Tuesday, November 8, 2011

యువతకు ధైర్యం కావాలి

ఇప్పుడు యువతకు ధైర్యం కావాలి. ఆత్మ స్థైర్యం కావాలి. "అసమర్థుని ఆఖరి ఉపాయం హింస" అని గాంధీ చెప్పినట్టు ఎక్కడో చదివాను. బహుశ యువత, మరీ ముఖ్యంగా ప్రేమించుకొనే యువత ఈ సూత్రాన్ని పాటిస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రేమ, ఆకర్షణ, సెక్స్ ల మధ్య తారతమ్యాలను వివరించి చెప్పగలిగే technology కావాలి. దీనిని ప్రతీ ఇంట్లో పెద్దలు ఒక బాధ్యతగా స్వీకరించాలి.
“నన్ను ఎవరూ ప్రేమించడం” లేదనేది చాలా నిరంకుశమైన ఆలోచన. ఈ ఆలోచనకి చాలా దగ్గరైనదే నేను మెచ్చిన అమ్మాయిన నన్ను ఖచ్చితంగా ప్రేమించి తీరాలి అనేది. ఈ నిరంకుశమైన ఆలోచనలకు వేళ్ళు ఎక్కడి వున్నాయి. వేరును నాశనం చేయకుండా కొమ్మలు నరుకుతూ కూర్చుంటే పరిష్కారం ఎప్పటికి రావొచ్చు. ప్రేమను ఇవ్వడం ద్వారానే ప్రేమను పొందగలమనే సూత్రాన్ని నేర్పాంచిల్సిన బాధ్యత ఎవరిది. కుటుంబ సభ్యులదా? ఉపాధ్యాయులదా? స్నేహితులదా? మరి వీళ్లందరూ నేర్పలేక పోతున్నారంటే వాళ్లకి ప్రేమ గురుండి తెలియదా? లేక ప్రేమంటే కేవలం ఎదుటి వారి దగ్గరనుండే పొందేది మాత్రమే అనే నిర్వచనం ఉందా? అందుకేనా ఒక రాజ్యాధికారం కోసం, హక్కుల కోసం, సమానత్వం కోసం, గౌరవం కోసం పోరాడినట్టు ప్రేమ కోసమూ పోరాడుతున్నారు. యుద్దములో గెలుపులు ఒక్కరిదే ఉండాలనా ప్రాణాలు తీస్తున్నారు. పరిపూర్ణమైన అవగాహనా రాహిత్యం.
మన జీవితంలో జరిగే సంఘటనలకీ, మనం చదువుకీ మధ్య అనుసంధానం ఎవరు చేస్తారు. ప్రతీ చర్యకు సమానమైన ప్రతి చర్య ఉంటుందని గ్రహించిన రోజున ప్రేమించడం మన నుండే ప్రారంభం కాదా. ఆశించిన ఫలితాలు రాని రోజున నీ ప్రయత్నం లో లోపమే గానీ ఎదుటి వ్యక్తి బాధ్యత కాదని మనకు అవగతం కాదా. చాలా సార్లు పేపర్లలో చదివిన అంశం “ఆమే ముందు నన్ను ప్రేమించింది. ఇప్పుడు నన్ను కాదని వేరే వారితో దగ్గరగా ఉంది/ నన్ను దూరం చేస్తుంది/ etc. అంటే నిన్ను అంగీకరించకపోవడం / వేరే వాళ్లని అంగీకరించడం వెనుక నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవలసిన అంశాలు ఎన్నో. ఈ విషయాలపై యువతకు శిక్షణ, ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడమే తప్పనుకునే ఈ సమాజంలో, ఎవరిస్తారు. చనిపోయింది నా కూతురనో, చంపింది నా కొడుకనో తెలిసిన తరువాత నెత్తి నోరు కొట్టుకుంటూ, శాపనార్థాలు పెడుతూ సమాజం మారదా అని ప్రశ్నించే కన్నా, చిన్నప్పటినుండే వారి అవసరాలకనుగుణంగా సరియైన సలహాదారులుగా ఎందుకు ఉండలేక పోతున్నాం. అలా ఉండలేక పోతున్నాం అని తెలుసుకోగలిగితే, కొన్ని వేల ఉపాయాలు మనసుకి తడతాయి.
ప్రతీ యువతకి తను సమర్ధుడినని తెలియాలి. తను దేనినైనా సాధించుకోగలనన్న నమ్మకం కలగాలి. ప్రేమ యుద్దం కాదని, యుద్దాన్నైనా గెలుకో గలిగే ఒక భావన అని తెలియజేయాలి. ఎదుటి వారిని మనసుని మనమెందుకు గెలుచుకోవాలో తెలియాలి. అది గెలవడానికి మనమేం చేయాలో తెలియాలి. మనం చేసే పనులే మన గమ్యాన్ని నిర్దేశిస్తాయని తెలియాలి. ఎదుటి వారికి హాని కలిగించడం ద్వారా ’మనసు గెలుచుకోవడం’ అనే project ఆగి పోతుంది అనే విషయం తెలియాలి. అది ఈ ఒక్క మనసే కాదు ఇప్పుడున్న ప్రసార మాధ్యమాల సారధ్యంలో కొన్ని వేల/లక్షల మనసు ప్రాజెక్ట్లను ఆపేస్తుందని తెలియాలి.
ఇవన్నీ వారికి తెలియవు. తెలుసుకొనే అవకాశం వారికి లేదు. తెలియజెప్పడానికి ఇప్పుడు కొత్త technology కావాలి. అందులో మనందరం భాగస్వామ్యులం కావాలి. అప్పుడే మనం మన రాష్టాన్ని ఇప్పుడున్న స్థానం నుండి మరో స్థానానికి మార్చొచ్చు. నా వయసులో ఉన్న తల్లిదండ్రులంతా ఊ ఉద్యమంలో భాగస్వాములైతే మరో ఇరవై ఏళ్ల తరువాత మనము ఊహించినట్టుగా మా పిల్లలు ఉండే అవకాశము ఉంది.

సాధ్యమౌతుందా?

No comments: