికింద వేసి తొక్కేయ్యాలి అనుకుంటున్నావు. అది నీ కలలో కూడా జరుగనివ్వను. నీ సంగతి, నిన్ను ప్రేరేపించిన వాళ్ళ సంగతి చెబుతా. ఎవరికి చెప్పాలో, ఎవరితో చెప్పించాలో వాళ్ళతోనే చెప్పిస్తా…..” అంటూ ఊగిపోతుంది. ప్రీతమ్ వెళ్ళిపోతున్నాడు భౌతికంగా ఆ మాటలకు దూరంగా, మానసికంగా ఆ మనిషికే దూరంగా.
ఆఫీసులో ప్రీతమ్ ద్వారా జరుగాల్సిన ఏ పనీ జరుగడం లేదు. కళ్ళు బైర్లు కమ్మినట్టు, తలపై మోయలేని భారం పెట్టినట్లు అనిపిస్తుంది. బాధ్యతలు నిర్వర్తించమని అడిగితే వార్నింగ్ ఇస్తారా? నీ సంగతి చూస్తానని భయపెడతారా?” అనే ప్రశ్నలు తలలో గింగురాలు తిరుగుతున్నాయి. తనలో తానే మాట్లాడుకుంటున్నాడు ఇంతకీ కాలుకిందేసి తొక్కుతున్నది నేనా? తనా?.” ప్రీతమ్కు ఒక విషయం మాత్రం అర్ధం అవుతోంది. తను సంక్షోభంలో ఉన్నాడని, అది మరింత జటిలం అవుతుందని. సాయంత్రం నాలుగు గంటలకి మామ గారి నుండి  ఫోనోచ్సింది. ఏదైనా కీలక నిర్ణయం తీసుకుని ఉంటారేమో అనే చిగురాశతో ఫోన్ ఎత్తాడు ప్రీతమ్. నారాయణ గారు మేము ఆరుగంటలకి బయలుదేరుతున్నాము, మీరు ఆ టైముకి రావడం వీలయితే కలుద్దాం లేకపోయినా పరవాలేదుఅన్నాడు. ప్రీతమ్కు ఎంత కోపం వచ్చిందో అంత నిస్సహాయతగా అనిపించింది. నిన్నటి వరకూ డబ్బులు ఎక్కువై పోతాయని గరీబ్ రధ్ టిక్కెట్లే వద్దన్నవాడు ఏకంగా దురంతో టికెట్ కొన్నాడు. ప్రీతమ్కు అర్ధమవుతుంది. వీలైనంత త్వరగా అత్త మామ వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే తప్పించుకుని పారిపోవాలి అనుకుంటున్నారు. ఇంకా ఏమీ తేలకుండానే వెళ్ళిపోతారాఅన్నాడు కొంచెం చిన్న గొంతుతో ప్రీతమ్. ఇందులో తేల్చడానికి ఏముంది. ఇద్దరికీ ఈగో ఉంది. అది తగ్గించుకుంటే మీ పిల్లాడికి మంచింది. మేము కూడా చేసేది ఏమీ లేదు. మేము వెళ్తున్నాం. మీరు జాగ్రత్తఅని ఫోన్ పెట్టేసాడు నారాయణ గారు.
సాయంత్రం ప్రీతమ్ ఆఫీసు నుండి వచ్చే సరికి నారాయణ, కాంతం జంట వెళ్ళిపోవడానికి సిద్దంగా ఉన్నారు. ప్రీతమ్ మౌనంగా కూర్చున్నాడు ఇంక మాట్లాడినా ప్రయోజనం లేదని గ్రహించి. ఆయనకేదో సమాధానం కావాలంట చెప్పుఅని మామ నారాయణ అత్త కాంతాన్ని ముందుకు తోసారు. మొన్న రాత్రి నుండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తోలుబొమ్మలాట చూస్తున్న అత్తగారు (కాంతం) తన ప్రేక్షక పాత్రను పక్కన పెట్టి బాహుబలి శివగామి అవతారం ఎత్తింది. బాబూ నీ పద్దతి బాలేదు. నీ మాటలు బాలేదు. నా కూతురు ఏమి తప్పు చేసింది. లంజతనం చేసిందా? దొంగతనం చేసిందా? తీసుకెళ్ళి పొమ్మని ఎలా అంటావు. మేము తీసుకెళ్ళడానికి వచ్చామా?” అంటూ కోపం నిండిన కళ్ళతో చెబుతుంది కాంతమ్మ. లంజతనం చేస్తేనో లేక దొంగతనం చేస్తేనే నీకు సమస్యలా? వేరే ఏమీ నీకు సమస్యలుగా కనపడవా?” అన్నాడు ప్రీతమ్ అంతే పెద్ద గొంతుతో. నువ్వు ఇక్కడ ఏదో చాలా ఘోరం