ముంజేతులు లేవు, ఐనా స్పిన్ బౌలింగ్‌లో ఘనాపాటి ఈ బాలుడు -వీడియో లింక్
బ్రిటన్‌కి చెందిన కీరన్ టంగ్-గిబ్స్ కి పుట్టుకతోనే ముంజేతులు లేవు. ఒక చేతికి మోచేయి తర్వాత కొద్ది భాగం ఉండగా, రెండో చేతికి మోచేయి కూడా లేదు. అయినా ఒక చేతికి ఉన్న మోచేయిలో క్రికెట్ బంతిని ఇరికించుకుని ఖచ్చితంగా లైన్ అండ్ లెంగ్త్ ప్రకారం స్పిన్ ని జతచేసి మరి బంతులు విసురుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అవే చేతుల్తో బ్యాటింగ్ చేయగలుగుతూ అంగ వైకల్యాన్ని గేలి చేస్తున్నాడు. బ్రిటన్ దేశానికి ఆడాలని కలలు గంటున్న ఈ బాలుడు బౌలింగ్ చేస్తున్నప్పుడు గానీ, బ్యాటింగ్ చేస్తున్నపుడు గానీ ఎటువంటి కృత్రిమ అవయవాలను ఉపయోగించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చేత ఈ బాలుడు గుర్తింపుని సాధించాడు. అంగవికలుర ఆటల పోటీలలో భవిష్యత్తులో స్టార్ ఆటగాడిగా మారగలడని ఆ బోర్డు కీరన్‌ని గుర్తించింది. ఇపుడా బాలుడు ‘ఏస్ట్‌వుడ్ బ్యాంక్ క్లబ్’ తరపున ఆడుతున్నాడు. క్రమం తప్పకుండా వార్‌విక్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ లో శిక్షణకు హాజరవుతున్నాడు. ఈ బాలుడి బౌలింగ్, బ్యాటింగ్ విన్యాసాలను చూపే కొద్ది సెకన్ల వీడియోను సన్ వెబ్ సైట్ ప్రచురించింది. దానిని ఇక్కడ చూడవచ్చు.
“ఆట పట్ల కీరన్ చాలా ఇష్టాన్ని కనబరుస్తున్నాడు. క్రికెట్ ఆటపైనే అతని మనసంతా. జీవితంలో విజయవంతం కావడానికి అదే కదా కావలసింది. రాను రానూ పరిణతి చెందుతున్నాడు” అని కీరన్ తల్లి కేరీ గిబ్స్ మురిపెంగా చెబుతోంది. 7 సంవత్సరాల వయసులో సెలవుల్లో బీచ్ క్రికెట్ ఆడుతుండగా బాలుడి ప్రతిభను గుర్తించినట్లు అతని తల్లిదండ్రులు చెప్పారు. ‘వెల్‌ఛైల్డ్స్ హెల్పింగ్ హేండ్స్’ అనే సంస్ధకి చెందిన వాలంటీర్లు బాలుడి ఇంటి వెనక ఉన్న ఖాళీ స్ధలాన్ని బాగు చేసి క్రికెట్ నెట్స్ ఏర్పరిచి ఆటను ఇంటివద్ద కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
No comments:
Post a Comment