జరుగుతున్నట్టు ఫిర్యాదు చేసావు. అందుకే మేము కాకినాడ వెళ్తున్నామని చెప్పి, ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చాం.” “మా అమ్మాయిని చెక్ చేయాలని వచ్చాం. కానీ ఇక్కడ నువ్వు చెప్పినట్టు ఏమీ కనిపించలేదు. అన్నీ నువ్వే కల్పిస్తున్నావు అని అర్ధమవుతుంది…” అంటూ ఏదో చెప్పబోతుంది కాంతం. ఇంతలో జాహ్నవి వచ్చి ఆవిడని చేయి పట్టుకు లాక్కెల్తూ అమ్మా నీ బాధ్యతగా నువ్వు వచ్చావు. ఇక నువ్వు వెళ్ళు. బాధ్యత లేనోళ్ళు కొంతమంది ఉన్నారు. నేనిపుడు వాళ్ళని ఇక్కడికి రప్పిస్తాను. ఎలా రప్పించాలో నాకు తెలుసు. నువ్వు క్షేమంగా బయలుదేరుఅంటూ బయటికి తీసుకెళ్ళింది కాంతంను. నారాయణ గారు నాకు సంబంధం లేదనుకున్నాడో, కాంతం సరిపెడుతుందని అనుకున్నాడో తెలియదు గానీ తీరిగ్గా రోడ్డు మీద నుంచుని ఎదురు చూస్తున్నాడు.  ప్రీతమ్ మాత్రం బయటికి వెళ్ళలేదు. అత్తగారి కళ్ళు, మాట చూసాక ప్రీతమ్కు ఒక విషయం అర్ధమయ్యింది. జామ చెట్టుకు జామ కాయలే కాస్తాయి, మందార చెట్టుకు మందార పువ్వులే పూస్తాయి. జామ చెట్టు కింద నించుని మందార పువ్వులు కోరుకోవడం ఎంత అవివేకం అని. అమ్మా నాన్నల ముందే ప్రతీ మాటకి పెట్రేగిపోయే కూతురిని చూస్తే అర్ధమయ్యింది, ప్రీతమ్ లేనపుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అని. ఒక అనుభవం మరో జీవితాన్ని నిలబెడుతుందన్న ఆశ విత్తును బట్టే చెట్టుఅన్న అవగాహనలతో వీగిపోయింది.
అయితే అత్తగారు నిజంగానే ఎవ్వరికీ చెప్పకుండా వచ్చిందా? అది నిజమైతే ఇంట్లో అన్నీ అంత క్రమంగా ఎలా జరిగాయి అనే ఆలోచనలతో ఉన్న ప్రీతమ్ అలాగే సోఫా మీద నిద్రపోయాడు. ప్రీతమ్ కళ్ళు తెరిచేసరికి భార్య జాహ్నవి, తన అక్కతో వీడియో కాల్ మాట్లాడుతుంది. ప్రీతమ్కు మాటలు స్పష్టంగా వినబడుతున్నాయి.
ఇంతలో అక్క అడిగింది మమ్మీ, డాడీ బయలుదేరి పోయారా….”.
ఇవతలి నుండి ప్రీతమ్కు ఏ సమాధానం చెప్పినట్లు వినబడలేదు.
మళ్ళీ అవతలినుండి ఏమిటే నాకు అర్ధం అవడంలేదు”.
ఇవతలి నుండి నోటితో సమాధానం చెప్పినట్టుగా ప్రీతమ్కు వినబడలేదు.
అప్పుడు అవతలి నుండి సరే సరే”.
తరువాత ఫోన్ కట్ అయిందని అర్ధం అయింది.
అబద్దాలతో సందర్భాన్ని గెలవొచ్చు గానీ మనుషుల్ని, జీవితాన్ని గెలవలేమనే విలువ ఆ వయసు నుండి ఈ వయసు వరకూ అర్ధం కాకపోవడం చూసి జాలి పడుతున్నాడు ప్రీతమ్. ఆపినా ఆగని కాలం కోసం బ్రతుకును వెతుక్కుంటూ వెళ్తున్నాడు అరకేజీ రాయిని అర్ధ గంట మోస్తేనే భారం అనిపిస్తుంది. ఆరడుగుల భారాన్ని బ్రతికినంత కాలం మోయాలంటే అరుపులు, కేకలు, అసహనాలు, అవమానాలు తప్పవు మరి.













https://magazine.saarangabooks.com/%E0%B0%85%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%85%E0%B0%AC%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%82/

No comments: